- గతేడాదితో పోలిస్తే సగానికి పడిపోయిన వర్షపాతం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21.9 శాతం లోటు
- 23 మండలాల్లో 15 మండలాల్లో లోటు వర్షపాతం..
- 8 మండలాల్లో సాధారణం
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఈ ఏడాది వానాకాలం నేటితో ముగిసింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం తగ్గగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ వానలు ఆశించిన స్థాయిలో కురవలేదు. జిల్లాలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సాధారణ వర్షపాతం 978 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది 763.8 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో 21.9 శాతం లోటు ఏర్పడింది. గతేడాది ఇదే కాలంలో జిల్లాలో 1,519.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం దాదాపు 49.7 శాతం తగ్గింది.
జిల్లాలోని 23 మండలాల్లో 15 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మిగిలిన 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అధిక లోటు దామపేట మండలంలో 48.3 శాతం, భద్రాచలంలో 40.6 శాతం, మణుగూరులో 36.4 శాతం, పినపాకలో 33.7 శాతం నమోదైంది. అశ్వారావుపేటలో సాధారణ వర్షపాతం కంటే 30.7 శాతం లోటు నమోదైంది.
జూలై, ఆగస్టుల్లో తీవ్ర లోటు:
వానాకాలం ప్రారంభమైన జూన్‌లో జిల్లాలో 161.7 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం కంటే 4.3 శాతం లోటు ఏర్పడింది. జూలైలో 213.3 మి.మీ. మాత్రమే కురవడంతో 31.8 శాతం లోటు నమోదైంది. ఆగస్టులో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. సాధారణ వర్షపాతం 295.4 మి.మీ. కాగా 160.9 మి.మీ. మాత్రమే నమోదై 45.5 శాతం లోటు ఏర్పడింది. సెప్టెంబర్‌లో మాత్రం 227.8 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం కంటే 13.3 శాతం అధికంగా కురిసింది. అయితే చివరి నెలలో కురిసిన వర్షాలు జూలై, ఆగస్టు లోటును పూర్తిగా పూడ్చలేకపోయాయి.
ఎల్నినో ప్రభావం:
2026 నైరుతి రుతుపవనాల సమయంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందుగానే అంచనా వేసింది. అనంతరం జూన్‌లో బలహీన ఎల్నినో ఏర్పడి క్రమంగా మధ్యస్థ స్థాయికి బలపడిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రసరణను బలహీనపరిచిన ప్రధాన వాతావరణ కారకాల్లో ఒకటిగా ఐఎండీ పేర్కొంది.
జిల్లాలో వర్షపాతం లోటు కారణంగా సాగునీటి వనరులు, భూగర్భజలాలు, వర్షాధార పంటలపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. మరోవైపు సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలు పంటలకు కొంత ఊరటనిచ్చినా.. మొత్తం వానాకాలం లోటును భర్తీ చేయలేకపోయాయి.
జిల్లా వర్షపాతం గణాంకాలు:
సాధారణ వర్షపాతం: 978.0 మి.మీ.
ఈ ఏడాది నమోదైన వర్షపాతం: 763.8 మి.మీ.
లోటు: 21.9 శాతం
గతేడాది నమోదైన వర్షపాతం: 1,519.9 మి.మీ.
గతేడాదితో పోలిస్తే తగ్గుదల: 49.7 శాతం
సాధారణ వర్షపాతం పొందిన మండలాలు: 8
లోటు వర్షపాతం మండలాలు: 15
ఈ ఏడాది వర్షపు రోజులు: 48
పంటల సాగు పరిస్థితి :
సీసన్ ప్రారంభం నుండి వున్న లోటు వర్షపాతం పంటల సాగుపై గణనీయమైన ప్రభావం చూపింది. వరి సాగులో తగ్గుదల స్పష్టం. వర్షధారంగా సాగు చేసే వరి ఈ సీసన్ లో రైతులు చేపట్టలేకపోయారు. సాగు నీటి వసతి వున్న రైతులు కొంత విస్తీర్ణంలో వరి సాగు చేసారు. పత్తి, మినుము, కంది, మొక్కజొన్న, మిరప సాగు చేసే రైతులు ఈ మధ్యన కురిసిన వర్షాలతో ఊరట చెందారు. పంటలకు కావాలసిన ఎరువులను అందించటం, సస్య రక్షణ, పైపాటు చేసే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
నేలల్లో పదును లేక పంట వేయని రైతులు ఇపుడు యాసంగి పంటకాలం మొదలయ్యింది కావున వివిధ పంటలు సాగు చేపట్టెందుకు సిద్ధమవుతున్నారు. ఎల్ నినో ప్రభావం కొనసాగే నేపథ్యంలో ప్రభుత్వం ద్వారా ఏ రకంగా మద్దతు లభిస్తుందో అని రైతులు ఆశగా ఎదురుచూస్తునారు. ప్రధానంగా, మినుము, వేరుశనగ మొక్కజొన్న సాగు మొదలయ్యింది. ఆరుతడి పంటలు కావున, రైతులు స్ప్రింక్లర్ మరియు డ్రిప్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతుల్లో సాగు నీటిని అందించి వినియోగ సామర్ధ్యం పెంచి ఆశించిన దిగుబడి సాధిస్తారని ఆశిద్దాం.




కామెంట్‌లు (0)