Wednesday, June 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‌మోడీ పుష్కర పాలన- ఒక పరిశీలన

‌మోడీ పుష్కర పాలన- ఒక పరిశీలన

- Advertisement -

దేశాన్ని “వికసిత్ భారత్”, “అమృత కాల్‌”, “ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ” అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన పన్నేండేం డ్లుగా ఎంతో గొప్ప ప్రచారం చేసుకుంటోంది. కానీ, దేశ ప్రజల దైనందిన జీవితాల్లో కనిపిస్తున్న వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఒకవైపు కొద్దిమంది కార్పొరేట్ దిగ్గజాల సంపద అపూర్వ స్థాయిలో పెరుగుతుంటే, మరోవైపు నిరుద్యోగం, ధరల పెరు గుదల, పన్నుల భారం అంతకన్నా ఎక్కువగా ప్రభావం చూపుతోంది.కార్మిక హక్కుల హరింపు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, ప్రజా సంక్షేమ పథకాల నిర్వీర్యం వంటి పరిణామాలు సామాన్య ప్రజలను తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తున్న మాట నిజం. “సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్” అనే నినాదం క్రమంగా “కార్పొ రేట్లకు లాభాలు – ప్రజలకు భారాలు” అనే వాస్తవంగా మారిపోవడమే మోడీ పుష్కర పాలనకు అసలు సిసలైన అర్థం. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని, రూపాయిని పటిష్టం చేస్తామని, అవినీతిని నిర్మూలిస్తామని, ఏడా దికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీలిచ్చింది. కానీ నేడు రూపాయి విలువ చారిత్రకంగా బలహీనపడిన స్థితిలో ఉంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల చమురు, గ్యాస్, ఎరువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి దిగుమతుల ఖర్చు పెరిగి, దాని ప్రభావం నేరుగా ప్రజలపై పడు తోంది. దేశ ఆర్థిక బలం గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం, రూపాయి విలువ నిరంతరం పడిపోవడానికి సమాధానం చెప్పలేకపోతోంది.

దేశ అప్పుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అనేక దశాబ్దాల్లో ఏర్పడిన అప్పుల కంటే గత పదేళ్లలోనే కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.200 లక్షల కోట్లకు భారీగా పెరిగాయి. ప్రభుత్వాలు సాధారణంగా అప్పులు చేయడం అసాధారణం కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులుగా మారి ఉపాధి, ఆదాయం, పరిశ్రమల అభివృద్ధికి దోహదపడాలి. అయితే ప్రస్తుతం అప్పులు పెరుగుతుండగా, ప్రజా సంక్షేమ ఖర్చులు తగ్గడం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం, ఉద్యోగాలు తగ్గిపోవడం కనిపిస్తోంది. అంటే అప్పుల భారం మాత్రం దేశ ప్రజలపై పడుతుండగా, దాని ప్రయోజనాలు ప్రజలకు చేరడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక కార్పొరేట్ అనుకూల విధానాల విషయానికి వస్తే, బీజేపీ ఈ పన్నెండేండ్ల పాలనలో దేశ ఆర్థిక విధానాల ప్రధాన లక్ష్యం గుత్తా పెట్టుబడి దారుల ప్రయోజనాలను కాపాడడమే అన్న అభిప్రాయం ప్రత్యక్షంగా కనబడుతోంది, బలపడుతోంది. కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గించడం ద్వారా లక్షల కోట్ల రూపాయల ప్రయోజనాన్ని పెద్ద కంపెనీలకు అందిం చింది. సంపన్నులపై విధించే సంపద పన్నును తొలగించింది. పెద్ద కార్పొరేట్ రుణాలను బ్యాంకులు రద్దు చేయడం, లేదా మాఫీ చేయడం సాధారణ విషయంగా మారింది. అదే సమయంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు,కార్మికులు, రైతులు, జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ పన్నులు, విత్తనాల ధరలు, విద్యుత్ చార్జీలు, నిత్య జీవిత అవసర వస్తువులు, రైల్వే చార్జీలు, వంటగ్యాస్ ధరల రూపంలో నిరంతరం భారం మోయాల్సి వస్తోంది.

జీఎస్టీ “ఒక దేశం – ఒక పన్ను” అంటూ తీసుకొచ్చినా, వాస్తవానికి అది సామాన్య ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఉప్పు నుండి చెప్పు వరకు, పెన్సిల్ నుండి పిల్లల విద్యా సామగ్రి వరకు, దాదాపు ప్రతి వస్తువు పన్ను పరిధిలోకి వచ్చింది. ధనికులు, పేదలు ఒకే రకమైన జీఎస్టీ చెల్లించడం వల్ల పన్ను వ్యవస్థ మరింత అసమానంగా మారింది. ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నులపై ప్రభుత్వం అధికంగా ఆధారపడటం వల్ల పేద ప్రజలే ఎక్కువగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన సందర్భాల్లో కూడా దేశ ప్రజలకు ఆ ప్రయోజనం అందలేదు. పెట్రోల్, డీజిల్‌పై భారీ ఎక్సైజ్ సుంకాలు విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపా యలు వసూలు చేస్తున్నది. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్ బంక్ వద్ద మొదలైన ధరల భారం, చివరికి కూరగాయల మార్కెట్ వరకు చేరింది. అలాగే నిరుద్యోగం పరిస్థితి మరో తీవ్రమైన సమస్య. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, లక్షలాది యువతను ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థితిలో ఉంచింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, రైల్వేల్లో, రక్షణ రంగంలో, బ్యాంకుల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు ఎనిమిది లక్షలు ఖాళీలు ఉన్నప్పటికీ నియామ కాలు జరగడం లేదు. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు, ఎఫ్‌‌టిపి (ఫిక్స్‌‌డ్‌ ‌టర్మ్‌ ఎంప్లాయ్‌‌ మెంట్‌), ఔట్‌సోర్సింగ్, గిగ్ ఉపాధి పెరుగుతోంది. ఉన్నత విద్య పూర్తిచేసిన యువత కూడా తాత్కాలిక పనుల కోసం పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ప్రభుత్వరంగ సంస్థలపై వ్యవస్థీకృత దాడి కొనసాగు తోంది.

