క్యూబా గురించి రాయడం అంటే ఒక దేశం గురించి రాయడం మాత్రమే కాదు. ఒక చిన్న దేశం తన సార్వ భౌమత్వాన్ని కాపాడు కోవడానికి సాగించిన దీర్ఘ పోరాటం గురించి రాయడం. సామ్రాజ్య వాద ఒత్తిడిని ఎదుర్కొంటూ ఒక విప్లవం తనను తాను ఎలా నిలబెట్టుకుంది? ప్రజల జీవితాలను ఎంతవరకు మార్చింది? నేటి సంక్షోభంలో ఆ వ్యవస్థ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది? క్యూబా మన ముందుంచే ప్రశ్నలు ఇవి. 2026 ఆగస్టు 10 నుంచి 13 వరకు హవానాలో జరిగిన ఫిడెల్ కాస్ట్రో శతజయంతి అంతర్జాతీయ కొల్లోక్వియంలో భారత ప్రతినిధి బృందంలోని ఏడుగురు సభ్యుల్లో నేనూ ఒకరిగా పాల్గొన్నాను. ఈ పర్యటన జరిగి కొంతకాలం గడిచిపోయింది. కానీ హవానాలో చూసిన దృశ్యాలు, విన్న విప్లవ స్ఫూర్తి ఇంకా మనసులోనే ఉన్నాయి. అందుకే ఈ ప్రయాణాన్ని తిరిగి తలచుకోవడం గతాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. నేటి క్యూబాను అర్థం చేసుకోవడానికి నిన్నటి క్యూబాను మరోసారి చదవడం.
చిన్న దేశం...పెద్ద సవాలు
క్యూబా చరిత్రను అర్థం చేసుకోకుండా దాని వర్తమానాన్ని అర్థం చేసుకోలేం. 1953 మోంకాడా దాడి, 1956 గ్రాన్మా ప్రయాణం, సియెర్రా మేస్త్రా గెరిల్లా పోరాటం, 1959 విప్లవ విజయం-ఇవి క్యూబా చరిత్రను మలిచిన కీలక ఘట్టాలు. ఫిడెల్ కాస్ట్రో, చే గువేరా వంటి నాయకులు ఆ పోరాటానికి అంతర్జాతీయ ప్రతీకలుగా మారారు.విప్లవం తర్వాత విద్య, వైద్యం, భూమి, పరిశ్రమల రంగాల్లో విస్తృతమైన మార్పులకు క్యూబా పూనుకుంది. 1961 అక్షరాస్యత ఉద్యమం అందులో ముఖ్యమైనది. అదే సమయంలో అమెరికా-క్యూబా ఘర్షణ తీవ్రతరమైంది. 1960లో ప్రారంభమైన ఆర్థిక ఆంక్షలు 1962లో మరింత విస్తరించాయి. ఆంక్షలను అమెరికా క్యూబా ప్రభుత్వంపై ఒత్తిడి కోసం అవసరమైన చర్యలుగా సమర్థిస్తే, క్యూబా వాటిని దీర్ఘకాలిక ఆర్థిక దిగ్బంధనంగా విమర్శిస్తోంది. 2024లో ఐరాసలో క్యూబాపై అమెరికా ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనాన్ని ముగించాలని కోరుతూ వచ్చిన తీర్మానానికి 187 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ప్రపంచంలోని అధిక భాగం దేశాలు ఆంక్షలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అవి కొనసాగుతుండటం క్యూబా-అమెరికా ఘర్షణ ఎంత దీర్ఘకాలికమైందో చూపిస్తుంది.
ఫిడెల్–చే: జ్ఞాపకాలు కాదు... ఒక జీవన స్ఫూర్తి
ఫిడెల్ కాస్ట్రో కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఒక విషయం ప్రత్యేకంగా అనిపించింది. విప్లవ చరిత్రను పిల్లలే సందర్శకులకు వివరిస్తున్నారు. చరిత్రను పుస్తకాల్లోనే కాకుండా సామాజిక జ్ఞాపకంగా తరువాతి తరానికి అందించే ప్రయత్నం అక్కడ కనిపించింది. ఆగస్టు 13న ఫిడెల్ శతజయంతి కార్యక్రమంలో సైనికులు, అధికారులు, సాధారణ పౌరులు కలిసి పాల్గొన్నారు. పిల్లలు క్యూబా విప్లవచరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు. చే గువేరా పనిచేసిన ప్రదేశాలు, ఆయన ఉపయోగించిన వస్తువులు, పుస్తకాలు, వైద్య సామగ్రిని చూసినప్పుడు ఒక ప్రశ్న ఎదురైంది-ఒక మనిషి తన వ్యక్తిగత జీవితాన్ని దాటి ఒక ఆలోచన కోసం ఎంత దూరం వెళ్లగలడు? శాంటా క్లారాలోని చే స్మారకం ముందు నిలిచినప్పుడు ఆయన త్యాగం, అంతర్జాతీయత గుర్తుకొచ్చాయి. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మన దేశ విప్లవ నాయకుల నిరాడంబర జీవితం కూడా గుర్తొచ్చింది.విప్లవం ఒక రోజులో జరుగుతుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవడం తరాల పని.
