Sunday, April 19, 2026
E-PAPER
Homeకథబొమ్మను గీస్తే ??

బొమ్మను గీస్తే ??

- Advertisement -

కొన్ని ప్రయాణాలు కేవలం మనల్ని గమ్యానికి మాత్రమే చేర్చవు, దాచుకోవడానికి కొన్ని జ్ఞాపకాలను కూడా ఇస్తాయి. అవి కొత్త ప్రదేశాలైతే కొంతకాలమే గుర్తుంటాయి, అదే కొత్త మనుషుల పరిచయాలైతే ఇంకో కొత్త గమ్యానికి దారి చూపిస్తాయి.
అలాంటి ప్రయాణమే రవి జీవితంలో కూడా గత సంవత్సరం సంక్రాంతికి ఊరికి వెళ్తున్నప్పుడు జరిగింది.రవి ఒక స్కెచ్‌ ఆర్టిస్ట్‌.తన కనులకి అందంగా కనిపించే వాటినే కాకుండా,తను గీసిన ప్రతీది చూసేవాళ్లకి అందంగా కనిపించేలా చేయాలనేది తన తపన.ఏ ఆర్టిస్ట్‌కైనా తన పనిని వేరేవాళ్లు పొగిడినప్పుడే కదా మరి నిజమైన ఆనందం.ఆ కళకి కూడా గౌరవం.
అలా తనకి నచ్చిన పనిని చేస్తూ హైదరాబాద్లో ఉండేవాడు రవి. సరిగ్గా సంక్రాంతికి మూడు రోజులు ఉంది అనగా వాళ్ళ అమ్మ దగ్గర నుండి ఫోన్‌ వచ్చింది.
”హలో… రవి, ఊరికి ఎప్పుడొస్తున్నవు?” అని అన్నది అమ్మ.
”అమ్మా… నాకు పని ఉంది. నేను రాలేను.”
”ఏమి పని? కనిపించిన వాళ్లని పిచ్చి గీతలు గీయడమేగా!”
”పిచ్చి గీతలా? అమ్మా, నీకు అర్థంకావట్లే. వాళ్లు ఏదో పనిలో ఉన్నప్పుడు వాళ్ల బొమ్మను గీసి ఇచ్చిన తర్వాత, అన్నీ మరిచిపోయి వాళ్లు నవ్వుతారు చూశావా? అది ఎంత కిక్‌ ఇస్తుందో నీకేం తెలుసు!స‌స
హ్‌.. అన్నీ నీకే తెలుసు గానీ, ముందు అయితే నువ్వు పండగకి ఇంటికి రా” అన్నది. కొంచెం టోన్‌ మారింది.
వెంటనే నవ్వుతూ ”అమ్మా.. నువ్వు ఫోన్‌ చేస్తావని నాకు తెలుసు. అందుకే వారం క్రితమే టికెట్‌ బుక్‌ చేసుకున్నాను” అన్నాడు రవి.
”సరే సరే… జాగ్రత్త.”
మరుసటి రోజు ఉదయం 7 గంటలు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌. అంతా రద్దీగా ఉంది. హైదరాబాదుకి వచ్చి సొంతూరిని మరిచిపోయారు అనుకుంటాం, కానీ అక్కడి వాళ్ళని చూస్తే అర్ధమవుతుంది ఆ మూడురోజుల కోసం వాళ్ళు ఎంతలా ఎదురుచూస్తారు అని. మెల్లిగా, ఎలాగో అలా తోసుకుంటూ తన సీటు దగ్గరికి వచ్చి కూర్చున్నాను రవి.
‘కొంచెం అయితే బండి వెళ్లిపోయేది. రాత్రే అన్నీ సర్దుకొని ఉంటే అయిపోయేది కదా బామ్మ’ అని అనుకుంటూ వచ్చి కూర్చుంది వాగ్దేవి. తను గవర్నమెంట్‌ ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉంది. చాలా సమయం వరకు వాళ్ళు వచ్చిన విషయమే గమనించలేదు రవి.
రైలు కదిలింది. మొదట్లో కొద్దిసేపు హడావిడి ఉన్నా, ఒక అరగంట తర్వాత అంతా కుదుటపడింది. రవికి వెక్కిళ్లు మొదలయ్యాయి. ‘ఇంకెవరుంటారు… మా అమ్మనే తలుచుకుని ఉంటుందిలే,’ అనుకుని లేచి బ్యాగ్‌లో బాటిల్‌ తీసుకుంటుండగా… అప్పుడే వాగ్దేవి కనిపించింది. చుట్టూ అంత గందరగోళంగా ఉన్నా ఏమి పట్టించుకోకుండా ప్రశంతంగా పుస్తకం చదువుకుంటుంది. జడ్జ్‌ చేయడం కాదు గానీ కొంచెం ఓల్డ్‌ స్కూల్‌ అమ్మాయి. ఈ రోజుల్లో ఇంతకన్నా ఇంటరెస్టింగ్‌ క్యారెక్టర్‌ ఏముంటుంది అనుకున్నాడు రవి. తన ఆర్టిస్ట్‌ భాషలో చెప్పాలంటే… ఒక బొమ్మ. కాదు కాదు… బాపు బొమ్మ. వెంటనే బ్యాగ్లో నుంచి పెన్సిల్‌ ఇంకా పేపర్‌ తీసుకున్నాడు.
”ఇప్పుడే బండి ఎక్కాం” అని వాళ్ళ కొడుకుతో మాట్లాడుతుంది బామ్మ. వాగ్దేవికి ఫోన్‌ ఇస్తుంటే వద్దు అని తల ఊపింది. ”మొన్న జరిగిన పరీక్ష మంచిగా రాయలేదంట. అది బాధలో ఉంది తరువాత మాట్లాడుతాడంట” అని అన్నది గట్టిగా. వెంటనే బామ్మ వైపు కోపంగా చూసింది వాగ్దేవి. ఒక్క క్షణం తను పెద్దావిడలా, బామ్మ చిన్నపిల్లలా అనిపించారు రవికి. పరీక్ష వల్లనే తను కొంచెం డల్‌గా ఉందేమో అనుకున్నాడు. ఎలాగైనా తన బొమ్మని గీసి తన మోహంలో సంతోషాన్ని చూడాలనుకున్నాడు. అయినా అమ్మాయిలు నిండుగా చీర కట్టుకున్నాక నుదుటన బొట్టు లేకపోతే ఎలా ఉంటదో, వాళ్ళ మోహంలో నవ్వు లేకపోతే కూడా అంతే బోసిగా అనిపిస్తది.
నిజానికి, ఒక వ్యక్తికి తెలియకుండా వాళ్ల బొమ్మ గీయడం ఎంత కష్టమో తెలుసా? చుట్టూ ఎవరు చూడకుండా చూసుకోవాలి, ఇంకా ఎవరి బొమ్మ అయితే గీస్తున్నారో వాళ్ళకి అసలు డౌట్‌ రావొద్దు. అయినా ఇదంతా ప్రతిసారి ఉండే కంగారే. కానీ ఈసారి రవికి ఇంకో కొత్త టెన్షన్‌ మొదలయింది. కదిలే రైలులో ఎలా గీయాలి? అని. ఈ కుదుపులకి కష్టమే అని ఆలోచిస్తుండగా తనకి ఒక ఆలోచన వచ్చింది. ఈ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందో అప్పుడు కొంచెం కొంచెంగా గీసేద్దాం అని. అలా స్టేషన్‌కి స్టేషన్‌కి మధ్యలో తనని చూడటం, ఆగాక దొరికిన ఆ కొద్ది సమయంలో గీయడం. కొత్తగా ఉంది కదా. సిటీ దాటగానే ఒక స్టేషన్లో కొద్దిసేపు ఆగింది. అదే సమయంలో పైన బెర్త్‌లో ఉన్న ఒక పెద్దాయన మంచి 90’స్‌ లవ్‌ సాంగ్‌ ఒకటి పెట్టాడు. ఆ సౌండ్‌ కొంచెం ఇబ్బంది అనిపించినా తన సిట్యుయేషన్‌కి కరెక్టుగా సింక్‌ అయింది అనుకొని గీయడం మొదలుపెట్టాడు.
