చాలామంది తరుచుగా ఒక మాట చెప్తారు. మా వద్ద ధనమే లేనప్పుడు దానం ఎలా చేయగలమ్ అని. కాని వారికి తెలియని వాస్తవం ఏమిటంటే ‘దానం’ చేయడానికి ధనమే అవసరం లేదు.
దానం చేయడానికి మీ వద్ద ‘విద్య’ ఉండవచ్చు. మీరు తినే ఏదైనా ఆహారం కావొచ్చు, (అన్నదానం) అవయవ దానం, రక్తదానం, వస్త్ర దానం ఇలా ఏదైనా కావొచ్చు. కొన్ని ప్రాణంతో వున్నప్పుడు దానం చేసేవి. మరికొన్ని మనం ఈ లోకం నుండి శాశ్వతంగా వీడిపోయినప్పుడు మన శరీరంలోని అవయవాలు దానం చేయడం. అలాగే ఈ మధ్య కొందరు చనిపోయాక తమ పార్ధీవ దేహాన్ని ఏదైనా మెడికల్ కళాశాలకు, హాస్పిటల్‌కు పరిశోధనల నిమిత్తం దానం చేస్తామని బ్రతికుండగానే అంగీకార పత్రం రాసి ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఇలాంటివి దానం చేయడానికి డబ్బులు అవసరమా? ఒకసారి కుంభవర్షం కురుస్తున్న సమయాన ఓ బ్రాహ్మణుడు కర్ణుడి వద్దకు వచ్చి వంట చేసుకోవడానికి కట్టెలు మొత్తం (వంట చెరుకు) తడిసిపోయాయి అని అడిగాడట. మారు ఆలోచన చేయకుండా అప్పుడు కర్ణుడు తన ఇంటి వాసాలు (చెక్కవి) తీసి ఇచ్చాడట. ఇక్కడ సమయానుసారంగా దానం చేశాడు కర్ణుడు. ఒకవేళ తన వద్ద వున్న నగలు, వజ్రాలు, దానం చేసినా ఆ బ్రాహ్మణుడు వాటిని తినలేడు కదా ఆ సమయంలో, అదే ‘దానం’ సందర్భోచితమైనది.
కాబట్టి దానం చేయడానికి బలిచక్రవర్తి, హరిశ్చంద్రుడు, దంతిదుర్గుడు మొదలైన వారిలా మీరు గొప్ప గొప్ప దానాలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు సర్వం దానం చేసి రోడ్డున పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు మీ సమయం ఇతరులకు, కుటుంబ సభ్యులకు, సమాజానికి దానం చేయండి. అన్నింటికన్న గొప్ప దానం ‘సమయా దానం’. మీ విలువైన సమయం ఇతరుల కోసం కేటాయించటం. మాట సహాయం, సందర్భ సహాయం, పని సహాయం, పాత్రల సహాయం, పుస్తక సహాయం/ దానం ఇలా ఏదైనా కావొచ్చు, మీకు దానం చేయడానికి ఇలా చేస్తే అది మీ కీర్తిని ఇనుమడింపజేస్తుంది. అలాగే దాన స్వభావానికి మరింత వెన్ను దన్ను లభించేలా పరిస్థితులు ‘కాలం’ కూడా సహకరిస్తుంది. మీ లాంటి వారి కోసమే ఓ మంచి కథను చదవండి.
ఓ పేద స్త్రీ బస్సు ఎక్కింది. సీటు దొరికింది. కాని ఆమె పక్కన ఓ గర్భవతి నిలబడి ఉండటం చూసింది. వెంటనే లేచి నిలబడి గర్భవతికి తన సీటు ఇచ్చి పక్కన నిల్చుంది. కొద్ది సేపయ్యాక గర్భిణి స్త్రీ దిగాల్సిన ఊరు రావటంతో దిగిపోయింది. అప్పటి వరకు నిల్చున్న తను కూర్చుంది. కొద్ది దూరం బస్సు ప్రయాణించాక ఓ ‘వద్ధుడు’ బస్సెక్కాడు. సీటు ఖాళీగా లేకపోవటం వల్ల అతడు ఈమె సీటు వద్ద నిల్చున్నాడు. అది గమనించి మళ్ళీ లేచి ఆ వద్దుడికి తన సీటు ఇచ్చి కూర్చోమని చెప్పి తను నిలబడింది. అతడి గమ్యస్థానం రాగానే ఆ వద్ధుడు కూడా దిగిపోయాడు. తను మళ్ళీ సీట్లో కూర్చుంది. కాని వద్ధుడు దిగగానే ఓ యువతి బస్సు ఎక్కుతుంది. కాని సీటు లేకపోవడం వల్ల నిలబడుతుంది. మళ్ళీ ఆ యువతికి సీటిచ్చి తను నిలబడుతుంది. కొద్దిసేపయ్యాక ఆ యువతి గమ్యస్థానం రాగానే దిగిపోతుంది. ఆ తరువాత పేద స్త్రీ గమ్యస్థానం వస్తుంది తను కూడా బస్సు దిగింది.
