నవతెలంగాణ-జన్నారం
అటవీ భూములను అక్రమ ఆక్రమణల నుంచి పరిరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇంధన్‌పల్లి రేంజ్ మురిమడుగు గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో బుధవారం జేసీబీ సహాయంతో ట్రెంచ్ ఏర్పాటు చేశారు. అటవీ భూముల సరిహద్దులను స్పష్టంగా గుర్తించడంతో పాటు ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఆక్రమణలపై ప్రత్యేక నిఘా
అటవీ భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంధన్‌పల్లి రేంజ్ అధికారి ఖాదర్‌వలీ హెచ్చరించారు. ఇప్పటికే ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే చర్యలు చేపడుతుందని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా భూములను చదును చేయడం, సాగు చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
కలప అక్రమ రవాణాపై నిఘా
అటవీ సంపదను కాపాడేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని రేంజ్ అధికారి తెలిపారు. ముఖ్యంగా కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. అటవీ భూములు, వనరుల పరిరక్షణలో స్థానికులు అటవీ శాఖకు సహకరించాలని కోరారు. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినట్లయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ లు ఎఫ్బి వోలు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)