- జేవీఆర్ ఓసీ-2 తనిఖీ,
- నూతన ఓసీ-3పై ప్రత్యేక సమీక్ష
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి సింగరేణి బొగ్గు గనుల పరిధిలో ఉత్పత్తి పెంపుదల, నాణ్యతా ప్రమాణాల పరిశీలనతో పాటు భవిష్యత్ నూతన ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేసే లక్ష్యంతో సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కొప్పుల వెంకటేశ్వర్లు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటచారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా జేవీఆర్ ఓసీ-2 గనిలో బొగ్గు ఉత్పత్తి పురోగతి, జేవీఆర్ ఈపీసీ, పీహెచ్‌పీల ద్వారా బొగ్గు రవాణా తీరును డైరెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ రోడ్డు డైవర్షన్ పనులు, అలాగే నూతనంగా ప్రతిపాదించిన జేవీఆర్ ఓసీ-3 ప్రాజెక్ట్ సరిహద్దులు, విస్తరణ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం వెంకటచారి, అధికారుల బృందం జేవీఆర్ ఓసీ-2 తనిఖీ అనంతరం, ప్రతిపాదిత ఓసీ-3 స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. గనుల విస్తరణ ప్రాంతాలను సందర్శించి, భవిష్యత్ ప్రాజెక్టుల పురోగతిపై స్థానిక అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం జీఎం కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సత్తుపల్లి ఏరియాలో బొగ్గు గనుల విస్తరణకు ఉన్న భౌగోళిక, సాంకేతిక, రవాణా అనుకూలతలను సమగ్రంగా అంచనా వేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని, రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నూతన ప్రాజెక్టుల ప్రారంభానికి అవసరమైన అనుమతులు, స్థల సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన బొగ్గును అందించడంలో సత్తుపల్లి ఏరియా కీలక పాత్ర పోషిస్తుందని డైరెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)