చిన్నప్పుడు పాఠశాలలో ఆవు వ్యాసం రాయించేవారు. అంటే ఆవును వర్ణించాలి. ఆవుకు నాలుగు కాళ్లు, రెండు చెవులు, రెండు కొమ్ములు, ఒక తోక ఉండును. గడ్డి తింటుంది. పాలు ఇస్తుంది, ఇలా సాగేది. ఆ తర్వాత ఆవు వ్యాసానికి బదులు పరీక్షలో విమానం గురించి రాయమంటే, విద్యార్థికి దాని గురించి తెలియక, విమానం ఆకాశంలో ఎగురుతుంది. దాని కిటికీ నుండి చూస్తే పచ్చని మైదానాలు కనిపిస్తాయి. అక్కడ ఆవులు మేత మేస్తుంటాయి. అవి తెల్లగా ఉంటాయని… ఇక వాడికొచ్చిన ఆవు వ్యాసం రాసేస్తాడు. ఇప్పుడు సంఘ్ పరివార్, బీజేపీలది అదే మాదిరి తయారయింది. ఒకటే మూసపోసినట్లు నినాదాలిచ్చి, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు పూనుకుంటున్నారు. కానీ కథ ఇప్పుడు అడ్డం తిరిగింది. ఇంత కాలం, ఆవు పవిత్ర దేవత అని, హిందువుల ఆరాధ్యమని, గోమాత అని, ఏ మాంసమున్నా గోమాంస మేనని ముస్లింలపై దాడులు, చంపడాలు చేశారు. అక్లాక్ ను అలానే గోమాంసం ఇంట్లో ఉందని చంపారు. గోవుల రవాణా చేస్తున్న ట్రక్కులను అడ్డగించి డ్రైవర్లను కొట్టి చంపారు. గోవును హిందూ ముస్లింల మధ్య తగాదాగా సృష్టించేందుకు ఒక ప్రచార ఆందోళన చేశారు.
మొన్న బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలే, వారి సమూహాలకు పిలుపునిచ్చారు. బక్రీద్ సందర్భంగా గోవులను వధించవద్దని, హిందువులు దానిని పవిత్రంగా భావించి పూజిస్తారు కనుక ఈ నిర్ణయం చేశామన్నారు. కొనటం, అమ్మటంలో కూడా పాల్గొనవద్దని పిలుపునిచ్చారు. వారు చెప్పినట్లుగానే ముస్లింలు గోవధ మానేశారు. అంతేకాదు, కొనటమూ మానేశారు. అయితే గోవులను పెంచి అమ్ముతున్నవాళ్లు ఎక్కువగా హిందువులే ఉన్నారు. వట్టిపోయిన ఆవులను కూడా కొనటానికి ఎవరూ లేక, కలకత్తాలో పెద్ద ఆందోళనకే దిగారు ఆ అమ్మకందారులు. నూతన ముఖ్యమంత్రి గోవుల కొనుగోళ్లపై నిషేధం, వధ నిషేధం విధించాడని తెలిసి, సువేందు అధికారికి వ్యతిరేకంగా హిందువులే ధర్నాలు చేశారు. మా బతుకుదెరువు పోయిందని, ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని లబోదిబోమన్నారు. ఉత్తరప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. గోమాంసాన్ని, బీఫ్ ఎగుమతి చేస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయి. అందులో టాప్ పన్నెండు కంపెనీల యజమానులు ముస్లింలే కాదు. అందరూ హిందువులే! కొన్ని వందల కోట్ల, వేలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బీఫ్ కంపెనీల దగ్గర కోట్లాది రూపాయలు చందాలు తీసుకున్న బీజేపీ వాళ్లు ఏమీ మాట్లాడలేక పోయారు. ముస్లిం పెద్దలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, గోవధను నిషేధించమని కోరారు. ఈ డిమాండ్ పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగాల్ ప్రాంతాల్లో పనికి రావనుకున్న ఆవులను కొనేవారు లేక, వాటిని సంరక్షించే స్తోమత లేక, ఎండకు ఎండి చనిపోయిన ఆవులు ఎన్నో సోషల్‌మీడియాలో వార్తలుగా వచ్చాయి.
ఏం చేయాలో అర్థం కాని యోగులు, బెంగాల్ మంత్రులు ఒక ఉపాయాన్ని కనిపెట్టారు. పద్నాలుగేండ్ల వయసు దాటాక గోవులను వధించవచ్చని, సర్టిఫికేట్ తీసుకుని అమ్మకాలు, కొనుగోళ్లు చేపట్టవచ్చని సెలవిచ్చారు. అదేమిటి? గోవు మాత అయినప్పుడు, పూజించే గోవు వయసును బట్టి పూజించడం, లేదా వధించడం నిర్ణయిస్తారా? అంటే ముసలాళ్లయిన తల్లిదండ్రులనూ బయటకి గెంటేయటమేనా? ‘‘ఆవుతో మాది జన్మజన్మల బంధం, గోమాతను పూజిస్తాము. ఆవు మాకు తల్లి లాంటిది. దీన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు’’ అని యోగి సన్నాయి నొక్కులు నొక్కారు. మరి గోవధను నిషేధించమంటే, ఉలుకూ లేదు, పలుకూ లేదు. ‘‘ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కానీ, దేశవ్యాప్తంగా గోవధను నిషేధించాలని కానీ ఎలాంటి ప్రతిపాదన లేదు’’ అని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. ఇది వీరి అసలు రూపం. గోవును రక్షించాలన్న కోరిక వీరికి అసలే లేదు. గోవుపై భక్తి అలా ఉంచి ప్రేమ, దయ అసలే లేదు. వీరి నాటకాలన్నీ చందాలు పోగేసుకోవటమే కానీ, గోవు పేరు చెప్పి మతతత్వాన్ని పెంచి మనుషులను విభజించి, రాజకీయ ప్రయోజనం పొందటమే అనేది సుస్పష్టం.
మొదటి నుండి గోవు హిందువులకు, మరీ బ్రాహ్మణులకు పవిత్రమైనదని, దానిని గతంలో వధించలేదని, ఆవు మాంసం తినలేదని ఫోజులు పెట్టి చెబుతుంటారు. చాలామంది నమ్ముతారు. అదంతా ఒట్టి భ్రమ. మనుస్మృతి, రుగ్వేదం, బృహదారణ్యకోపనిషత్తులు చదివినా, ప్రముఖుల రాతలు చదివినా అసలు విషయాలు తేటతెల్లమవుతాయి. యజ్ఞం చేస్తున్న వాళ్లు అతిథులకు సోమరసాన్ని, ఎద్దు మాంసాన్ని వండించి పెట్టాలని ఉంది. ప్రసిద్ధ భారతీయ తాత్వికుడు స్వామి వివేకానంద రచనలలో ‘‘ఒకప్పుడు భారతదేశంలో గోమాంస భక్షణ చేయని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే కాదు’’అని చెప్పారు. చరిత్ర తిరగేస్తే అనేక వాస్తవ విషయాలు బయట పడతాయి. చరిత్రను కూడా వక్రీకరించడం, మతోన్మాదాన్ని సృష్టించడం, దాని ద్వారా రాజకీయ ప్రయోజనాన్ని పొందడమే ఈ కాషాయుల అసలు లక్ష్యం.
అడ్డం తిరిగిన ఆవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