విప్లవం నినాదాల్లో కాదు... ప్రజల జీవితాల్లో
క్యూబా విప్లవం అసలు పరీక్ష ప్రజల జీవితాల్లోనే ఉంటుంది. ఆసుపత్రుల్లో క్యాన్సర్, కార్డియాలజీ విభాగాలను చూశాం. వైద్యులతో మాట్లాడాం. చికిత్స పొందుతున్న పిల్లలను చూశాం. పిల్లలతో పాటలు పాడుతున్న ఉపాధ్యాయులను చూశాం. మేము తీసుకెళ్లిన మందులను అందించినప్పుడు వైద్య సిబ్బంది చూపించిన కృతజ్ఞత ఎంతో మానవీయంగా అనిపించింది. అక్కడ ఒక విషయం స్పష్టమైంది-విప్లవం అంటే కేవలం అధికార మార్పు కాదు. ప్రజల జీవితాలను మార్చాలనే ప్రయత్నం కూడా. క్యూబా ప్రజలు మొదట్నుంచీ కష్టాలను ఎదుర్కొనే తత్వాన్ని తమ జీవన విధానంలో భాగంగా మార్చుకున్నట్లు కనిపించింది. ఉన్నదానితోనే బతకడం, పరిమిత వనరులను పంచుకోవడం, కొరతను సామూహిక సమస్యగా ఎదుర్కో వడం అక్కడి సామాజిక అనుభవంలో భాగమయ్యాయి. కష్టకాలాల్లో నాయకులు కూడా ప్రజలతో కలిసి నిలబడటం, వ్యవసాయ పనుల్లో పాల్గొనడం క్యూబా రాజకీయ సంస్కృతిలో కనిపించే మరో అంశం.ఎంతటి కరువు, కొరత వచ్చినా విద్య, వైద్యం, సామాజిక రక్షణ వంటి విప్లవ సాధనాలను కొనసాగించాలనే ప్రయత్నం అక్కడ కనిపించింది.
ఆర్థిక దిగ్బంధనంలో క్యూబా
హవానాలో విద్యుత్ కోతలను చూశాం. హోటల్లో నీటి కోసం ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంధనం కోసం రోడ్లపై ఎదురుచూస్తున్న వాహనాలను చూశాం. మందుల కొరత, రవాణా సమస్యలు కూడా కనిపించాయి. పనులు లేక దిగాలుగా ఉన్న ముఖాలు, సహాయం కోసం చాచిన చేతులు కనిపించాయి.ఈ దృశ్యాలను చూసిన వెంటనే క్యూబా వ్యవస్థ వైఫల్యంగా తేల్చేయడం సులభం. కానీ అక్కడి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ కష్టాల వెనుక దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని కూడా చూడాలి. 1960ల నుంచి కొనసాగుతున్న ఆంక్షలు క్యూబా విదేశీ వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలపై దీర్ఘకాలిక ప్రభావం చూపాయి. ఇంధనం, మందులు, ఆహారం, యంత్ర పరికరాలు వంటి అవసరాల కొనుగోళ్లకూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. 2026లో ఇంధన సరఫరాపై మరింత ఒత్తిడి రావడంతో విద్యుత్ కోతలు తీవ్రతరమయ్యాయి. వాటి ప్రభావం నీటి సరఫరా, రవాణా, ఆసుపత్రులు, వ్యవసాయం, పర్యాటక రంగాలపై కూడా పడింది. క్యూబాకు అవసరమైన ఇంధనంలో గణనీయమైన భాగం దిగుమతులపైనే ఆధార పడుతుంది. దేశీయ ఉత్పత్తి అవసరాలను తీర్చలేకపోవడం, అంతర్జాతీయ ఆంక్షల వల్ల సరఫరా మార్గాలు కష్టతరం కావడం, విదేశీ మారక ద్రవ్య కొరత-ఇవన్నీ కలిసి ఇంధన సంక్షోభాన్ని తీవ్రమయ్యేలా చేశాయి.
