సీపీఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
నవతెలంగాణ-మర్రిగూడ
జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుండి 20 వరకు జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని ఇందుర్తి గ్రామంలో మహాసభల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చించి, భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందించేందుకు మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వల్ల రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
రైతులపై భారాన్ని మోపే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైతులు పండించిన ప్రతి పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున, రాబోయే రోజుల్లో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్షాభావం,నీటి కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, దిగుబడులు తగ్గడంతో రైతుల ఆదాయం పడిపోయిందని తెలిపారు.
పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి నష్టపరిహారం అందించడంతో పాటు రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లక్ష మందితో నిర్వహించే రైతు మహాసభలను రైతుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల కమిటీ సభ్యులు రామలింగచారి, మైల సత్తయ్య, భూతరాజు వెంకటయ్య, కొట్టం యాదయ్య, మల్రెడ్డి నరసింహారెడ్డి, చేపూరి సుధాకర్, సైదులు, సాయికుమార్, దొడ్డి పద్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)