– వినీత్ మృతి పై అనుమానాలు ఉన్నాయి
– సమగ్ర విచారణ జరగాలి
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలో బొడ్డు వినీత్ (28) అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. వినీత్‌ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి తల్లిదండ్రులు శనివారం సాయంత్రం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వినీత్ తల్లిదండ్రులు ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ… గత ఆగస్టులో పాత పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ పక్క సందులో వినీత్ శవమై కనిపించాడని, ఉద్యోగం చేసుకునే వినీత్‌ను దొంగగా ముద్రవేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడంపై వారు మండిపడ్డారు.
అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతి చెందిన సంఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పాక్షికమైన సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితులు డిమాండ్ చేశారు. అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కొందరిపై తమకు బలమైన అనుమానాలు ఉన్నాయని వారు తెలిపారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానితులు, అధికారులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్లే రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసు శాఖ నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉందన్నారు.
త్వరలో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ సత్తుపల్లికి రానున్నట్లు నాయకులు వెల్లడించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీని కలసి ఘటనపై సమగ్ర విచారణ కోరుతూ ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వినీత్ తల్లిదండ్రులు సుబ్బారావు, సునీలతో పాటు ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా ఇన్చార్జి కందికట్ల విజయ్ మాదిగ, జాతీయ నాయకులు కొలికపోగు వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్చార్జి గొల్లమందల ముత్తారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు అద్దేపల్లి సాగర్, సోరగుడి రాజేష్, గంధం పాండు, నందిగామ అఖిల్, అభిపాల్, అంబేద్కర్, మాణిక్యం పాల్గొన్నారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించి వినీత్ కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.



