‘‘కొందరు గొప్పవాళ్లుగా కనపడ టానికి కారణం మనం మోకాళ్లపై కూచుని ఉండటమే’’ - జేమ్స్ లార్కిన్స్
సకారణంగానే అనుకోండి! ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసినపుడు, ఎమ్జీఆర్‌కివ్వాలని ఏఐఏడీఎంకె కోరినపుడు పోటాపోటీ కాంగ్రెస్‌లో నడుస్తున్న దశలో, చివరికి అధిష్టానానికంటే ముందే రేవంత్‌రెడ్డి ఈ డిమాండ్ వెనుక పెద్ద కథే ఉందనే వాళ్లూ ఉన్నారు. ఏమైనా అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ రాజకీయం. పైగా రేవంత్‌రెడ్డి డిమాండ్‌ను ఒకవైపుండి చూసి రెండో వైపు చూడకపోతే పూర్తి స్పష్టత రాదు.
రేవంత్‌రెడ్డి చెప్పినట్టు ‘సరళీకరణ, ప్రయివేటీ కరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) విధానాలకు ఆద్యుడు మన్మోహన్‌సింగ్ జీ’నట! ప్రయివేటీకర ణంటే అసలు తెలీని, మొత్తం ప్రయివేటు కంపెనీలమయమైన, నిటారుగా నిలబడితే తల తెగిపడుతుందని భయపెట్టిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో, ఇళ్ల మొదలు వివిధ ఎలక్ర్టానిక్ గ్యాడ్జెట్స్ వరకు వాయిదాల పద్ధతిలో కొనుక్కునే జనం మెండుగా వున్నచోట మన్మోహన్‌సింగ్ శిలా విగ్రహం నిలబెట్టడం ‘సబబే!’. లేకుంటే మూసేసిన హెచ్‌ఎంటీ, ఐడీపీఎల్, ప్రాగా టూల్స్ లాంటివున్న బాలానగర్/జీడిమెట్లల్లో గాని, మూతబడ్డ స్కూటర్ ఫ్యాక్టరీ, ఆల్విన్ వాచ్‌లున్న పటన్‌చెరులో గాని, మూతబడ్డ హెచ్‌సిఎల్, హెచ్‌ఎంటి బేరింగ్స్ ఉన్న మౌలాలిలోగాని ఈ శిలా విగ్రహం పెట్టుంటే ఈ నేతలు ఉన్న కథలు చెప్పడానికి మరోసీన్ ఉండేది.
ఎందుకంటే ప్రయివేటీకరణంటే ఫైనాన్షి యల్ డిస్ట్రిక్ట్‌లో 50/60 వేల రూపాయల జీతాలొచ్చే కొందరుండటం కాదు.
ప్రభుత్వరంగం కాన్సెప్ట్ వెనక జాతీయోద్యమ వాంఛ ఉంది. మన దేశం తన కాళ్లపై తను నిలబడాలనే ఇచ్ఛ ఉంది. మోడీ చెప్తున్న ‘ఆత్మనిర్భర భారత్’ తన ఆత్మ బంధువుల పోషణ కోసం ఉద్దేశించింది. అందుకే డిఫెన్స్ రంగంలో సైతం అదానీ ఠీవిగా ప్రవేశించాడు.
లలిత్‌మోడీ, నీరవ్‌మోడీ, (నరేంద్ర మోడీ చుట్టాలు కాదులే) విజయ్‌మాల్యా, మెహుల్ చోక్సీ, పవన్‌ఖేరా వంటి పెద్దలు ప్రభుత్వరంగ బ్యాంకులను ముంచి దేశంలో నుండి ఉడాయించిన ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా జీటీవి సుభాష్ చంద్ర సెటిల్మెంట్ కథనం ‘‘భక్తులకు’’ కండ్లు తెరిపించాలి. ఇవన్నీ సరళీకరణ విధానాల ఫలితమని మనకు అర్థం కావాలి. మన్మోహన్ సింగ్ పెట్టిన ‘‘గాడి’’ ఫలితమిది. ఇదిక్కడితో ఆగలేదు.
