మంత్రి జూపల్లి కృష్ణారావు
కళాకారులపై పోలీసుల వేధింపులు ఆపాలి : మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
బ్యాండ్ కళాకారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి : బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి నాగరాజు
ఎస్వీకేలో రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ – ముషీరాబాద్
డప్పు, బ్యాండ్, వాయిద్య కళాకారులు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అర్హులైన కళాకారులకు పెన్షన్ కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ వీఎస్ టీ చౌరస్తా నుంచి బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు కళాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పండుగలు, జాతరలు, వివాహాలు, సామాజిక ఉద్యమాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వాయిద్య కళాకారుల పాత్ర విశిష్టమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో బ్యాండ్ కళాకారులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కళాకారులకు తగిన గుర్తింపు దక్కలేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కళాకారుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని పెన్షన్, గుర్తింపు కార్డులు, శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంఘ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సమాజంలో చైతన్యం పెంపొందించేందుకు చేపట్టనున్న ప్రభాత భేరి కార్యక్రమంలో బ్యాండ్, వాయిద్య కళాకారులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కళాకారుల సహకారం అవసరమన్నారు.
మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. బ్యాండ్ వాయిద్య కళాకారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. బ్యాండ్ కళాకారుల సంక్షేమానికి రూ.1000 కోట్ల ప్రత్యేక నిధి కేటాయించడం కష్టమైన పని కాదన్నారు. కళాకారులపై పోలీసుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన కళాకారులకు సంబంధించి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ తరగతుల కళాకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బ్యాండ్ కళాకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని, పోలీసుల వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కళాకారుల హక్కుల సాధనకు తాను అండగా ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ముందుగా కళాకారుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామన్నారు.
ప్యాడ్ బ్యాండ్‌కు ఆదరణతో వృత్తిపై ప్రతికూల ప్రభావం
బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండ్లీలు, భరాత్‌లు, బోనాలు, వినాయక చవితి వివిధ ఉత్సవాలకు ఊరేగింపులో బ్యాండ్ కళాకారుల ప్రదర్శన ఆకర్షనీయంగా ఉంటుందని చెప్పారు. అయితే సాంకేతికత పెరగడంతో ‘ప్యాడ్ బ్యాండ్’ వ్యవస్థ వచ్చి ప్రజల ఆదరణ పొందిందని, ఇప్పుడు అదే తమ వృత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజేలపై ఉన్న ఆంక్షలను బ్యాండ్ వాహనాలపైనా అమలు చేస్తూ పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బ్యాండ్ వాహనం కనబడితే సీజ్ చేస్తున్నారని, కళాకారులపై కేసులు పెడుతున్నారని అన్నారు. బ్యాండ్ వాహనాలను సీజ్ చేయడం వల్ల పెండ్లీల సీజన్‌లో ఉపాధి కోల్పోతున్నామని తెలిపారు. ప్రభుత్వం సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ వేసి ఒక నిర్ధారణకు రావాలని కోరారు. బ్యాండ్ కళాకారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ నిధికి రూ.1000 కోట్లు కేటాయించాలన్నారు. వడ్డీ రహిత రుణాలు అందజే యాలన్నారు. సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేసి 50 సంవత్సరాలు దాటిన కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కళాకారులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఈ సదస్సులో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు విమలక్క, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, టీపీఎస్‌కే అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, మత్స్యకారులు మత్య్సకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, బ్యాండ్, వాయిద్య కళాకారులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు.