దీనికి కొనసాగింపుగానే ఎంఎంపి పేరుతో దేశ ప్రజల సొత్తైన రహదారులు, రైల్వే మౌలిక వసతులు, విద్యుత్ ప్రసార వ్యవస్థలు, గిడ్డంగులు, పోర్టులు, ప్రభుత్వ భవనాలు విమానాశ్రయాలు వంటి ప్రజా ఆస్తులను దీర్ఘకాలిక లీజుల ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానం అమల్లోకి వచ్చింది. ప్రజల డబ్బుతో నిర్మించిన ఆస్తుల ద్వారా వచ్చే ఆదా యాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడం దేశ ఆర్థిక స్వావలం బనను బలహీనపరుస్తోంది. కార్మికుల పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంది. లేబర్‌‌కోడ్స్‌ పేరుతో తీసుకొచ్చిన చట్టాల ద్వారా దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించిన అనేక హక్కులు బలహీనపడే ప్రమాదం ఏర్పడింది. పని గంటల పెంపు, సమ్మె హక్కుపై ఆంక్షలు, కాంట్రాక్టు ఉద్యోగాల విస్తరణ, ట్రేడ్ యూనియన్ కార్య కలాపాలపై పరిమితులు, యాజ మాన్యాలకు అధిక అధికారాలు వంటి అంశాలు కార్మిక సంఘాల ఆందోళనలకు కారణమవుతున్నాయి. కనీస వేతనాలు చెల్లించాలనే ప్రస్తావన, దానిపై విధి విధానాలు పేర్కొనకుండానే కేంద్రం లేబర్ కోడ్లను రూపొందించింది. కార్మికులను యాజమాన్యాల దయా దాక్షిణ్యాలకు వది లేసింది. కార్మికులను భాగస్వాములుగా కాకుండా చౌకైన శ్రమశక్తిగా మాత్రమే చూడటం ఈ విధానాల వెనుక ఉన్న అసలు దృక్పథం. అలాగే గ్రామీణ భారతదేశానికి జీవనాధారంగా ఉన్న ఉపాధి చట్టం స్థానంలో విబిజిరామ్‌‌జి పథకాన్ని ప్రవేశపెట్ రైతులు, వ్యవసాయకూలీల పొట్టకొట్టింది. విద్యుత్ రంగం నిర్ణయాల వలన కూడా ప్రజలపై భారం పెరుగుతోంది. విద్యుత్ చార్జీలు పెరగడం, సబ్సిడీలు తగ్గడం, ప్రైవేటీకరణ ఒత్తిడి పెరగడం వల్ల గృహ వినియోగదారులు, రైతులు, చిన్న పరిశ్రమలు తీవ్రంగా ప్రభావి తమవుతున్నారు.

విద్యుత్ ధరల పెరుగుదల మళ్లీ అన్ని వస్తువుల ఉత్పత్తి ఖర్చులను పెంచి ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతోంది.ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే, బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న “అభివృద్ధి” ప్రధానంగా కార్పొరేట్ లాభాల చుట్టూ తిరుగుతుండగా, ఆ అభివృద్ధి ఖర్చు మాత్రం ప్రజలపై మోపబడుతోంది. దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమ వుతుండగా, ప్రజా రంగం బలహీనపడుతోంది. ఉద్యోగాలు తగ్గుతున్నాయి. కార్మిక హక్కులు క్షీణిస్తున్నాయి. ప్రజల ఆస్తులు అమ్ముడవుతున్నాయి. పన్నుల భారం పెరుగుతోంది. ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందువల్ల నేడు దేశ ప్రజల ముందున్న ప్రశ్న కేవలం ఒక ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, దేశ ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామ్య భవిష్యత్తును ఏ దిశలో తీసుకెళ్లాలన్నది ఆలోచిం చాలి. ప్రజల ఆస్తులను కాపాడుకోవడం, కార్మిక హక్కులను రక్షించుకోవడం, యువతకు ఉద్యోగాలు సాధించడం చాలా ముఖ్యం. ప్రజలపై పన్నుల భారం తగ్గించడం, సంపద పంపిణీలో న్యాయం సాధించడం, కార్పొరేట్ అనుకూల విధానాలకు ప్రత్యామ్నాయం నిర్మించడం వంటి అంశాల చుట్టూ విస్తృత ప్రజా చర్చ, ఉద్యమాలు కొనసాగించడమే ప్రజల ముందున్న కర్తవ్యం.

ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌, 9490300867

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -