నవతెలంగాణ-ఆత్మకూర్
డిజిటల్ చెల్లింపులపై రుసుముల భారాన్ని మోపొద్దని, యూపీఐపై వ్యాపారి రుసుము (ఎండీఆర్) విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. అమరచింత మండలంలో మంగళవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ కూతుబ్ మాట్లాడుతూ.. రూ. 2000 దాటిన వ్యాపారి లావాదేవీలపై 0.4% రుసుము, రూ. 75 వేలు పైబడిన లావాదేవీలపై గరిష్టంగా రూ. 300 వరకు చార్జీ విధించే కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
యూపీఐ అనేది ప్రజల సౌకర్యం కోసం ఉన్న డిజిటల్ ప్రజా మౌలిక వసతి అని, దీనిని రుసుముల విస్తరణకు మార్గంగా మార్చకూడదన్నారు. ఈ రుసుము భారం చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి యువతపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులపై వేసే రుసుమును వినియోగదారులపైకి బదిలీ చేయకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలని, యూపీఐ ఛార్జీలపై పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఉదయ్ కుమార్, నవదీప్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.