తను మాత్రం ఎవరిని పట్టించుకోవట్లేదు. విచిత్రం ఏంటంటే ఒక పక్క బామ్మ ఫోన్‌ వాడుతుంటే, వాగ్దేవి మాత్రం పుస్తకం చదువుతుంది. బహుశా తను ఇంకా ఆ ఎగ్జామ్‌ గురించే ఆలోచిస్తుందేమో.’ ఛా.. తనతో ఎవరైనా మాట్లాడిస్తే బాగుండు అని అనుకుంటుండగా, ఆమె ఎదురుగా కూర్చున్న వాళ్లు ”బామ్మగారు.. ఎక్కడివరకు” అని అడిగారు. హమ్మయ్య…ఇలాంటి డిస్కషన్‌ ఇంకా మొదలవ్వలేదేంటి అని అనుకుంటున్నాడు రవి. సరైన సమయంలో వాళ్లు అడిగారు. అయినా రైలు ప్రయాణంలో ఇవన్నీ కామనేగా.
”మాది నర్సాపురం..” అన్నది. మా ఊరే. ”అయితే ఇంకేం ఉదయం వరకు తనని చూస్తూ ఉండొచ్చు” అని మనసులో అనుకున్నాడు రవి. అలా వాళ్లు మాట్లాడుతుంటే అన్నీ వింటూ, మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడల్లా తన స్కెచ్‌ని కూడా గీస్తూన్నాడు.
గుంటూరు స్టేషన్‌ వచ్చింది. ఇక్కడ ఎక్కువసేపు ఆగుతుంది. ఇదే సరైన సమయం అనుకున్నాడు. చిన్న చిన్న వర్క్‌ తప్ప మిగతాది అంతా అయిపొయింది. అద్భుతంగా వచ్చింది. కాదు కాదు అద్భుతాన్నే గిసేసా అనే ఓవర్‌ కాంఫిడెన్స్‌లో ఉన్నాడు రవి. ఫోన్లో ఒక ఫొటో తీసుకున్నాడు. తన వర్క్‌ చూసి తనకే చాలా సంతప్తి అనిపించింది. రాత్రి పది అవుతుంది. అందరు తింటున్నారు.
తనకి ఎప్పుడు ఎప్పుడు ఇచ్చేద్దామా? తను ఎలా రియాక్ట్‌ అవుతుందో చూద్దామా… అని ఎదురుచూస్తున్నాడు రవి. రద్దీగా ఉన్న రైలులో తను కింద సీటులో కూర్చొని చదవడం, తను పైన సీటులో కూర్చొని తన బొమ్మని గీయడం… ఎంత అందమైన ఫ్రేమ్‌ కదా. ఎప్పుడైనా తనతో మాట్లాడే రోజు వస్తే, చెప్పుకోవడానికి ఇదొక మంచి అనుభవం అనుకున్నాడు.
అప్పుడే రవికి తన ఫ్రెండ్ పృథ్వి నుండి కాల్‌ వచ్చింది. ”ఏరా.. ట్రైన్‌ ఎక్కిన దగ్గర నుంచి అసలు ఫోనే చేయలేదు. ఎవరైనా అమ్మాయి కనిపించిందా ఏంటి” అన్నాడు. ఇక్కడ మాట్లాడితే బాగుండదు అని కిందకి దిగి డోర్‌ దగ్గరకి వెళ్లి, ట్రైన్‌ ఎక్కిన దగ్గర నుంచి జరిగింది మొత్తం చెప్పేశాడు.
