Magazines

అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నామా?

2 గంటల క్రితం

health
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 3 నిమిషాల చదవడం

ఒక పూట ఆకలి తీర్చుకోవడానికి ఆర్డర్‌ చేసిన ఆహారమే ఆరోగ్యానికి శాపంగా మారితే పరిస్థితి ఎంత ఆందోళనకరం! బిజీ జీవితంలో ఇంటివంటకు దూరమవుతున్న ప్రజలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, వీధి బండ్లు, ఆన్‌లైన్‌ డెలివరీలపై ఆధారపడటం పెరిగింది. అయితే ఆ ఆహారం ఎక్కడ తయారవుతోంది? ఎలాంటి ముడి పదార్థాలు వాడుతున్నారు? ఎంతకాలం నిల్వ చేశారు? పరిశుభ్రత పాటిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు మాత్రం అంతు చిక్కడం లేదు.హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఆహార తనిఖీలు పరిస్థితి తీవ్రతను బయటపెడుతున్నాయి. ముఖ్యంగా అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, నెయ్యి, పచ్చళ్లు, ఖోవా, పనీర్‌, పెరుగు, క్రీమ్‌, టీ పొడి వంటి పదార్థాల్లో కల్తీ వెలుగుచూసింది. ఒక తనిఖీలోనే 4,032 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, 6,200 కిలోలకు పైగా నాసిరకం ముడి పదార్థాలు పట్టుబడ్డాయి. మరోచోట వందల కిలోల కల్తీ పేస్ట్‌ స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీలో పామాయిల్‌, వనస్పతి, ఇతర చౌక పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు బయటపడింది.ఇంత విస్తృతంగా ఆహార కల్తీ జరుగుతున్నప్పటికీ తనిఖీలు సరిపోతున్నాయా అన్నది ఆలోచించాల్సిన విషయం. హైదరాబాద్‌లో సుమారు 75 వేల తినుబండారాలు ఉన్నట్లు ఒక నివేదిక పేర్కొనగా, 2025లో జీహెచ్‌ఎంసీ 9,656 తనిఖీలు నిర్వహించి 3,500 ఆహార నమూనాలు మాత్రమే సేకరించింది. ఆన్‌లైన్‌ డెలివరీ, రిటైల్‌ కేంద్రాల తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, ఆహారం–ఇతర వస్తువులను కలిపి నిల్వ చేయడం, సిబ్బందికి వైద్య ధ్రువపత్రాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి. ఇక్కడ మరో ప్రధాన సమస్య సిబ్బంది కొరత. తెలంగాణకు సంబంధించి FSSAI రాష్ట్ర ఆహార భద్రత సూచీ సమాచారంలో 81 మంది ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు అవసరం కాగా, పూర్తి కాల సిబ్బంది 36 మంది మాత్రమే ఉన్నట్లు గత అధికారిక డేటా చూపించింది.

ఇంత పెద్ద ఆహార వ్యాపార రంగాన్ని ఇంత తక్కువ సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించడం ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్న. ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, తయారీ కేంద్రాలు, గోదాములు, డెలివరీ కిచెన్లపై ప్రమాద ఆధారిత తనిఖీలు పెరగాలి. మొబైల్‌ ల్యాబ్‌లు, ఆధునిక పరీక్షా సదుపాయాలు కూడా విస్తరించాలి.కల్తీ ఆహారం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు, రసాయన కాలుష్యాలు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. డయేరియా, టైఫాయిడ్‌ వంటి అనారోగ్యాలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. పదేపదే వేడి చేసిన నూనెల్లో హానికరమైన ఆక్సీకరణ ఉత్పత్తులు ఏర్పడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు, మిఠాయిలు, మసాలాలు, పచ్చళ్లలోనూ కల్తీ జరిగే అవకాశం ఉన్నందున నిరంతర నిఘా అవసరం. ఇది కేవలం ఆహార శాఖ సమస్య కాదు. ప్రజారోగ్య వ్యవస్థకు తగిన నిధులు కూడా అవసరం. జాతీయ ఆరోగ్య విధానం-017 ప్రకారం 2025 నాటికి ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలనే లక్ష్యం ఉంది. అయితే 2021-22లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలిపిన ఆరోగ్య వ్యయం జీడీపీలో 1.8 శాతం మాత్రమే.

అదే సమయంలో ప్రజలు తమ జేబుల నుంచి చేసిన ఆరోగ్య వ్యయం రూ.3.56 లక్షల కోట్లు, మొత్తం ఆరోగ్య వ్యయంలో 39.4 శాతం. ప్రభుత్వ వైద్య సదుపాయాలు బలహీనంగా ఉంటే సామాన్యుడు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది.అందువల్ల ఆరోగ్యంపై ఖర్చు అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స చేయడమే కాదు. సురక్షిత ఆహారం, స్వచ్ఛమైన వాతావరణం, ప్రాథమిక వైద్యం, ముందస్తు పరీక్షలు, వ్యాధి నిరోధక చర్యలపై పెట్టుబడి పెట్టడం కూడా ప్రజారోగ్యంలో భాగమే. గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌ వంటి అసాంక్రమిక వ్యాధుల భారం పెరుగుతున్న సమయంలో నాణ్యమైన ఆహారం మరింత అవసరం. ప్రభుత్వం తనిఖీలు పెంచాలి. ఖాళీగా ఉన్న ఫుడ్‌ సేఫ్టీ పోస్టులను భర్తీ చేయాలి. నమూనాల పరీక్షల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఉల్లంఘనలు రుజువైతే శిక్షలు వేగంగా అమలయ్యేలా వ్యవస్థను బలోపేతం చేయాలి. వ్యాపారులు లాభం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు.అదే సమయంలో ప్రజల అప్రమత్తత కూడా అత్యంత కీలకం. పరిశుభ్రత లేని చోట ఆహారం తీసుకోకపోవడం, అనుమానాస్పద పదార్థాలు కొనకపోవడం, ప్యాకెట్‌పై తయారీ-గడువు తేదీలు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ వివరాలు పరిశీలించడం, కల్తీ అనుమానం ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయడం ప్రతి వినియోగ దారుడి బాధ్యత.ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. కానీ ఆ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను ప్రభుత్వం, వ్యాపారులు, ప్రజలు ఒకరిపై ఒకరు నెట్టేస్తే సమస్య పరిష్కారం కాదు. కల్తీ ఆహారంపై కఠిన నిఘా, తగిన సిబ్బంది, వేగవంతమైన పరీక్షలు, ప్రజల అప్రమత్తత-ఈ నాలుగు కలిసినప్పుడే ప్రజారోగ్యం రక్షించబడుతుంది.


మేకిరి దామోదర్, 9573666650

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్