సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
కళ్యాణలక్ష్మిని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి
పెండింగ్‌లో ఉన్న 2 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలి : మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇంకెప్పుడిస్తారని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు హరీశ్‌రావు శుక్రవారం ఎక్స్ వేదికగా కళ్యాణలక్ష్మి పథకానికి 12 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. కళ్యాణ లక్ష్మీ పథకం సామాజిక సంస్కరణ పథమని తెలిపారు. బాల్య వివాహాలను అడ్డుకుని పేదింటి ఆడబిడ్డలకు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన గొప్ప కార్యక్రమానికి 12 ఏండ్లు పూర్తయ్యాయని వివరించారు.
2002 మార్చిలో ములుగు మండలం గుత్తూరు తండాలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసీఆర్‌ను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. బిడ్డ పెండ్లి కోసం దాచుకున్న రూ.50 వేల నగదు, బంగారం అగ్నికి ఆహుతయ్యాయని వివరించారు. గుండెలవిసేలా రోదిస్తున్న బానోతు కీమానాయక్‌ను చూసిన కేసీఆర్ చలించిపోయారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం దగ్గరుండి ఆ బిడ్డ పెండ్లి జరిపించారనీ, అవసరమైన ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. ఆ ఘటనతో కార్యరూపం దాల్చిన పథకమే కళ్యాణలక్ష్మీ–షాదీ ముబారక్ అని గుర్తు చేశారు. 2014 అక్టోబర్ రెండున రూ.51 వేల ఆర్థిక సాయంతో పథకం ప్రారంభమైందని తెలిపారు. 2017లో రూ.75,116కు, 2018లో రూ.1,00,116కు పెంచారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించారని వివరించారు.
కళ్యాణలక్ష్మి అమలుపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం అమలుపై నిర్లక్ష్యం వహిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. పెండ్లి అయిపోయి పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మి డబ్బుల కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్న పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏడాదికి రూ.2,500 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే, ఇప్పుడు అందులో సగం కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉందని తెలిపారు.
కేసీఆర్ మీద కక్షతో ఇప్పటికే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను నిలిపేశారని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మిని కూడా నీరుగార్చుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికొదిలేసిందని విమర్శించారు. మూడేండ్లు గడిచినా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేసిందని తెలిపారు. తులం బంగారం ఏమో కానీ రూ.లక్ష ఇస్తే చాలు అన్న పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
తమిళనాడులో 4 నాలుగు నెలల్లో అమలు
తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన బంగారం హామీని నాలుగు నెలల్లోనే అమలు చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ దవాఖానాల్లో పుట్టిన ఆడబిడ్డకు బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. అన్ని వర్గాలను మోసం చేసినట్టే పేదింటి ఆడబిడ్డలను సైతం సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రెండు లక్షల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు.అభయహస్తం మ్యానిఫెస్టోలో ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని సూచించారు.







కామెంట్‌లు (0)