అస్తవ్యస్తంగా
అమెరికా ఆర్థిక వ్యవస్థ
ఏడాదిన్నర ప్రయాణంలో ఎదురుదెబ్బలు
తగ్గని ధరలు.. పెరగని
వాషింగ్టన్ : ‘ధరలు తగ్గిస్తా.. అమెరికన్లకు ఉద్యోగాలు తెస్తా.. మధ్యతరగతి జీవితాన్ని మెరుగుపరుస్తా’ అంటూ అధికారంలోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్ పాలనలో విఫలమయ్యారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయ్యాయి. ద్రవ్యోల్బణం ఇప్పటికీ ఫెడరల్ రిజర్వ్ లక్ష్యమైన 2 శాతం కంటే పైనే ఉండగా.. తయారీ రంగంలో ఉద్యోగాలు బైడెన్ పాలన ముగిసిన నాటి కంటే తక్కువగా ఉన్నాయి. ఇండ్ల ధరలు, కుదువ వడ్డీ రేట్లు, బీమా వ్యయాలు మధ్యతరగతి కుటుంబాలను వేధిస్తున్నాయి. టారిఫ్‌లు, వలసల నియంత్రణ, ఇరాన్ యుద్ధంతో పెరిగిన చమురు ధరలు ఆర్థిక వ్యవస్థకు కొత్త షాక్‌లు ఇస్తుండగా.. ట్రంప్ చెప్పిన ఆర్థిక బూమ్ గాలి బుడగేనని తేలిపోయింది.
ట్రంప్ విధానాల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఉద్యోగాల మార్కెట్లో ఒత్తిడి పెరుగుతోంది. వలసలపై కఠిన ఆంక్షలు, అక్రమ వలసదారుల బహిష్కరణలతో కార్మికుల లభ్యత తగ్గుతోంది. ఇప్పటికే వృద్ధాప్యానికి చేరుతున్న స్థానిక జనాభాతో మరింత ఒత్తిడి పెరుగుతోంది. తయారీ రంగాన్ని తిరిగి అమెరికాకు తీసుకువచ్చి భారీగా ఉద్యోగాలు సృష్టిస్తా మని ట్రంప్ హామీ ఇచ్చిన్నప్పటికీ తయారీ ఉద్యోగాల సంఖ్య బైడెన్ పదవీకాలం ముగిసిన జనవరి 2025తో పోలిస్తే భారీగా తగ్గింది. ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంతో నిర్మాణ రంగంలో ఉద్యోగాలు పెరిగినప్పటికీ అది ట్రంప్ వాగ్దానం చేసిన విస్తృత తయారీ పునరుజ్జీవనానికి సమానంగా కనిపించడం లేదు.
ధరలతో ట్రంప్‌నకు ఎదురుదెబ్బే..
2024 ఎన్నికల ప్రచారంలో ద్రవ్యోల్బణం, జీవన వ్యయం ప్రధాన అంశాలుగా మారాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గుతాయన్న అంచనాలు నెరవేరలేదు. ద్రవ్యోల్బణం తగ్గే ఆశలు మందగిం చాయి. దిగుమతులపై పెంచిన టారిఫ్‌లు కొన్ని వస్తువుల ధరలను పెంచు తుండగా.. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధర బ్యారెల్‌కు సుమారు 100 డాలర్లకు చేరింది. పశ్చిమాసియా యుద్ధానికి ముందు స్థాయితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం ఎక్కువ. ఇంధన ధరల పెరుగుదల రవాణా, ఉత్పత్తి, వినియోగ వస్తువుల ఖర్చులను పెంచి ద్రవ్యోల్బణాన్ని మళ్లీ వేగవంతం చేసే ప్రమాదం ఉంది.
మధ్యతరగతి పరిస్థితి మరింత ఆందోళనకరం
కుటుంబాల చేతిలో పన్నుల తర్వాత మిగిలే ఆదాయం తగ్గిపోయింది. అధిక ధరలు అమెరికా ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇళ్ల ధరలు, తనఖా రేట్లు, గృహ బీమా ప్రీమియాలు అధికంగా ఉండటంతో ఇంటి కొనుగోలు సాధారణ కుటుంబాలకు మరింత భారంగా మారింది. మరోవైపు సంపన్న వర్గాల ఆదాయాలు, సంపద పెరుగుతుండగా దిగువ, మధ్యతరగతి కుటుంబాలపై ఖర్చుల భారం కొనసాగుతుండటంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు ఎఐ రంగంలో భారీ పెట్టుబడులే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మద్దతుగా నిలుస్తున్నాయి. స్థూలంగా ట్రంప్ వాగ్దానం చేసిన చౌక ధరలు, భారీ తయారీ ఉద్యోగాలు, మెరుగైన మధ్యతరగతి జీవితం మాత్రం ఎక్కడ కనిపించడం లేదనే విమర్శలు పెరిగాయి. త్వరలో జరగనన్న మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ మూడు అంశాలే ట్రంప్ ఆర్థిక విధానాలకు అసలు పరీక్షగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగాలు
పాలనలో ట్రంప్ విఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