సరళీకరణ అంటే మెరిసే ఉపాధి, ఉద్యోగాలు, జీతాలు, ఇన్‌స్టాల్‌మెంట్లు, స్కోడా కార్లు, సింగపూర్, థాయిలాండ్ టూర్లు అనుకుంటే తీరా సంఘాలు లేవు, సమ్మెలు లేవు. యజమానుల ఇష్టారాజ్య స్థాపన అని కల్లో కూడా ఊహించలేదు అనేకమంది కార్మికులు. సరళీకరణంటే ‘లైసెన్స్ రాజ్యం’ అంతమవుతుందని ‘వాళ్లు చెప్తే వీళ్లు’ నమ్మారు. నమ్మి దేశమంతా శక్తి కొలదీ ప్రచారం చేశారు. నోరున్న జనం కదా! లైసెన్స్ రాజ్యంలో ఇందిరాగాంధీ ఎక్కడ పరిశ్రమ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో నిర్ణయించేది. లైసెన్సులు పెట్టుబడిదారుల సమస్య! సామాన్యులది కాదు.
ఆనాటి కేంద్ర పాలకుల చేతివాటం ప్రశ్న. సమాధానం చెప్పమని ప్రజలందర్నీ అడిగారు పెట్టుబడిదారులు. పైన పేర్కొన్న జనం దీన్ని విస్తారంగా ప్రచారంలో పెట్టారు. అది ఫక్తు పెట్టుబడిదారుల రాజ్యానికి బాటలు పరిచింది. మోడీ సింహాసనాధీశుడైనాడు.
‘ఎమర్జెన్సీ రోజుల్లో హైవేజ్ ఐలాండర్స్’ ప్రచారం ఎత్తుకున్నారు పాలకులు. పేదరిక సముద్రంలో అధిక జీతాలున్న ద్వీపాలన్న మాట! ఏఐఐఈఏ వంటి సంఘాలు, సీఐటీయూతోపాటు ఆ ప్రచారాన్ని శక్తివంతంగా తిప్పికొట్టాయి.. అన్ని సంఘాలూ దీన్లో విజయం సాధించాయని చెప్పలేమనుకోండీ! ఈ ప్రచార దాడి భౌతికదాడిగా మారింది. 1974 రైల్వే సమ్మెతో ప్రారంభమై వేతనాలపై దాడి (వేజ్ ఫ్రీజ్), డిఏ స్తంభనల అమలు తర్వాత ఎమర్జెన్సీ రూపంలో మొత్తం కార్మికో ద్యమంపై భౌతికదాడిగా మారింది. ఇపుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ‘గడీ’లను పగలకొట్టి, 7వ గ్యారంటీ ‘‘అమలు’’ చేసినట్లే, 1977లో జనతాపార్టీ ఎమర్జెన్సీ చట్రాన్ని పగలకొట్టి కార్మికవర్గంపై దాడి కొనసాగించింది. ఐ.ఆర్.బిల్లును సీఐటీయూ దేశ కార్మికోద్యమాన్ని ఏకంచేసి తిప్పికొట్టింది.
శత్రుశేషం, రుణశేషం ఉండకూడదంటారు. ఈ రెండూ మిగిలే ఉన్నాయి. జనతా ప్రభుత్వంలో కార్మిక శాఖామంత్రి కేరళలో మాజీ సంస్థానధీశుడు రవీంద్రవర్మ, ఐఆర్ బిల్లును తెస్తే, అదే రవీంద్ర వర్మ నాయకత్వంలో ఏర్పడిన రెండవ జాతీయ లేబర్ కమిషన్ (ఎస్‌ఎన్‌ఎల్‌సి) ఇచ్చిన సిఫార్సులు ఎన్నికలు తరుముకొస్తుండటంతో వాజ్‌పాయ్ సర్కార్ 2002లో అమలు చేయలేదు. దాదాపు అవే నేడు నాలుగు లేబర్ కోడ్స్ రూపంలో అవతారం ఎత్తాయి.
ఇదంతా శత్రు శేషమైతే 1991లో పి.వి., మన్మోహన్‌లు తీసుకున్న ఐఎంఎఫ్ ‘రుణ శేష’ ప్రభావం అంతా, ఇంతా కాదు.
నేడు మోడీ రాజ్యంలో నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపీ) (2.0) ప్రభుత్వరంగ ఆస్తులను తవ్వి ప్రయివేటు వారి దొడ్లో పోసే పద్ధతికి అనే ముద్దుపేరు పెట్టారు. ఈ ‘గాడి’ తవ్వింది కూడా సదరు మన్మోహన్‌సింగే. మరి ఇలాంటి వ్యక్తి శిలా విగ్రహం రేవంత్‌రెడ్డి పెట్టడంలో తప్పేముంది?!’’
