నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు చిరు వ్యాపారులు పూర్తి స్థాయిలో సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్‌ను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మిగిలిపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని వ్యాపారులకు సూచించారు. మార్కెట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, మెరుగైన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చేపల మార్కెట్ రహదారి పక్కనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి పరిష్కారంగా నిర్దిష్ట ప్రదేశంలో చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. చిరు వ్యాపారుల జీవనాధారానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ప్రత్యామ్నాయంగా అనువైన స్థలాన్ని కేటాయిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పరకాల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పట్టణం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు.



