Tuesday, June 16, 2026
E-PAPER
Homeజాతీయంరిజర్వేషన్ అమలుకు అతిపెద్ద అడ్డంకి బీజేపీ: బృందా కరత్

రిజర్వేషన్ అమలుకు అతిపెద్ద అడ్డంకి బీజేపీ: బృందా కరత్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ అమలుకు అతిపెద్ద అడ్డంకిగా బీజేపీ వ్యవహరించిందని సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు బృందా కరత్ విమర్శించారు. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) కేరళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో నిర్వహించిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు: వాస్తవికత ఏమిటి? అనే అంశంపై జరిగిన సెమినార్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు విద్య, ఉపాధి, సామాజిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, ఆ పురోగతి రాజకీయ ప్రాతినిధ్యంలో ప్రతిబింబించలేదని పేర్కొన్నారు.

మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 22 మంది మహిళలు మాత్రమే పార్లమెంటుకు ఎన్నికయ్యారని, అనంతరం ప్రతి ఎన్నికకు సగటున 2.8 మంది చొప్పున మాత్రమే మహిళల సంఖ్య పెరుగుతోందని గణాంకాలను ప్రస్తావించారు. ఇదే ధోరణి కొనసాగితే, 543 లోక్‌సభ స్థానాల్లో మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం సాధించడానికి మరో 150 సంవత్సరాలకు పైగా సమయం పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ అమలు ఆలస్యానికి ఉన్న సైద్ధాంతిక కారణాలను వివరిస్తూ, మహిళలు ప్రధానంగా ఇంటి బాధ్యతలకే పరిమితం కావాలనే భావజాలాన్ని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమి ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

మహిళల వేతనం లేని గృహ శ్రమ విలువ దేశ జీడీపీలో సుమారు 6 శాతానికి సమానమని ఒక ఎస్‌బీఐ అధ్యయనం వెల్లడించిందని పేర్కొన్నారు.  కార్పొరేట్ల ప్రభావంతో ఎన్నికల వ్యవస్థను సీట్ల అమ్మకాలు, కొనుగోలు మార్చేయడంతో సామాన్య ప్రజలు, మహిళల రాజకీయ ప్రాతినిధ్యం మరింత తగ్గుతోందని తెలిపారు. 1988లో మహిళా రిజర్వేషన్‌పై తొలి చర్చలు ప్రారంభమైనప్పటి నుంచే బీజేపీ మహిళా రిజర్వేషన్ ప్రతిపాదనను అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆమె మండిపడ్డారు. 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా, ఇతర వివాదాస్పద చట్టాలను మాత్రం ఆమోదింపజేసిందని విమర్శించారు.

ప్రస్తుతం జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమలు సాధ్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతుండటం బిల్లును వాయిదా వేసేందుకు చేస్తున్న రాజకీయ ఎత్తుగడేనని ఆమె పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ అమలును డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే మహిళా సంఘాలు పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాయని సెమినార్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి ఏఐడబ్ల్యూఏ అఖిల భారత సంయుక్త కార్యదర్శి టిఎన్ సీమా అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి సిఎస్ సుజాత, అఖిల భారత ఉపాధ్యక్షురాలు కెకె శైలజతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొని ప్రసంగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -