Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌లో ప్రమాదం

- Advertisement -

వేదాంత పవర్‌ ప్లాంట్‌లో పేలుడు
11మంది కార్మికులు మృతి.. 15మందికి గాయాలు
మృతుల కుటుంబాలకు సీఎం విష్ణు దేవ్‌ సారు సంతాపం
సక్తీ:
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేదాంత పవర్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, సక్తీ జిల్లా సింఘితెరారు గ్రామంలో ఉన్న వేదాంత పవర్‌ ప్లాంట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌లో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన కార్మికులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతావారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. గాయపడిన వారిని సమీపంలోని రాయగఢ్‌ జిల్లా ఆస్పత్రులకు తరలించారు.పేలుడు తీవ్రత కారణంగా పరిసర ప్రాంతం అధిక ఉష్ణోగ్రతలతో ప్రమాదకరంగా మారింది. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. ప్రమాద స్థలంలో శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని రారుగఢ్‌ ఎస్‌డీఎం మహేశ్‌ శర్మ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

స్పందించిన సీఎం విష్ణుదేవ్‌సారు..
మృతుల కుటుంబాలకు సంతాపం

ఈ ఘటనపై ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సారు స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఘటనా స్థలంలో ఉందని, సహాయక, రెస్క్యూ కార్యకలాపాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మేర మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు.మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బాధితులకు తగిన పరిహారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -