దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా
ఐక్యంగా పోరాడాలి :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్
జనగామలో ఏసిరెడ్డి నర్సింహారెడ్డి 35వ వర్ధంతి సభ
నవతెలంగాణ-జనగామ
ఏసి రెడ్డి నరసింహారెడ్డి త్యాగాల బాటలో యువతరం నడవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ పిలుపునిచ్చారు. సోమవారం జనగామ జిల్లాలోని ఏసి రెడ్డి నగర్‌లో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, జనగామ మాజీ ఎమ్మెల్యే అమరజీవి ఏసి రెడ్డి నరసింహారెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా స్మారక సభ నిర్వహించారు. అంతకుముందు ఎండీ అబ్బాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏసి రెడ్డి నరసింహారెడ్డి చిత్రపటానికి రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎండీ అబ్బాస్ మాట్లాడారు. దోపిడీ, పీడన, వివక్ష, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఏసి రెడ్డి నరసింహారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీలు వరుసగా చోటుచేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. పేదలకు ఇండ్లు, రైతులకు గిట్టుబాటు ధర, కూలీలకు ఉపాధి, నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం నిరంతరం పోరాడుతున్నది ఎర్రజెండానేనని పేర్కొన్నారు. ఏసి రెడ్డినగర్ ఆదర్శ కాలనీగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం.కనకారెడ్డి మాట్లాడుతూ… అనేక మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే ఏసి రెడ్డి నగర్ ఏర్పడిందన్నారు. కాలనీ అభివృద్ధి కోసం పార్టీ అనేక పోరాటాలు నిర్వహించిందని, జిల్లా కేంద్రంలో జరిగే ప్రతి ప్రజా ఉద్యమంలో ఏసి రెడ్డి నగర్ ప్రజల పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి, జిల్లా కమిటీ సభ్యుడు గోపి, మాజీ కౌన్సిలర్ ఎండి దస్తగిరి తదితరులు ఏసి రెడ్డి సేవలను స్మరించుకున్నారు. వర్ధంతిని పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు క్రీడా పోటీలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఉద్యమంలో పాల్గొని మరణించిన వారికి నివాళులర్పించడంతో పాటు ఉద్యమ కేసులు ఎదుర్కొన్న వారిని సన్మానించారు. అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించారు. ఏసి రెడ్డి త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను కొనసాగిస్తామని నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, భూక్య చందు నాయక్, పి. ఉపేందర్, ఎండి అజహరుద్దీన్, పట్టణ కమిటీ సభ్యులు పల్లెర్ల లలిత, పందిల్ల కళ్యాణి, బాల్నే వెంకట మల్లయ్య, బూడిది ప్రశాంత్, మంగ బీరయ్యతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
‘ఏసి రెడ్డి’ త్యాగాల బాటలో యువతరం నడవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