ఇక రేవంత్‌రెడ్డి నాణానికి రెండవవైపు చూద్దాం! నిజాం పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తి చేసింది నెహ్రూ, పటేల్ ద్వయమైతే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నిజంచేసింది సోనియా, మన్మోహన్ ద్వయమట! నాలుగువేల మంది ప్రాణత్యాగం, యాభై వేల మందికిపైగా చిత్రహింసలకు గురైన కమ్యూనిస్టులపాత్ర వీరెవరికీ కనపడక పోవడంలో ఆశ్చర్య మేముంది? రాష్ట్ర కాంగ్రెస్ పాలనకు ఇంగ్లీషు ‘ఫేస్’ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ‘‘మన్మోహన్ సింగ్ చేసిన సంస్కరణలే దేశాభివృద్ధికి కారణమ’’ని కుండబద్దలు కొట్టాడు. పైగా అణుశక్తి ఒప్పందాలవల్ల ఇంధన కొరత రాకుండా చూశారట. ప్రయివేటు రంగంలో ఒక్కటీ మొలకెత్తలేదు. అందుకే (సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా) షాన్‌తీకి రూపకల్పన చేశారు. మన్మోహన్‌సింగ్. 2008 తర్వాత పెరిగిన అణు ఇంధన ఫ్యాక్టరీల శక్తి మొత్తం ప్రభుత్వరంగంలోనే.
మంత్రివర్యా! ఐఎంఎఫ్ నుండి మన దేశానికి ప్రయివేటు రంగం కోసం 100/200 మె.వా. ఫ్యాక్టరీలొస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా 2026లో నేడు హురుణ్ , ఫోర్బ్స్ లెక్క ప్రకారం 391మంది డాలర్ శత, సహస్ర కోటీశ్వ రులు (బిలియనీర్స్) భారత్‌లో ఉన్నారు. 2025లో ఇది 350గా ఉంది. 2014లో 100-230 మధ్యే ఉంది. బిలియనీర్లు పెరగడమే అభివృద్ధికి సంకేతంగా బీజేపీతో పాటు కాంగ్రెస్సూ పరిగణిస్తోంది.
కార్మికుల బతుకులు దిగనాసిల్లుతున్నాయి. కార్మికులుకాని కార్మికుల సంఖ్య (ఫిక్స్ డ్ టర్మ్ కార్మికులు, నేషనల్ ఎంప్లాయ్ బిలిటి ఎన్‌హాన్స్ మెంట్ స్కీం, న్యాప్స్, న్యాట్స్, విల్స్ (వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్), టెన్యూర్ ఎంప్లాయీ, వగైరాలు అక్కడ ప్రకటించాడో లేదో మన రాష్ట్ర అధునాతన పరిశ్రమలన్నింటిలో పుట్టుకొచ్చారు. నాలుగు లేబర్‌కోడ్స్ అమలు చేయబోమని ప్రకటించాలనీ, గతంలో కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ప్రకటించినట్లు ప్రకటించమని రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఉద్యమం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అందుకు ఈ సర్కార్ సిద్ధపడలేదు. బీజేపీతో కుర్చీలాటలో పేచీ తప్ప, ఆర్థిక విధానాల్లో ఏకీభావముంది. అనేక ఇతర బూర్జువా పార్టీలదీ ఇదే విధానం. 1978లో మనం చూసిన జనతాపార్టీ విధానమూ అదే! రేవంత్‌రెడ్డి నాణానికి రెండోవైపు కనపడే సీనిదే!
కేసీఆర్, పీవీని ఆకాశానికెత్తి ఆయన విగ్రహం పెట్టి, ఆయన కూతురుకు ఎమ్మెల్సీ ఇచ్చి లూప్‌లైన్‌లోకి నెట్టిందీ ఇందుకే!
మీ పార్టీ ప్రధాని (మన్మోహన్), మతోన్మాదం యెడల స్థిరంగా నిలబడ్డ వ్యక్తి! ఆ మేరకు పొగుడుకోండి! దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టాడని అతిశయోక్తులతో కూడిన పొగడ్తలు చూస్తే జనం నవ్విపోతారు.
ఆర్. సుధాభాస్కర్







కామెంట్‌లు (0)