గన్ పార్క్ వద్ద ధర్నాలో వక్తల డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జాతీయ ఓబీసీ కో-ఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్-చైర్మెన్ దుర్గయ్య గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద పలు బీసీ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనాచారి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కేంద్రం జనగణనలో ఓబీసీ కాలం చేర్చకుండా మొండి వైఖరి అవలంబిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తలచుకుంటే అగ్రవర్ణ ప్రభుత్వాలు కుప్పకూలుతాయని, రాష్ట్రంలో త్వరలో వచ్చేది బహుజనుల రాజ్యమేనని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ… ఓబీసీల జనాభాను లెక్కిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి ఇప్పుడు మోసానికి పాల్పడ్డాయని విమర్శించారు. ఆ పార్టీల మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇవి ఎంతో కాలం కొనసాగవని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం జాతీయ జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, బీసీ మేధావుల ఫోరం చైర్మెన్ టి.చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మెన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మెన్ బి.ఎన్.రాములు, రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు వి.జి.ఆర్.నారగోని, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్లు ఆయిలి వెంకన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బైరి శేఖర్, ఓబీసీ జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