బస్సులో తను చేస్తున్న సహాయాన్ని వెనుక సీట్లో కూర్చున్న ఓ ప్రొఫెసర్ ఆమెను ఆసక్తిగా గమనించసాగాడు. తనతో పాటు దిగిన (పేద మహిళతో) ఆమెను అనుసరించి ”అమ్మా… మీతో ఓ మాట అడగాలనుకుంటున్నాను సమాధానం చెప్పగలరా?” అని ”బస్సులో గర్భిణి స్త్రీ వచ్చినప్పుడు మీ సీటును త్యాగం చేశారంటే అర్ధం వుంది. కాని ఆ తరువాత వచ్చిన వద్ధుడికి కూడా త్యాగం చేశారు సరే, యువతికి మీరు మీ సీటును ఎందుకు ఇచ్చారు?” అని అడిగాడు.
ఆ మాటలు విన్న ఆవిడ నవ్వి చూడండి ”నేను పేదదాన్ని. నా వద్ద దానం చేయడానికి డబ్బులు వుండవు. కాని నా సమయాన్ని సందర్భానుసారంగా దానం చేస్తాను” అంటుంది. ఆమె చెప్పిన సమాధానం విన్న ప్రొఫెసర్ వద్ద మౌనమే సమాధానమైంది. మళ్ళీ తనే (పేద స్త్రీ) జోక్యం చేసుకొని మౌనంగా వున్న ఆ ప్రొఫెసర్ వైపు చూస్తూ ”అయ్యా నేను సంపన్నుల ఇళ్ళలో బట్టలు ఉతికి వారి ఇంటి పరిసరాలు శుభ్రం చేస్తాను. ఫలితంగా వారు ఇచ్చే చిన్న మొత్తంలో నా కుటుంబాన్ని నెట్టుకొస్తాను. ఇక నాకు దానం చేయడానికి ఏముంది చెప్పండి? నా వద్ద. నేను చేసేది సరైనదే కదా?” అని ఎదురు ప్రశ్నిస్తుంది. ఆ మాటలకు ప్రొఫెసర్ నమస్కరించి ”ఈ రోజు నీ ద్వారా ఓ మంచి పాఠం నేర్చుకున్నాను. నువ్వు నాలో గొప్ప ప్రేరణ కల్గించావు. ఈరోజు క్లాసులో నీ గొప్ప గుణం గురించి వివరిస్తాను” అని అక్కడి నుండి నిష్క్రమించాడు.
ఇప్పుడు చెప్పండి ఈ మొత్తం కథ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు. తను పేదరికంలో ఉన్నప్పటికీ సమయానుసారంగా తన కర్మలను దానం చేసే గొప్ప విశాల హదయం అలవర్చుకుంది. మనలో ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉంటుంది చెప్పండి. ఇప్పుడున్న బిజీ కాలంలో మనం మన సమయం ఇతరులకు కేటాయించటమే గగనమైపోయింది. తీరిక లేని జీవితం డబ్బు మీద విపరీతమైన యావ పెరగటం, ఇతరుల గురించి పట్టించుకోవడం అనవసరం అనే భ్రమలో బ్రతుకున్నాం. కొంతమేర నిజమే కావొచ్చు. కాని మీ పక్కన వ్యక్తి ప్రమాదంలో వుంటే వదిలి వెళ్తారా చెప్పండి. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తే అడవిలోని క్రూర మగాలకు మనకు తేడా ఏమిటి? మనిషిలో మానవత్వం కరుమరుగై విగ్రహాల మాదిరిగా మిగిలిపోతున్నాం. ఎదురుగా హింస, నేరం, ప్రమాదం జరిగినా పట్టించుకోకుండా యాంత్రికంగా వెళ్ళిపోతాం. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇస్లామిక్ మూలసూత్రాలలో (ఐదు సూత్రాలు) జకాత్/ దానం గురించి వివిధ సందర్భాలలో ఖురాన్‌లో వివరించబడింది. ఇది ఓ రకంగా పేద ధనిక మధ్య తారతమ్యాలను చెరిపివేసే గొప్ప ప్రయత్నం.
ప్రస్తుతం ఈ ప్రపంచంలో అన్నింటి కన్నా గొప్ప దానం ‘సమయా దానం’. మీ విలువైన సమయం ఇతరుల కోసం కేటాయించి వారి జీవితాల్లో వెలుగు నింపితే అంతకంటే గొప్ప దానం ఏం వుంటుంది చెప్పండి. గాంధీ గారు తన విలువైన సమయాన్ని జీవితాన్ని దేశం కోసం ధారపోశారు కాదంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే నెహ్రు, పటేల్, అంబేడ్కర్, కలాం, మండేలా, లింకన్ ఇలా ఒకరేమిటి చాలామంది వారి విలువైన జీవితాలను సమాజానికి ఫణంగా పెట్టి ప్రసిద్ధికెక్కారు. మీరు ఆ స్థాయిలో కాకపోయినా మీ సమయం ఇతరుల కోసం, మీ కుటుంబం కోసం, సమాజం కోసం దానం చేయండి.
ఇక్కడ మరో చిన్న విషయం ప్రస్తావించి ముగిస్తాను. ఓ వ్యాపారస్తుడు యాబై కోట్ల ఆస్తి సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. పైసా పైసా కూడబెట్టి యాబై కోట్లు సంపాదిస్తాడు. ఏ రోజు కూడా కుటుంబానికి, సమాజానికి, సమయం కేటాయించడు. ఓ రోజు ఉదయం నిద్ర లేవగానే ఇద్దరు యమభటులు ప్రత్యక్షమై నీ చావు ముహూర్తం ఆసన్నమైంది యమలోకం పిలుస్తుంది పోదాంపద అంటారు. భటుల మాటలు విన్న ‘కోటీశ్వరుడు నేను ఈ మధ్యనే యాబై కోట్లు సంపాదించాను, ఇక మీదట దానాలు, ధర్మాలు, కుటుంబానికి, సమాజానికి, అలాగే దైవ దర్శనాలు చేసుకోవాలని రాత్రే నిర్ణయించుకున్నాను. నాకు ఆరు నెలల సమయం ఇవ్వండి అని వేడుకుంటాడు. అతడి మాటలు విన్న యమభటులు ఆరు నెలలు కాదు కదా అరవై నిమిషాలు (గంట) కూడా సమయం లేదు యమ ధర్మరాజు వెంటనే మీ ప్రాణాలు తీసుకొని రమ్మన్నారు రండి అంటారు.
చేసేది ఏమీలేక ఇంట్లోకి వెళ్ళి తను సంపాదించిన యాబై కోట్ల డబ్బున్న సంచిని తెచ్చి ఇది తీసుకొని నన్ను వదిలి పెట్టండి అని వేడుకుంటాడు. ఆ డబ్బులను చూసిన యమభటులు పెద్దగా నవ్వి మీ డబ్బులు మా లోకంలో (యమలోకం) చెల్లవు. వ్యర్ధ ప్రేలాపనలు వద్దు, వెంటనే రమ్మని హుంకరిస్తారు. వారి సైగలకు భయపడిన వ్యాపారి పది నిమిషాల సమయం మాత్రమే ఇవ్వండి అని ఇద్దరి కాళ్ళు పట్టుకొని వేడుకుంటాడు. సరేనంటారు యమభటులు. వెంటనే ఇంట్లోకి వెళ్లి ఓ తెల్ల కాగితంపై ”నేను నా జీవిత కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నాను డబ్బు యావలో పిల్లలు, సమాజం, పరిసరాలు, నీతి మొదలైన విషయాలు పట్టించుకోలేదు. ఎంత సంపాదించినా ఎలా సంపాదించిన చివరికి ఏవి వెంట రావు. ఇంత కాలం నేను నా విలువైన సమయాన్ని దుర్వినియోగం చేశాను మీరు ఇలా చేయకండి” అంటూ ముగించి యమభటులతో కలిసి యమలోకానికి వెళ్ళిపోతాడు.
బహుశా మీకు ఈ పాటికే అర్ధమై వుంటుంది సమయం ఎంత విలువైనదో. జీవితంలో డబ్బే సర్వస్వం కాదని దాని కన్నా విలువైనవి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయని ఇప్పటికైనా గ్రహించండి. మహాకవి గురజాడ ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి పాటుపడవోరు’ అంటారు. అంటే ఇతరులకి మనం చేయాల్సిన ఏ రకమైన సహాయమైనా మన ద్వారా వారికి లబ్ది చేకూరుతున్నట్లే. కావున మీలో ఉండాల్సినవి ఏమిటి? వదులుకోవాల్సినవి ఏమిటో బేరీజు వేసుకొని మీ గుణాలను ఇంకాస్తా మెరుగుపరచుకొండి.
– డా||మహ్మద్ హసన్,
9908059234



