Sunday, June 7, 2026
E-PAPER
Homeప్రత్యేకంబడి ఎరుగని బాల్యం

బడి ఎరుగని బాల్యం

- Advertisement -

2026 జూన్‌ 12న తెలంగాణాలో బడిగంట మోగుతోంది. బడి ఈడు పిల్లలందరు పలకా, బలపం, పుస్తకాలతో బడికి వెళ్లాలి. కానీ అందరి బాల్యం ఒకే లాగా లేదు. లేత చేతులలో పలుగూ, పార పట్టుకొని కూలీ పనికి పిల్లలు వెళ్తున్నారంటే.. ‘ఈ పరిస్థితికి కారణం ఎవరు, మార్పుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి’ అని మేథావులందరు ఆలోచించాల్సిన తరుణమిది. ఆరేండ్ల నుండి పధ్నాలుగేండ్ల పిల్లలందరు బడికి వెళ్లాలి. ఇది రాజ్యాంగంలో లిఖించబడ్డ ప్రాధమిక హక్కులలో ఒకటి. కానీ నేడు చాలా మంది పిల్లలు ఈ హక్కుకు దూరమవుతున్నారు.

childhood is for learning, not for earning. అక్షరాలు దిద్దాల్సిన బాల్యం, ఆడుకోవాల్సిన చిన్నారులు, పుస్తకం పట్టుకోవాల్సిన చేతులు పాచిపనికి వెళ్తున్నాయంటే, రాబోయే తరాలను అజ్ఞానంలోకి తోసేసినట్లే. సమాజాభివద్ధి కుంటుపడినట్లే. బాలలు దేశానికి, సమాజానికి ఎంతో విలువైన సంపద. భవిష్యత్తులో ఉత్పాదకతతో కూడిన మానవ వనరులకు నష్టం కలిగినట్లే. ఈ పరిస్థితి కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా 160 మిలియన్ల బడి ఈడు పిల్లలు, శ్రామిక యంత్రాలుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ సమస్యను అర్థంచేసుకొని, దాని వల్ల బాల్యానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసి, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపటానికి ఐక్యరాజ్య సమితి కొన్ని మార్గనిర్దేశాలను రూపొందించింది. విధిగా బాలల సంరక్షణను, సంక్షేమాన్ని చూసుకోవలసిన బాధ్యత ప్రపంచంలోని ప్రజలందరిదీ. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా 2002లో జూన్‌ 12 వ తేదీని ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం (world day against child labour) గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పిల్లలు చదువుకు దూరం కావడానికి గల కారణాలను తెలుసుకుందాం.

రకరకాలగా నేరవత్తులలో…
ఏ దేశంలో అయినా పేదరికం, నిరుద్యోగ సమస్యలు బాలకార్మిక వ్యవస్థకు హేతువులుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ పని ప్రదేశాలు అంత సురక్షితంగా లేకపోవటం వల్ల పిల్లలు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తోంది. ఇది కాదనలేని సత్యం. పిల్లలు ముఖ్యంగా వ్యవసాయపనులలో, మైనింగ్‌, ఫ్యాక్టరీ, నిర్మాణ రంగాలలో, చిరువ్యాపారాలలో, ఇళ్లల్లో, హోటళ్లలో పని చేయడాన్ని ఎక్కువగా గమనించవచ్చు. అంతేకాక అత్యంత ప్రమాదకరమైన మందుగుండ్ల తయారీలో, భిక్షాటనలో, వ్యభిచార కూపంలో కూడా నెట్టబడుతున్నారు. ఈ పనులు చేయడానికి పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేదు. అవన్నీ వారితో బలవంతంగా చేయిస్తున్నవే. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలు, అవసరాల కోసం కన్నవారు అమ్మిన పిల్లలు రకరకాలగా నేరవత్తులను చేపడుతున్నారు. సమాజానికి హానికారకంగా మారుతున్నారు.