కష్టాల్లోనూ నిలిచిన విప్లవ జ్ఞాపకం
క్యూబాలో నాకు కనిపించిన అత్యంత బలమైన దృశ్యం ఏ విగ్రహమూ కాదు. ఏ మ్యూజియమూ కాదు. కష్టాల్లో ఉన్నప్పటికీ తమ చరిత్రను మరచిపోని ప్రజలు. హవానా వీధుల్లో కొరత కనిపించింది. నిరాశ కనిపించింది. సహాయం కోసం ఎదురు చూసే సందర్భాలు కనిపించాయి. కానీ అదే సమయంలో తమ దేశంపై, తమ విప్లవ చరిత్రపై ఒక ప్రత్యేకమైన అనుబంధం కూడా కనిపించింది. గ్రాన్మా మ్యూజియంలో ఒకప్పుడు 82 మంది విప్లవకారులను మోసుకెళ్లిన ఆ చిన్న నౌకను చూసినప్పుడు, అసాధ్యమని కనిపించినదాన్ని సాధించాలనే పట్టుదల ఒక దేశపు రాజకీయ సంస్కృతిని ఎలా మార్చగలదో అనిపించింది. ఫిడెల్ కేంద్రంలో పిల్లలు విప్లవ చరిత్రను వివరిస్తున్నప్పుడు, చే జ్ఞాపకాల ముందు నిలిచిన ప్పుడు, ఆసుపత్రిలో ఒక చిన్నారి చికిత్స పొందుతున్న దృశ్యాన్ని చూసినప్పుడు-విప్లవం ఒక సిద్ధాంత గ్రంథంలోని పదంగా కనిపించలేదు. మనిషి కోసం ఒక సమాజాన్ని నిర్మించాలనే నిరంతర ప్రయత్నంగా కనిపించింది. అందుకే అక్కడ “వివా” అనే నినాదం కేవలం నినాదంగా అనిపించదు. అది చరిత్రతో, దేశంతో, విప్లవంతో తమ అనుబంధాన్ని వ్యక్తం చేసే భావనగా కనిపిస్తుంది. క్యూబాను కళ్లుమూసుకుని ప్రశంసించడం సరైంది కాదు. అదే విధంగా కేవలం కొరతలను చూపించి దాని సామాజిక విజయాలను కొట్టిపారేయడం కూడా సరైంది కాదు. విద్య, వైద్యం, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో క్యూబా నిర్మించుకున్న సామర్థ్యం ఒక వాస్తవం. ప్రపంచంలోని పలు దేశాలకు వైద్య బృందాలను పంపిన అంతర్జాతీయ వైద్య సేవలు కూడా క్యూబా ప్రత్యేకత. కోవిడ్ సమయంలోనూ క్యూబా వైద్య బృందాలు పలు దేశాల్లో పనిచేశాయి.
క్యూబా ప్రజలకు విప్లవ జేజేలు
హవానాలో గడిపిన రోజులు నాకు కేవలం ప్రయాణ జ్ఞాపకంగా మిగలలేదు. ఒక ఆలోచనగా మిగిలాయి. చీకటిలో మునిగిన హవానా ఓడిపోయిన దేశంలా కనిపించలేదు. అలాగే అన్ని సమస్యలను అధిగమించిన దేశంలా కూడా కనిపించలేదు. పోరాడు తున్న దేశంలా కనిపించింది. తన చరిత్రను మోస్తూ, సంక్షోభంతో పోరాడుతూ, బయటి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూ, తన అంతర్గత సమస్యలతోనూ తలపడుతూ భవిష్యత్తును వెతుక్కుంటున్న దేశంలా కనిపించింది. చివరగా ఒక్కమాట. ఫిడెల్ నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం, చే నుంచి వచ్చిన త్యాగ స్ఫూర్తి, రౌల్ కాస్ట్రో కాలంలో కొనసాగిన వ్యవస్థ, నేటి డియాజ్-కానెల్ నాయకత్వం-ఇవన్నీ ఇప్పుడు ఒకే చారిత్రక పరీక్షను ఎదుర్కొంటున్నాయి. విప్లవం ఒకసారి గెలవడం చరిత్ర. సంక్షోభంలోనూ ప్రజల జీవితాలను మెరుగుపరచడం వర్తమానం. అందుకే ఫిడెల్ జ్ఞాపకాల మధ్య, చే అడుగుజాడల మధ్య, గ్రాన్మా చరిత్ర మధ్య, ఆసుపత్రిలో ఒక చిన్నారి పక్కన, విద్యుత్ లేని హవానా చీకటిలో కూడా ఒక విప్లవస్ఫూర్తి స్పష్టంగా కనిపించింది-క్యూబా విప్లవం గెలిచింది. కానీ, పోరాటం ఇంకా ముగియలేదని!
క్యూబాకు జేజేలు! క్యూబా ప్రజలకు జేజేలు!
క్యూబా విప్లవ స్ఫూర్తికీ జేజేలు!
బి.వెంకట్, 9490098045






కామెంట్‌లు (0)