నవతెలంగాణ-హైదరాబాద్ : టీ20 క్రికెట్లో గతేడాది అక్టోబర్‌లో నమీబియా.. సౌతాఫ్రికాను ఓడించి పెను సంచలనం సృష్టించింది. ఆ పసికూన జట్టు మరోసారి అదే సంచలనాన్ని పునరావృతం చేసింది. 10 నెలల వ్యవధిలోనే మళ్లీ సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ట్రై సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో నమీబియా 18 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఆ జట్టులో జాన్ ఫ్రైలింక్(60) హాఫ్ సెంచరీ బాదాడు. మరో ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్(41) కూడా రాణించాడు. ఆ జట్టులో వీరిద్దరు మాత్రమే సత్తాచాటగా.. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్(19) సహా మిగతా వాళ్లు సౌతాఫ్రికా బౌలింగ్ ముందు నిలువలేకపోయారు. అనంతరం బంతితో పసికూన జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. చేజింగ్‌లో దక్షిణాఫ్రికాను నిలువరించింది. నమీబియా బౌలర్లు రూబెన్ ట్రంపెల్మాన్, జేజే స్మిత్ చెరో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పనిపెట్టారు. సౌతాఫ్రికా జట్టులో డెవాల్డ్ బ్రెవిస్(75) ఒక్కడే పోరాడాడు. మిగతా వారిలో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. ముగ్గురు పరుగుల ఖాతా కూడా తెరవలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బ్రెవిస్ మాత్రం జట్టును గెలిపించడానికి చెమటోడ్చాడు. కానీ, అతని పోరాటం ఫలించలేదు. చివరికి 18వ ఓవర్లో ట్రంపెల్మాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. డువాన్ జాన్సెన్(25 నాటౌట్) ఆఖరి వరకూ నిలిచినా ఎలాంటి అధ్బుతం చేయలేకపోయాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 28 రన్స్ అవసరమవ్వగా.. జేజే స్మిత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు తీయడంతోపాటు 9 రన్సే ఇవ్వడంతో నమీబియా మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
మరో సంచలనం..సౌతాఫ్రికాను ఓడించిన నమీబియా
- Advertisement -
- Advertisement -



