Sunday, June 7, 2026
E-PAPER

జాగీరు

- Advertisement -

‘‘నాకు అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలి!’’ తల్లిని అడిగాడు కుమార్.
‘‘వెయ్యి రూపాయలు ఎందుకురా’’ అడిగింది లక్ష్మి ఆశ్చర్యంగా.
‘‘సినిమాకు వెళ్లాలి!’’ అన్నాడు కుమార్.
‘‘నా దగ్గర లేవురా! మీ నాన్నని అడుగు’’ అన్నది లక్ష్మి.
‘‘నాన్న ఇవ్వడు! అంతా ఆయన జాగీరు అనుకుంటాడు!’’ అన్నాడు కుమార్. అంతే..కుమార్ చెంప చెళ్లుమనిపించింది లక్ష్మి.
కుమార్ కళ్లు బైర్లు కమ్మాయి.
ఎందుకు కొట్టావన్నట్లు చూశాడు. ‘‘ఏం మాట్లాడుతున్నవురా? అంతా ఆయన జాగిరే! ఆయన రెక్కల కష్టం మీదనే మనమంతా బతుకుతున్నాము తెలుసా?’’ అంది ఆగ్రహంగా లక్ష్మి.
‘‘జాగీరు అంటే తప్పేమిటి? మొన్న మా హీరో అంటే కూడా ఇలాగే కోప్పడ్డారు!’’ అన్నాడు కుమార్ చెంప రుద్దుకుంటూ.
‘‘జాగీరు అంటే పన్నులు వసూలు చేసే హక్కు. ఎవరికైనా జీతానికి బదులుగా నిజాం పాలకులు భూమి ఇచ్చేవారు. ఆ భూమినే జాగీరు అనీ, భూమి తీసుకున్న వారిని జాగీర్దారు అనేవారు! అయితే మీ హీరో అన్న ఉద్దేశ్యం వేరు. తెలంగాణా మీ సొంతమా? ఇంకెవర్నీ రానీయరా? అన్న ఉద్దేశంతో మాట్లాడాడు!’’ అన్నది లక్ష్మి.
‘‘మా హీరో న్న దాంట్లో తప్పేముంది?’’ అంటూ మెడ మీద చెయ్యి వేసి రుద్దుకోబోయి తల్లి కోపాన్ని చూసి ఆగిపోయాడు కుమార్.
‘‘తెలంగాణా ఆత్మాభిమానానికి మారు పేరు! పోరుగడ్డ ! నైజాం నవాబు నిరంకుశత్వాన్ని ఎదిరించి, ఓడించిన వీరభూమి! ఆ నవాబు నిరంకుత్వం మీద, ఆ నవాబు దగ్గర గులాంగిరి చేసిన భూస్వాముల దౌర్జన్యాల మీద పోరాడినది కమ్యూనిస్టులు! అలాంటి తెలంగాణా ప్రజలమీదా, కమ్యూన ిస్టుల మీద అడ్డగోలుగా మాట్లాడిన తీరు నచ్చకే మీ హీరో మీద అందరికీ కోపం వచ్చింది!’’ అన్నది లక్ష్మి.
‘‘తమిళనాడులో విజయ్‌ ముఖ్యమంత్రి అయినట్లు, మా హీరో కూడా ముఖ్యమంత్రి అయితే తిట్లు తప్పేవి!’’ అన్నాడు కుమార్.
పెద్దగా నవ్వింది లక్ష్మి
‘‘ఎందుకమ్మా నవ్వుతావు!’’ ఉక్రోశంగా అడిగాడు కుమార్.
‘‘నవ్వక ఏం చేయమంటావురా? విజయ్ ఒక స్పష్టమైన విధానం ఉన్నోడు. తన విధానాన్ని తమిళ ప్రజలకు చెప్పి ఓట్లు అడిగాడు. జనానికి నచ్చి ఓట్లేసి గెలిపించారు! మీ హీరోకి ఏం విధానం ఉంది? ’’ అ‌డిగింది లక్ష్మి.
‘‘మా హీరో ఖట్టర్, సనాతనీ హిందు!’’ గట్టిగా అరిచి చెప్పాడు కుమార్.
‘‘అదే ఆ గావు కేకలు తప్ప ఏమున్నాయి మీ హీరో వద్ద! మొదట్లో చెగువేరా అంటూ, కమ్యూనిస్టుల చుట్టూ తిరిగాడు! ఆ తర్వాత ప్లేటు మార్చి తాను హిందువునని, సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతోందని, దాన్ని ఉద్దరిస్తాననని ఇప్పుడు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు! అతనికో విధానం ఉందా? ఇలాంటి వాడు ముఖ్యమంత్రి కాగలడా?’’ అడిగింది లక్ష్మి
‘‘బీజేపీ చుట్టూ తిరిగితే తప్పేమిటి?’’ అడిగాడు కుమార్.
ఈసారి రెండో చెంప చెళ్లుమంది! దానికి కారణం కుమార్ అక్క వాణి.
‘‘ఒకే దేశం! ఒకే పరీక్ష అంటూ దేశమంతా ఒకే పరీక్ష పెట్టి నీట్ అంటూ పరీక్షల పద్ధతి మార్చింది బీజేపీ ప్రభుత్వం! నిర్వహణ చేతకాక పేపర్ లీక్ అయ్యింది! దాంతో నేను చేసిన మెడిసిన్ ఎగ్జామ్ రద్దయ్యింది! పరీక్ష మళ్లీ పెడతారట? ఇట్ల అయితే నేను డాక్టర్ అయ్యేది ఎప్పుడు? నాన్నకి భారం తగ్గించేదెప్పుడు? పరీక్షలు నిర్వహించటం చేత కాని ప్రభుత్వానికి మీ హీరోసపోర్టు చేస్తున్నాడు తెలుసా?’’ అన్నది వాణి కన్నీళ్లతో.
అక్క పరీక్ష రద్దు అనగానే కుమార్ షాక్ తిన్నాడు.
‘‘అసలు మీ హీరో తెలంగాణలోనే ఉంటడు. ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నా ఎవరూ ఏమీ అనలేదు! కానీ తెలంగాణాను, కమ్యూనిస్టులను, గద్దర్‌‌ను చులకనగా మాట్లాడమే ప్రజలకు నచ్చలేదు! అందుకే తీవ్రంగా రియాక్ట్ అయ్యారు! అంతేకాక తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీజేపీ చూస్తున్నది. వారి పప్పులు ఉడక్కపోవటంతో మీ హీరోని దించారు!’’ అన్నది లక్ష్మి.
కమార్ ఆలోచనలో పడ్డాడు.
‘‘కళాకారులు ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకుని రావాలి! మీ హీరో అలాంటి పని ఏనాడూ చేయలేదు. ప్రజలకు నష్టం చేస్తున్న బీజేపీకి సపోర్టు చేస్తున్నాడు. మతం, పేరిట, సనాతన ధర్మం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని అభిమానించటం అంటే మీ వివేక౦ ఏమైంది? నీట్‌ పరీక్ష పేపర్ లీకైందని, విదేశాల్లో ఉన్న భారతీయులు ఈ దేశానికి వచ్చి ధర్నా చేస్తున్నారు. మీ హీ‌రో ఒక్కమాట కూడా మాట్లాడలేదు! నేను ప్రశ్నిస్తా అన్నాడు కాని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు! మాటికి ముందు హీరో అంటున్నావు హీరో లక్షణాలు ఏమైనా ఉన్నాయా?’’ అన్నది వాణి.
కుమార్ గోడమీద ఉన్న హీరో పోస్టర్‌ చించేసి, అక్క రూములో ఉన్న భగత్ సింగ్ పోస్టర్ తెచ్చి ‌గోడకు అంటించాడు.
-ఉషాకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -