కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాసంఘాల నిరసన
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద ప్లకార్డుల ప్రదర్శన
హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం,
సీఐటీయూ, రైతుసంఘం నేతలు
రాష్ట్రవ్యాప్తంగా కూలీల ధర్నాలు, రాస్తారోకోలు
గ్రామీణ బంద్‌ను విజయవంతం చేసిన కూలీలు
అధికారులకు వినతిపత్రాల అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్/విలేకరులు
వీబీ జీ ఆర్ఏఎం జీ చట్టం రద్దయ్యే వరకు ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తామనీ, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఉపాధి కూలీలకు ద్రోహం చేస్తున్నదని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. వీబీజీ రాంజీ చట్టం రద్దు కోరుతూ ఇచ్చిన గ్రామీణబంద్ పిలుపులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామీణబంద్‌లో కూలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు అందించారు. పలుచోట్ల కూలీలకు సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించింది.
హైదరాబాద్‌లో జరిగిన నిరసనలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, సీఐటీయూ ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో వామపక్షాలు మద్దతుతో యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలకు ప్రతి కుటుంబానికి వంద రోజుల పని గ్యారెంటీ చేస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో ఆమోదించిందని తెలిపారు. దీని ద్వారా వ్యవసాయ వ్యవసాయ కార్మికులకు , చిన్న, మధ్య తరగతి రైతాంగానికి, కౌలు రైతులకు పని దొరికిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పని కోసం పేదల వలసలు తగ్గాయన్నారు. వ్యవసాయ పనుల్లో కనీస వేతనాలను పెంచుకున్నారని చెప్పారు. కోట్లాది రూపాయలను వేతనాల రూపంలో పేదలకు ఇవ్వడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పారు. 2008లో ప్రపంచంలో ఆర్థికమ ాంద్యం వచ్చినప్పుడు దేశాన్ని గట్టెక్కించింది గ్రామీణ ఉపాధి హామీ చట్టమేనని తెలిపారు. పట్టణ ప్రాంతాల పేదలకు ఉపాధి పని పెట్టాలనీ, పని దినాలను 200 రోజులకు పెంచాలనీ, రోజు కూలి రూ 800 ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఆందోళన, పోరాటాలు ఉధృతం అవుతున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని
రద్దు చేయటం దారుణమని విమర్శించారు. దీని స్థానంలో వీబీజీ రాంజీ చట్టాన్ని తెచ్చి ఉపాధి కూలీలను కాలరాసిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 90 నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 60 శాతం మాత్రమే ఇస్తామనీ, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని నిర్ణయం చేసిందని గుర్తు చేశారు. పని దినాలను 125 రోజులకు పెంచినట్లే పెంచి వ్యవసాయ సీజన్ లో 60 రోజుల పనిని బంద్ చేస్తామని చెప్పటం కూలీలను మోసం చేయటమేనని విమర్శించారు. ఇది రాజ్యాంగబద్ధ పని హక్కును హరించడమేననీ, పని కల్పించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పకో చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, ఈశ్వర్ రావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, సిఐటియు హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్ష కార్యదర్శులు దశరథ్ కుమారస్వామి నగర కోశాధికారి కే అజయ్ బాబు హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీనా, శ్రావణ్ కుమార్, నగర నాయకులు జి రాములు, జి నరేష్, ఎం సత్యనారాయణ, ఆర్ అశోక్, అజయ్, మహేందర్, మల్లేశ్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కూలీల బంద్
వీబీ జీ ఆర్ఏఎం జీ చట్టం రద్దు కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టిన గ్రామీణ బంద్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కూలీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలన్ని కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గ్రామాల్లో కూలీలు పనులు బంద్ చేసి రాస్తారోకో చేపట్టారు. పలుచోట్ల పనులు బంద్ చేశారు. ప్రదర్శనలు నిర్వహించారు. పంచాయతీ, మండల కార్యాలయాల ముందు ధర్నా చేశారు. అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, ఖమ్మం జిల్లాలో కూలీలు స్వచ్చందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్, భద్రాచలం వంటి మారుమూల ప్రాంతాల్లోనూ బంద్‌లో కూలీలు పాల్గొన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ , యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలోని మెజారిటీ మండలాలు, గ్రామాల్లో కూలీలు నిరసనల్లో పాల్గొన్నారు. ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించకుంటే మోడీకి పతనం తప్పదని కూలీలు హెచ్చరించారు. రెండు సార్లు ఫొటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పాత చట్టాన్నే యథావిధిగా కొనసాగించాలని వీబీజీరాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ చట్టాన్ని సమగ్రంగా అమలు చేసి, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.