ఆశించినంతగా ఫలితాలు లేవు
కోవిడ్‌ మహమ్మారి తరవాత పేదరికం ఇంకా పెరిగిందని చెప్పవచ్చు. కారణాలు ఏవైనా పిల్లలందరికీ గౌరవంగా జీవించగలిగే పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద ఇటు ప్రజల పై కూడా ఉంది. బాలకార్మిక వ్యవస్థను దూరం చేయడానికి ప్రభుత్వాలు, కార్మిక సంస్థలు, యజమానులు, పౌర సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాల కార్మికులను గుర్తించి కావలసిన వసతులను కల్పించాలి. నాణ్యమైన విద్యను అందించాలి. ముఖ్యంగా ఉచిత విద్య, ఆహార పథకాలను ప్రవేశపెట్టాలి. ఇప్పటికే కొన్ని దేశాలు బాలలకు ఉచిత విద్యను అందిస్తున్నాయి. మన దేశంలో కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. వారు పని బాట పట్టకుండా ఉండడానికి జాతీయ మధ్యాహ్న భోజన పథకాలను కూడా ప్రవేశ పెట్టారు. లాభాపేక్ష లేని కొన్ని సంస్థలు, దాతలు ముందుకి వచ్చి పుస్తకాలను పంచుతున్నారు. కాని అనుకున్నంత శాతం పిల్లలు బడికి రావటం లేదు. వచ్చినా మధ్యలో చదువు మానేస్తున్నారు. కొన్ని వారి వ్యక్తిగత కారణాలు. మరికొన్ని పాఠశాలలో సురక్షిత వాతావరణం లేకపోవటమని చెప్పవచ్చు.

కారణాలను గుర్తించాలి
భారత ప్రభుత్వం 2015 నుండి ‘బేటీ బచావో-బేటీ పడావో’ నినాదంతో, బాలికా విద్యకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చింది. కానీ చాలా పాఠశాలలలో అవసరమైనన్ని శౌచాలయాలు అందుబాటులో లేవు. ఉన్నా వాటిలో నీటి వసతి సరిగా లేదు. ఆడపిల్లలు చదువు మధ్యలో ఆపేయడానికి ఇది ఒక ప్రథాన కారణం. బాల్యవివాహ నిషేధ చట్టం ఉన్నా, అనధికారికంగా బాల్యవివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కష్టపడి బడికి వచ్చినా పిల్లలకు నాణ్యమైన విద్య అందడంలేదని ఒక వాదన. ఎందుకంటే పిల్లల సంఖ్యకు కావలసినంత ఉపాధ్యాయుల నియామకం జరగకపోవడం. మాతభాషలో విద్యా బోధన జరగకపోవడంతో పిల్లలకు విషయం అర్థంకాక బడికి రావడానికి ఆసక్తి చూపడం లేదు. స్కూల్‌ డ్రాపౌట్లను గుర్తించాలి. కారణాలను తెలుసుకొని, బడికి వచ్చేట్లుగా ప్రోత్సహించాలి. పిల్లల తల్లిదండ్రులకు విద్య యొక్క ప్రాథాన్యత, అవసరాలను తెలియజేయాలి. పాఠశాల స్థాయిలోనే వత్తి విద్యలను కూడా నేర్పించాలి.

పిల్లల భవిష్యత్తు బడిలోనే
భారతదేశ ప్రభుత్వం, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మిషన్‌ వాత్సల్య’ పేరుతో తప్పిపోయిన, అనాథ పిల్లలను, దొంగతనం చేసి నేరం అంగీకరించిన పిల్లలకు ఆశ్రయం కల్పించి, పాఠశాలలకు పంపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల ప్రభుత్వాలు పిల్లల భవిష్యత్తు బడిలోనే ఉందని గ్రహించి, ప్రోత్సాహాలను అందిస్తున్నాయి. కానీ బడిబాట పట్టని బాల్యం ఎంతో ఉంది. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది జూన్‌ 14న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేకదినోత్సవం పేరుతో ప్రత్యేకమైన థీమ్‌ తో వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. తల్లిదండ్రులందరూ పిల్లల చదువుకునే హక్కును గౌరవిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాట ‘బడిబాట’ అని గుర్తించాలి. అక్షరదీపాన్ని వెలిగించడానికి పౌరులందరూ చేయి చేయి కలిపి కలిసికట్టుగా ముందుకు సాగాలి.
‘Protect children today for a stronger tomorrow’.

డా. నీరజ అమరవాది
9849160055

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -