సామాన్య ప్రజల జీవన , వ్యాపార నిర్వహణ సౌలభ్యాలే లక్ష్యంగా సంస్కరణలు ఉండాలి :
ఆర్థిక సలహా మండలి(ఈఏసీ) సభ్యులతో ప్రధాని మోడీ భేటీ
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆర్థిక సలహా మండలి(ఈఏసీ) సభ్యులతో సమావేశమయ్యారు. మన దేశ ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాలు, చర్యలు గురించి చర్చించారు. సామాన్య ప్రజల జీవన సౌలభ్యం, వ్యాపార నిర్వహణ సౌలభ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టాల్సిన సంస్కరణలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత్పై, అలాగే ప్రపంచంపై చూపే ప్రభావంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం జరిగిన మరుసటి రోజే ఈ సమావేశం జరగడం గమనార్హం.
భారత్ వృద్ధి పథం
కాగా శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, సప్లై చెయిన్ అంతరాయాలు ఉన్నప్పటికీ, రెపోరేటును 2.52 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో తాము తటస్థ వైఖరిని అవలంబిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, స్థూల ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన తర్వాత, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద రెపో రేటును మార్చకుండా 5.25 శాతం వద్దే ఉంచాలని ఎంపీసీ నిర్ణయించిందని చెప్పారు. దీని ప్రకారం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు 5.5 వద్ద కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన అనిశ్చితితో ఉందని, కీలకమైన వాణిజ్య మార్గాలు, సప్లై చెయిన్లకు అవాంతరాలు ఏర్పడుతున్నాయని అన్నారు. వీటికి తోడు మార్కెట్ ఒడుదొడుకులు లాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే గతంలో వచ్చిన ఇలాంటి పరిస్థితులతో పోల్చితే, నేడు భారత్ మరింత పటిష్టంగా ఉందని, సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని అన్నారు. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న అవాంతరాలను మనదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వచ్చిన ఒక అవకాశంగా పాలసీదారులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
ఇంధన దిగుమతులు తగ్గించుకోవాలి!
పశ్చిమాసియా సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో, గత నెలలో ప్రధాని మోడీ భారత పౌరులకు 7 విజ్ఞప్తులు చేశారు. ప్రధానంగా దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడడం తగ్గించాలని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించి, దేశ ఆర్థిక రక్షణకు సహకరించాలని ప్రజలను కోరారు. వీటితోపాటు ఇంటి నుంచి పనిచేయడం (వర్క్ ఫ్రమ్ హోమ్)కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని అన్నారు. కనీసం ఒక ఏడాదిపాటు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే వాడాలని, వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని అన్నారు. ప్రకృతి వ్యవసాయం (నేచురల్ ఫార్మింగ్) వైపు మళ్లాలని, బంగారం కొనుగోళ్లను నియంత్రించాలని పేర్కొన్నారు.
అంతేకాదు ముడి చమురు ధరల్లో వచ్చే ఒడుదొడుకులను తట్టుకోవడానికి, భారతదేశ రవాణా విధానంలో మార్పు రావాలని ప్రధాని మోడీ కోరారు. మెట్రో, ప్రభుత్వ రవాణా సౌకర్యాలను ఉపయోగించాలని, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ప్రయి వేటు వాహనాలు తప్పనిసరి అయినప్పడు ‘కార్ పూలింగ్’ పద్ధతిని ఎంచుకోవాలని, వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగాన్ని పెంచాలని సూచించారు. వస్తువుల రవాణా కోసం రైల్వే మార్గాలను వాడుకోవాలని అన్నారు.
అంచనాలను మించి
ఇదిలా ఉండగా, జూన్ 5న విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో భారత ఆర్థిక వ్యవస్థ మార్కెట్ అంచనాలకు మించి రాణించింది. వార్షిక ప్రాతిపదికన వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (రియల్ జీడీపీ) వృద్ధిరేటు 7.8 శాతంగా ఉండగా, పూర్తి సంవత్సర వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదు అయ్యింది.
స్థిర ధరల ప్రకారం, 2025-26 నాలుగో త్రైమాసికంలో వాస్తవ జీడీపీ రూ.87.77 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.81.40 లక్షల కోట్ల కోట్ల కంటే చాలా ఎక్కువ. ఇక ప్రస్తుత త్రైమాసికానికి నామినల్ జీడీపీ రూ.94.65 లక్షల కోట్లుగా అంచనా.
ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