”అరేరు నువ్వు గీసి ఇచ్చిన తరువాత ఓహ్‌ రెండు నిమిషాలు నీతో మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ మాత్రం దానికి నువ్వు అంతలా ఆలోచించడం అవసరం అంటావా” అన్నాడు పృథ్వి. ”నిజమే.. కానీ ఈరోజుల్లో ఎగ్జామ్‌ కోసం బాధపడటం, అసలు ఫోన్‌ గురించే ఆలోచించకపోవడం. ఇలాంటి వాళ్ళు అరుదేగా” అన్నాడు రవి. ”మరి అలాంటి వాళ్ళు తిరిగి ఇష్టపడటం కూడా ఎంత కష్టమో ఆలోచించు” అన్నాడు. ఇద్దరు వాళ్ళ సోదిలో వాళ్ళు మునిగిపోయారు. చాలా సమయం అవుతుంది. కొద్దిసేపటి తర్వాత రవి వెళ్లి చూసేసరికి అందరు పడుకున్నారు. లైట్స్‌ కూడా ఆఫ్‌ చేసేసారు. మళ్లీ ఉదయం వరకు ఎదురు చూడాలి అని చాలా డిస్సప్పాయింట్‌ అయ్యాడు. మంచి మూమెంట్‌ మిస్‌ అయింది అని దిగులుగా కూర్చున్నాడు. తనకి మామూలుగానే అంత త్వరగా నిద్రపట్టదు, ఇంకా అలా జరిగేసరికి నిద్ర ఏం వస్తుంది. అందుకే ఫోన్లో ఒక సినిమా చూడటం మొదలుపెట్టాడు. కొద్దిసేపు అలా చూస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఉదయం మెలుకువ రాగానే చూస్తే నర్సాపూర్‌ స్టేషన్‌ వచ్చింది. ఎదురుగా ఆమె లేదు. ఫోన్‌ నైట్‌ మొత్తం ఆన్‌లోనే ఉండేసరికి ఛార్జింగ్‌ అయిపొయింది. ఆ జనాలను దాటుకొని బయటికి వచ్చి చూసాడు. తను ఎక్కడా కనిపించలేదు. వాగ్దేవి మోహంలో సంతోషం చూద్దామానుకున్న తనకి చివరికి నిరాశే మిగిలింది.
ఇంటికి వచ్చేశాడు. స్నానం చేసి టిఫిన్‌ కోసం వంటగదిలోకి వెళ్లాడు. వాళ్ళ అమ్మకి జరిగింది మొత్తం చెప్పాలనుకున్నాడు. చిన్నప్పటి నుంచి తనకి ఇదే అలవాటు. తను కలిసేదే కొద్దిమందితో. అందుకేనేమో జీవితంలో ఏది జరిగినా వెంటనే వాళ్ళకి చెప్పడం అలవాటైపోయింది. లోపలికి వెళ్ళగానే…
”ఏమయిందిరా అలా ఉన్నావు” అన్నది.
”ఏమైంది. బాగానే ఉన్నానుగా” అన్నాడు.
”మొహం ఏదో తేడా కొడుతుంది” అన్నది. అమ్మ ముందు మనం ఏమైనా దాచగలమా. వెంటనే తను గీసిన బొమ్మను చూపించాడు.
”ఎవరురా ఈ అమ్మాయి ఇంత బాగుంది”
”నిన్న రైల్లో వచ్చేటప్పుడు చూసాను”
”అవునా.. సేమ్‌ చందమామ లెక్కనే ఉందిరా” అన్నది.
”అవును కదా. నాకు కూడా అట్లనే అనిపించి గీసా”
”అబ్బా..” అని రవి వైపు చూసింది. తను ఏమి మాట్లాడలేదు.
”అవును నువ్వు గీసిన తరువాత వాళ్ళకి ఇచ్చేస్తావు కదా మరి ఇది మాత్రం నీ దగ్గర ఎందుకు ఉంది” అడిగింది. కొంచెం అనుమానం వచ్చింది.
”నువ్వే కదా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడైనా చందమామని గీసినప్పుడు జాగ్రత్తగా దాచుకో అనే దానివి, అందుకే ఇప్పుడు దాచుకున్నా” అన్నాడు నవ్వుతూ.
”ఈ కథలు నాకు చెప్పకు”
”సరే సరే ఆగు చెప్తా” అని మొత్తం చెప్పేశాడు. ”మరి మొద్దు లాగా ఎందుకు అంత సేపు పడుకున్నావు” అని తిట్టుకుంటూ ప్లేట్లో టిఫిన్‌ పెట్టింది. హాల్‌లోకి వచ్చి తింటున్నాడు.
”అందరి ఫొటోలు పెట్టినట్టే నువ్వు గీసిన ఈ అమ్మాయి ఫొటో కూడా ఇంస్టాగ్రామ్లో పెట్టొచ్చు కదరా, ఈ ఊరే అన్నావుగా ఎవరైనా చూస్తే తనకి చెప్తారుగా” అన్నది.
”తన అనుమతి లేనిది ఫొటో పెడితే బాగోదమ్మా, ఏమైనా అయితే జైలుకే” అన్నాడు.
”అమ్మో అంతేనా.. సరేగాని నువ్వైతే ఈ మూడు రోజులు ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు సరేనా” అన్నది. అమ్మ ఎంత చెప్పినా మనం మనుషులం కదా మన లోపలికి ఒక విషయం చేరిందంటే దాని అంతు చూసేవరకు నిద్రపడుతుందా చెప్పండి. ఊరిలో ఉన్న మూడు రోజులు ఏ పని చేస్తున్నా, లోపల తన ఆలోచనలు మాత్రం వస్తూనే ఉండేవి రవికి.
తర్వాత అలా ఊరిలోకి వెళ్లి స్కూల్‌ ఫ్రెండ్స్‌ అందరూ కలిసి సరదాగా పాత ముచ్చట్లు అన్నీ మళ్లీ గుర్తుచేసుకున్నారు. జీవితంలో మనం ఎంత మందిని కలిసినా, స్కూల్‌ ఫ్రెండ్స్‌తో ఉన్నట్టు ఉండలేం కదా.
మూడురోజులు కొంత సమయం ఫ్రెండ్స్‌తో, మరికొంత సమయం ఫ్యామిలీతో అలా గడిచిపోయింది. అదేంటో అర్థంకాదు… హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆగిపోయిన గడియారంలా అస్సలు టైమ్‌ అయిపోదు. అదే ఊరికి వచ్చినప్పుడు గడియారంలో ఎవరో చెయ్యి పెట్టి ఫాస్ట్‌గా తిప్పినట్టు తొందరగా అయిపోతుంది. మరుసటి రోజు ఉదయమే వెళ్ళిపోవాలి. అందరూ రేపు హైదరాబాద్‌ వెళ్ళిపోతారు. తను కూడా వస్తదేమో అనే చిన్న నమ్మకం తనది. ట్రైన్‌ ఎక్కేముందు స్టేషన్‌ మొత్తం వెతికాడు. వాగ్దేవి ఎక్కడా కనిపించలేదు. తను వచ్చేటప్పుడు ప్రయాణం ఎంత ఉత్సాహంగా అనిపించిందో, వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో కొల్పియినట్టే అనిపించింది.
తర్వాత తన కాంపిటీషన్స్‌లో బిజీ అయిపోయాడు. నాలుగు నెలలు గడిచిపోయాయి. ఒక రోజు తనకి ఆర్ట్‌ కాంపిటీషన్‌ ఉంటే వెళ్ళడానికి ఆటో కోసం ఎదురుచూస్తున్నాడు. ఆటో వచ్చింది. లోపల ఒక అమ్మాయి ఉంది. మొఖానికి స్కార్ఫ్‌ కట్టుకొని ఉంది.
”అన్నా.. ఆమెకి ఎగ్జామ్‌ ఉందంట డ్రాప్‌ చేసి వెళ్దాం” అన్నాడు.
