– భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని శ్రీశ్రీ కళ్యాణ వేదిక లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం శనివారం జిల్లా అధ్యక్షుడు గౌరీ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి భద్రాచలం మాజీ ఎంపీ, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మిడియం బాబురావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐటీడీఏ పాలకమండలి సమీక్ష సమావేశాలు సంవత్సరాలుగా నిర్వహించడం లేదని, వాటిని వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఐటీడీఏ పాలకమండలి సమావేశం జరిగితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఐటీడీఏ పరిధిలో ట్రైకార్ రుణాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావడం లేదని విమర్శించారు. గిరిజన గ్రామాలకు సోలార్ విద్యుత్ సౌకర్యాలు కల్పించడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో మంచినీటి బోర్లు, రహదారులు, త్రీఫేజ్ విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నప్పటికీ, తరతరాలుగా సాగు చేస్తున్న ఆదివాసీ రైతుల భూములకు అటవీ హక్కుల చట్టం – 2006 ప్రకారం హక్కు పత్రాలు మంజూరు చేయలేదని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హక్కు పత్రాలు తప్ప, ప్రస్తుత ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా, జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న ఆదివాసులపై అటవీశాఖ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.
ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆదివాసుల నుంచి తీవ్ర నిరసనలు, తిరుగుబాట్లు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. జీవో నంబర్ – 3 ను పునరుద్ధరించాలని లేదా దానికి ప్రత్యామ్నాయంగా కొత్త జీవో తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, దాదాపు 40 సంవత్సరాల క్రితం ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం వల్ల వారు, వారి పిల్లలు విద్య మరియు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సాగు భూములకు హక్కు పత్రాలు పొందాలన్నా, విద్యా అవకాశాలు పొందాలన్నా కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా అవసరమని అధికారులు చెబుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. లేదంటే తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మడివి రమేష్, పాయం నరసింహారావు, సోడెం ప్రసాద్, కుంజా శ్రీను, దుబ్బ గోవర్ధన్, తోలం మల్లయ్య, కొమరం కాంతారావు, రావుల శోభన్‌బాబు, కొమరం చంటి, మడకం గోవింద్, పోడియం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



