Sunday, April 19, 2026
E-PAPER
Homeహెల్త్మార్కుల మోజులో... మానవత్వం ఎక్కడీ

మార్కుల మోజులో… మానవత్వం ఎక్కడీ

- Advertisement -

వైఫల్యం బంగారు గని లాంటిదే… కానీ మన దృక్పథం?
పరీక్షల ఒత్తిడితో పెరుగుతున్న ఆందోళన. నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా, చిన్న అపజయాన్ని కూడా తట్టుకోలేక యువత ఆత్మహత్యల దిశగా వెళ్లడం ఒక విషాదకర వాస్తవంగా మారింది. పరీక్షల ఫలితాలను జీవితానికి ఏకైక ప్రమాణంగా భావించడం వల్ల విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరుగుతోంది.
మారిన విలువలు: ఒకప్పుడు ‘పాస్‌ అయితే చాలు’ అనేది ప్రధాన భావన. ఇప్పుడు ‘ఎన్ని మార్కులు వచ్చాయి?’ అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ మార్పు కారణంగా ఆనందం తగ్గి, సంతప్తి కనుమరుగై, విద్యార్థులు ఒత్తిడిలో చిక్కుకుంటున్నారు. సమాజం వారిని చదివే యంత్రాలుగా మార్చే దిశగా సాగుతోంది.

ఒక చిన్నారి కథ: సమాజానికి అద్దం ఇటీవల నా వద్దకు వచ్చిన ఒక ఘటన ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా తెలియజేసింది. పది తరగతి చదువుతున్న ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. ఆమె ముఖంలో హాస్యం కనిపించలేదు. అలసట, భయం, నిస్సహాయత మాత్రమే కనిపించాయి. తల్లిదండ్రులు ఆమె చదవడం లేదని ఆందోళన వ్యక్తం చేసినా, ఆ అమ్మాయి చెప్పిన ”నేను చదవడం ఆపలేదు మేడం… నేను బతకడం ఆపాను” అనే మాటలు ప్రస్తుత పరిస్థితిని గుండెకు హత్తుకునేలా చూపించాయి. ”నన్ను ర్యాంక్‌ రోబోలా మార్చేశారు” అన్న ఆమె మాటలు మన దక్పథాన్ని ప్రశ్నిస్తున్నాయి.
విద్య అంటే భయం కాదు. అనుభవం కావాలి. విద్య అనేది ఒత్తిడి కాదు. అది ఆసక్తితో, ఆనందంతో సాగాల్సిన ప్రక్రియ. పిల్లలకు చదవాలనిపించాలి… భయంతో కాదు, ప్రేరణతో. గెలుపు మాత్రమే కాదు, ఓటమి కూడా ఒక పాఠమని వారికి అర్థం కావాలి. గెలుపు నేర్పలేని ఎన్నో విషయాలను వైఫల్యం నేర్పుతుంది.
తల్లిదండ్రుల పాత్ర, మారాల్సిన దృక్పథం: పిల్లలు అపజయం పొందినప్పుడు వారిని మందలించడం కాకుండా, ఎక్కడ తప్పు జరిగిందో వివరించి, దాన్ని సరిచేసే దిశగా మార్గనిర్దేశం చేయాలి. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. మార్కులు జీవితం కాదు. పిల్లల మనసు, ఆత్మవిశ్వాసం మరింత ముఖ్యమైనవి.
విద్యలో సమగ్రత అవసరం చదువు ఒక్కటే కాదు. జీవితంలో మరెన్నో మార్గాలు ఉన్నాయి. సంగీతం, సాహిత్యం, క్రీడలు, కళలు వంటి రంగాలు విద్యార్థుల సమగ్ర అభివద్ధికి దోహదపడతాయి. జీవితాన్ని ఒక పరీక్షగా కాకుండా అనుభవాల సమాహారంగా చూడగల దక్పథం అవసరం.
ప్రభుత్వం, విద్యాసంస్థల బాధ్యత విద్యార్థుల మానసిక ఆరోగ్యం పట్ల ప్రభుత్వం, విద్యాసంస్థలు మరింత శ్రద్ధ వహించాలి. కౌన్సెలింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం, ఒత్తిడి నిర్వహణపై అవగాహన కల్పించడం అత్యవసరం.
ఒక హెచ్చరికగా నిలిచే మాటలు చివరగా ఆ చిన్నారి చెప్పిన ”నన్ను బతికించండి మేడం… చదువు మధ్యలో కాకపోతే… నేను అంతమైపోతాను” అనే మాటలు ఒక విద్యార్థి బాధ మాత్రమే కాదు. మన సమాజం ఎదుర్కొంటున్న సంక్షోభానికి ప్రతిబింబం.
మారాల్సిన సమయం ఇదే. పరీక్ష ఫలితాలు ఒక ప్రయత్నానికి ప్రతిఫలం మాత్రమే. అవి సామర్థ్యానికి కొలమానం కావు. ప్రయత్నం మెరుగుపడితే ఫలితాలు కూడా మెరుగుపడతాయి. వైఫల్యం అంతం కాదు. అది ఒక కొత్త ఆరంభం.
(20వ తేదీన పదవతరగతి ఫలితాలు)

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -