సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి
ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపి..
కందకాలు తీయడం నిలిపేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం
కార్పొరేట్లతో జతకట్టి ఖనిజ సంపదను కొల్లగొడుతున్న కేంద్రం : మాజీ ఎంపీ మీడియం బాబురావు
ఏటూరునాగారం ఐటీడీఏ ముట్టడి
నవతెలంగాణ-ఏటూరు నాగారం ఐటీడీఏ
తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీల భూములకు అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం హక్కు పత్రాలు మంజూరు చేయాలని, ఆదివాసీల రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాసే చర్యలను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. సోమవారం ములుగు జిల్లాలో ఆదివాసులు వేలాది మంది డోలు వాయిద్యాలతో వై జంక్షన్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి ఏటూర్‌నాగారం ఐటీడీఏను ముట్టడించారు. ఫారెస్ట్ అధికారుల దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో లెనిన్ వాత్సల్ టోపో ధర్నా ప్రాంతానికి చేరుకుని… సమస్యలను పరిష్కరించడానికి అధికారులతో చర్చించి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పీవోకు అందజేశారు. అంతకుముందు జరిగిన ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ… దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై ఆదివాసీలకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 11లక్షలమంది దరఖాస్తు పెట్టుకుంటే కేవలం 4లక్షల మందికే హక్కు పత్రాలిచ్చి గత ప్రభుత్వం చేతులు దులుపుకుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గిరిజనులు, గిరిజనేతరులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని చెప్పిన హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అటవీశాఖ అధికారులు ఆదివాసీలను వేధించడం, సాగు భూముల్లో బలవంతంగా ప్లాంటేషన్ పనులు చేపట్టడం, భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేయడం అన్యాయమని అన్నారు. ఆదివాసీల జీవనాధారమైన భూములను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఆదివాసీల హక్కులను హరించే చర్యలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించి ఉద్య మాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించేవరకు ఐటీడీఏ ఎదుట వంటావార్పు కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు.
మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు మాట్లాడుతూ… ఆదివాసీలకు భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్లో అనేక హక్కులు కల్పించిందని అన్నారు. 1/70 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చే కుట్రలను ఆదివాసులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జీఓ-3ను పునరుద్ధ రించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ సంపద, జల వనరులను బీజేపీ ప్రభుత్వం పెట్టుబడి దారులతో కలిసి కొల్లగొడుతోందని విమర్శించారు. దేశంలో గిరిజన, గిరిజన తెగలు ఎక్కడున్నా రెవెన్యూ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. వారికి సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నాయని, వారిని ఆదివాసీలుగా ఎందుకు గుర్తించడం లేదని, క్యాస్ట్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ హక్కుల పత్రాలు ఉన్న భూముల్లోకి ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్లను అనుమతించడం లేదని అన్నారు. బోర్లు వేస్తుంటే అడ్డుకుంటున్నారని తెలిపారు. ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని, ప్లాంటేషన్ల పేరుతో కందకాలు తీస్తూ ఆదివాసీలను వేధించొద్దని కోరారు. లేదంటే ఆదివాసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బి సాంబశివ, కార్యదర్శివర్గ సభ్యులు ఎండి దావూద్, రత్నం రాజేందర్ , గ్యానం వాసు , చిట్టిబాబు, రఘుపతి, గొంది రాజేష్ చిరంజీవి, దామోదర్, కుమ్మరి శ్రీను, బచ్చల కృష్ణ బాబు, కట్ల చారి, నగేష్, కిష్టయ్య, ప్రవీణ్, రవి, చారి, నరేష్, రాజుతో పాటు వేలాది మంది ఆదివాసీలు పాల్గొన్నారు.
ఆదివాసీల హక్కులు హరిస్తే ఊరుకోం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



