ఉభయ సభల్లో తొమ్మిది బిల్లులు ఆమోదం
లోక్సభలో 93 శాతం,రాజ్యసభలో 110 శాతం ఉత్పాదకత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఉభయ సభల్లో మొత్తం తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. మూడవ వంతు మెజారిటీ రాకపోవడంతో కీలకమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. లోక్సభలో 93 శాతం, రాజ్యసభలో 110 శాతం కార్యకలాపాలు జరిగాయి. శనివారం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే, స్పీకర్ ఓం బిర్లా సమావేశ వివరాలను వెల్లడించారు. లోక్సభ 93 శాతం జరిగినట్టు తెలిపారు. ఆ తరువాత ఆయన సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. రాజ్యసభ సుమారు 157 గంటల 40 నిమిషాల పాటు సాగినట్టు చెప్పారు. సుమారు 110 శాతం జరిగిందని తెలిపారు.
జనవరి 28న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో మూడు విడతలుగా 31 రోజుల పాటు సభా కార్యకలాపాలు జరిగాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత సమావేశాలు జరిగాయి. మార్చి 9న ప్రారంభమైన రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 2 వరకు జరిగి వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 16న మూడో విడత సమావేశాలు ప్రారంభమై మూడు రోజులపాటు పాటు జరిగి శనివారం ముగిశాయి. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదటి విడత ప్రారంభమైంది. ఫిబ్రవరి 1న 2026-27 బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో 87 మంది సభ్యులు ఉభయ సభల్లో పాల్గొన్నారు. బడ్జెట్ పై జరిగిన చర్చలో ఉభయ సభల్లో 160 మంది సభ్యులు పాల్గొన్నారు. ప్రతిపక్షం పట్ల పక్షపాతంగా వ్యవహరించిన స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలనే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చలో 53 మంది సభ్యులు పాల్గొన్నారు.
తొమ్మిది బిల్లులు ఆమోదం
ఉభయసభల్లో మొత్తం తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్తో కలిసి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లోక్సభలో 12 బిల్లులు, రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టినట్టు చెప్పారు. లోక్సభలో సెలెక్ట్ కమిటీ నివేదించిన ప్రకారం జన్విశ్వాస్ బిల్లును ఉపసంహ రించుకున్నట్టు చెప్పారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాలు 13 రోజులు, రెండో విడత సమావేశాలు 15 రోజులు, మూడో విడత సమావేశాలు మూడు రోజులు పాటు జరిగాయని తెలిపారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ప్రతిపక్షాలు ఈ బిల్లును అడ్డుకుని మహిళల పట్ల వ్యతిరేకతను చాటుకున్నాయని మండిపడ్డారు. ఇందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా శిక్షను అనుభవిస్తాయన్నారు. లోక్సభలో బిల్లు విఫలమవడం పట్ల ప్రభుత్వం తీవ్ర నిరాశ చెందిందని, అయితే.. ఇందులో కేంద్ర, బీజేపీ వైఫల్యమేమీ లేదని స్పష్టం చేశారు. ఇది అందరికీ ఓ చీకటి రోజు అని, కాంగ్రెస్ సంబురాలు చేసుకుంటున్న తీరు సిగ్గుచేటు, ఖండించదగినదని రిజిజు అన్నారు.
ఉభయ సభలు ఆమోదించిన బిల్లుల జాబితా
1. పారిశ్రామిక సంబంధాల కోడ్ (సవరణ) బిల్లు
2. అప్రొపియేషన్ బిల్లు
3. ట్రాన్స్ జెండర్ (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు
4. అప్రొపియేషన్ (నెం.2) బిల్లు
5. ఫైనాన్స్ బిల్లు
6. దివాలా అండ్ బ్యాంక్రప్సీ కోడ్ సవరణ బిల్లు
7. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు
8. జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు
9. కేంద్ర సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు
ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