”పర్లేదు” అని ఎక్కి కూర్చున్నాడు రవి. తను పుస్తకం పట్టుకొని తెగ చదివేస్తుంది. ఆమె అలా చదవడం చూసినప్పుడు వాగ్దేవినే గుర్తుకువచ్చింది. ఎగ్జామ్‌ సెంటర్‌ వచ్చింది. తను హడావిడిగా దిగి వెళ్లిపోయింది. ఆటో అక్కడి నుంచి కదిలింది. బైక్‌ సర్వీస్‌ పాయింట్‌ దగ్గరకి వచ్చేసారు. దిగే ముందు ఆటోలో రవికి ఒక పర్సు కనిపించింది. ఆటో అతనికి చెప్పాడు.
”అయ్యో ఎగ్జామ్‌ తొందరలో మరిచిపోయిందేమో అన్నా” అన్నాడు. పర్సు ఓపెన్‌ చేసి చూసాడు రవి.. హాల్‌ టికెట్‌ కనిపించింది .అందులో ఉంది ఎవరో కాదు… తను ట్రైన్లో చూసిన వాగ్దేవినే. తెలియకుండానే మొఖం మీద చిన్న చిరునవ్వు. డెస్టినీ అంటే ఇదేనేమో అనుకున్నాడు. ఒక ప్రయాణంలో మిగిలిపోయిన ప్రశ్నకి ఇంకో ప్రయాణంలో సమాధానం దొరకడం అంటే… అది నిజంగా డెస్టినీనే కదా మరి. వెంటనే ఎగ్జామ్‌ సెంటర్‌ దగ్గరకి బయలుదేరారు.
”అన్నా నువ్వు ఇక్కడే ఉండు. తను వస్తే మెయిన్‌ గేట్‌ దగ్గరకి రమ్మను” అని చెప్పాడు రవి. గేట్‌ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్లకి బ్యాగ్‌ ఇచ్చి, ఆమె వస్తే ఇవ్వమని చెప్పి తను కూడా వెతకడం మొదలుపెట్టాడు. ఎక్కడా కనిపించలేదు. మళ్లీ గేట్‌ దగ్గరకి వెళ్లి అడిగాడు. ”తను ఇప్పుడే లోపలికి వెళ్లిపోయింది” అన్నారు.
అన్నట్టు… తన పర్సు తీసుకుని వచ్చేటప్పుడు ఒక చిన్న విషయం జరిగింది. చెప్పడం మరిచిపోయా. రవి గీసిన తన స్కెచ్‌ వెనకాల గీసిన తేదీ, అలాగే తన నెంబర్‌ రాసి వాగ్దేవి పర్సులో పెట్టాడు.
కొద్దిసేపటి తర్వాత రవి అక్కడి నుండి తన ఆర్ట్స్‌ కాంపిటీషన్‌కి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళాక కూడా అప్పుడప్పుడు ఫోన్‌ చూసుకుంటున్నాడు తను కాల్‌ చేస్తాదేమో అని. తన పని ముగించుకొని రూంకి వచ్చేశాడు. తన దగ్గర నుంచి ఇంకా కాల్‌ రాలేదు. రాత్రి 8:30 అవుతుంది. కొత్త నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. తనే అని గట్టిగా నమ్మి కాల్‌ లిఫ్ట్‌ చేసాడు.
”హలో.. రవి గారా? నేను వాగ్దేవి. ఉదయం హాల్‌ టికెట్‌ తెచ్చి ఇచ్చినందుకు థాంక్స్‌” అని అన్నది.
”హారు.. ఎగ్జామ్‌ ఎలా రాసారు” అడిగాడు.
”హా.. బానే రాసాను” అన్నది. తన ఆర్ట్‌ గురించి ఏమైనా చెప్తుందేమో అని ఎదురుచూస్తున్నాడు రవి. కొంచెం తడబడుతూనే ”మీరు గీసిన నా ఆర్ట్‌ని చూసా. చాలా బాగుంది. అప్పుడే ఎందుకు ఇవ్వలేదు” అని అడిగింది. ఇప్పటికైనా తను చూసింది అన్న ఆనందం ఉంది. కానీ లోపల మాత్రం… తను ఆ ఆర్ట్‌ను చూసినప్పుడు తన కళ్లలో కలిగిన భావాన్ని చూడలేకపోయానే అన్న చిన్న బాధ రవికి.
