నవతెలంగాణ-హైదరాబాద్: సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర యువజన సమ్మేళనం హైదరాబాద్ కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాజ్యసభ సభ్యుడు, డీవైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు ఎఏ. రహీమ్, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ్ తదితరులు హాజరయ్యారు.
రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన యువతీ యువకులు ఉత్సాహంగా సమ్మేళనంలో పాల్గొన్నారు. సభ సందర్భంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి వెంట సీపీఐ(ఎం) జెండాలు, ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేయడంతో ఎల్‌బీనగర్ ప్రాంతం ఎర్రజెండాలతో కళకళలాడింది.
ఈ సందర్భంగా నాయకులు జాతీయ సమైక్యత, లౌకికవాదం, నిరుద్యోగ సమస్యలు, మతోన్మాద శక్తుల పెరుగుదల వంటి అంశాలపై ప్రసంగిస్తూ యువత ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సభలో యువజన సమస్యల పరిష్కారం, ఉపాధి అవకాశాల కల్పన, రాజ్యాంగ విలువల పరిరక్షణపై చర్చలు కొనసాగుతున్నాయి.




