– పీఈక్యూ తనిఖీ పూర్తి..
– 3.24 లక్షల ఆయిల్‌పామ్ మొక్కల విడుదలకు సిఫార్సు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్‌పామ్ సాగు చేయాలనుకుంటున్న రైతులకు నాణ్యమైన మొక్కలు అందుబాటులోకి రానున్నాయి. అశ్వారావుపేట, అప్పారావుపేట నర్సరీల్లో శనివారం పీఈక్యూ మూడో దశ శాస్త్రీయ తనిఖీ పూర్తి కాగా, 3,24,732 ఆరోగ్యకరమైన మొక్కలను రైతులకు పంపిణీ చేసేందుకు బృందం సిఫార్సు చేసింది. పొలాల్లో ముందుగానే డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేసుకుని, గుంతలు సిద్ధం చేసుకున్న రైతులకు మొక్కల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 4.25 లక్షల మొక్కలను ఆరు కన్సైన్మెంట్ల ద్వారా దిగుమతి చేశారు. రవాణాలో దెబ్బతిన్నవి, మోర్టాలిటీకి గురైనవి, లోపభూయిష్టమైన మొక్కలను కల్లింగ్ ప్రక్రియ ద్వారా తొలగించారు. అనంతరం మిగిలిన మొక్కలను ప్లాంట్ పాథాలజీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ఎలాంటి తెగుళ్లు, వ్యాధి లక్షణాలు లేకుండా మొక్కలు ఆరోగ్యకరంగా ఉన్నట్లు నిర్ధారించింది.
ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఎస్.శంకర్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ప్రోత్సాహం, శాస్త్రవేత్తల నిరంతర సాంకేతిక పర్యవేక్షణ తో నాణ్యతా ప్రమాణాలను సాధించగలిగామని తెలిపారు. అశ్వారావుపేట ప్రాంత శీతోష్ణస్థితి కూడా మొక్కల పెరుగుదలకు అనుకూలంగా ఉందన్నారు. కేంద్ర క్వారంటైన్ విభాగం నుంచి అధికారిక విడుదల ఉత్తర్వులు అందిన వెంటనే రైతులకు మొక్కల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
డ్రిప్ ఏర్పాటు చేసుకున్న రైతులకు ప్రాధాన్యత
ఆయిల్‌పామ్ మొక్కల ఎదుగుదలకు నీటి నిర్వహణ కీలకమని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు పొలాల్లో ముందుగానే డ్రిప్ (బిందు సేద్యం) సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే మొక్కలు నాటేందుకు గుంతలు సిద్ధం చేసుకున్న రైతులకు కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. తనిఖీలో ప్లాంట్ పాథాలజీ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ, డెసిగ్నేటెడ్ ఇన్‌స్పెక్షన్ అథారిటీ (పీఈక్యూ) డాక్టర్ బి.పుష్పవతి, ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారులు రవి లక్ష్మీ గుడి, వెంకట్‌రెడ్డి, నర్సరీ ఇన్‌ఛార్జీలు బి.మహేష్, బి.ముద్దు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