”ఆ రోజే ఇవ్వాలనుకున్నా కానీ నేను ఇచ్చేలోపే మీరు వెళ్లిపోయారు. ఎలా అయితే ఏంటి ఇప్పటికైనా చూసారు, కొంచెం భారం తగ్గింది అని అన్నాడు నవ్వుతూ”
”భారమా.. అయినా మీరు మీ ఇంస్టాలో పెట్టి ఉంటే నేను ఎప్పుడో చూసేదాన్ని” అని అన్నది. వెంటనే ”ఇంస్టానా.. మీరు నా పేజీ ఇంతకుముందే చూసారా” అడిగాడు.
‘హా.. మాములుగా మన నర్సాపూర్‌కి సంబంధించినవి పేజీస్‌ కొన్ని ఫాలో అవుతుంటా. అలా ఒకసారి అనుకోకుండా మీ పేజీ చూసాను” అన్నది.
”అవునా.. ఛా.. మా అమ్మ కూడా అన్నది ఇంస్టాగ్రామ్‌లో పెట్టురా అని, కానీ మీ పర్మిషన్‌ లేకుండా ఎలా అని ఆగిపోయాను అని అన్నాడు రవి”
”ఏంటి మీ అమ్మకి కూడా చూపించారా”
”చూపించడమా.. ఎంత మంచి కాంప్లిమెంట్‌ ఇచ్చిందో తెలుసా”
”అవునా.. థాంక్యూ అని చెప్పండి” అన్నది.
అలా ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది. ఇద్దరు చూసిన మనుషులు, తిరిగిన ప్రదేశాలు చాలా వరకూ ఒకటే కావడం వల్లనేమో, కొన్ని విషయాల్లో మాత్రం వెంటనే కనెక్ట్‌ అయ్యేవాళ్ళు. ఒక్కటే ఊరి నుంచి కావడం వల్ల వాగ్దేవి కూడా ముందు నుంచే రవితో పరిచయం ఉన్నట్టే మాట్లాడేది. వాగ్దేవి గవర్నమెంట్‌ జాబ్స్‌ కోసం ప్రయత్నించడం రవికి, అలాగే రవి అందరికంటే భిన్నంగా ఆర్ట్స్‌ వైపు వెళ్లడం వాగ్దేవికి చాలా గొప్పగా అనిపించింది. అయినా ఒక అమ్మాయి, అబ్బాయి చేసే ప్రయాణంలో మొదటి పేజీ తెరుచుకుంటే చాలుగా… మిగతా పేజీలు మనం ప్లాన్‌ చేయకపోయినా కాలమే రాస్తుంది.
అలా సరదాగా మొదలైన వాళ్ళ మాటలు రోజు రోజుకి చాలా డీప్‌గా మారిపోయాయి. ఇద్దరు చెప్పొకోకపోయినా ఒకరంటే ఒకరికి ఇష్టం అనే దశకి వచ్చేసారు. సరిగ్గా చెప్పాలంటే ఒకరు చెప్తే, ఇంకొకరు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అనుకోండి. అయినా.. అంగీకారం మాటల్లో వస్తేనే కదా కథ ముందుకెళ్ళేది. మరీ సినిమాల్లో చూసినట్టుగా కాకపోయినా… వాళ్ల మధ్య జరిగిన వందల సంభాషణల మధ్య రవి ఒక మెసేజ్‌ పంపించడం, దానికి వాగ్దేవి నుంచి ‘ఇష్టమే’ అనే సమాధానం రావడం చాలా సహజంగానే జరిగింది.
కొన్నిరోజులకి మళ్ళీ సంక్రాంతి వచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌. కాకపోతే ఈసారి ఇద్దరు కలిసి వాళ్ళ ఊరికి ప్రయాణం మొదలుపెట్టారు.

రమేష్‌ మాండ్ర, 8555929026

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -