నవతెలంగాణ - అచ్చంపేట
సాధారణంగా జనావాసాలు ఉన్నచోట ప్రభుత్వాలు రోడ్లను నిర్మించడం చూస్తుంటాం.. కానీ అందుకు పూర్తి భిన్నంగా అచ్చంపేట పట్టణంలో జనసంచారం లేని చోట అధికారులు సీసీరోడ్ల నిర్మాణం చేపట్టడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అచ్చంపేట పట్టణంలోని 20 వార్డుల్లో రోజురోజుకూ నివాస గృహాల సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటు మున్సిపాలిటీ కూడా భారీగానే విస్తరిస్తోంది. ఇంద్ర నగర్, మహేంద్ర నగర్, ఆదర్శనగర్, సాయిరాం నగర్ కాలనీలలో ప్రజలు గత 20-30 ఏళ్లుగా ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్నారు. ఇక్కడ నేటికీ సరైన సీసీరోడ్లు లేవు. అంతర్గత రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే కాలి నడక కూడ సాధ్యం కానీ పరిస్థితులు దాపురిస్తాయి.
ఈ విషయమై గత కొన్నేండ్లుగా కాలనీవాసులు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఉన్నప్పుడు అధికారులకు విన్నవించారు. ప్రస్తుతం పట్టణం మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. కానీ రూపురేఖలు మారలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు నూతన గృహాలతో కాలనీలు విస్తరిస్తున్నాయి తప్ప సీసీరోడ్ల నిర్మాణాలకు నోచుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందుకు చొరవ చూపడం లేదు.
ఇదిలా ఉంటే జనావాసం లేని చోట ఎన్టీఆర్ స్టేడియం పక్కన లక్షల ప్రజాధనం వెచ్చించి సీసీరోడ్లను నిర్మించడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. గత కొన్నేండ్లుగా కాలనీలో సీసీరోడ్లు, అంతర్గత దారులు సరిగా లేవనీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకుండా జనసంచారం లేని దగ్గర సీసీరోడ్లు నిర్మించి ఏం ప్రయోజనమని, ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజూవారీ కూలీలు, పేద కుటుంబాలు కాలనీల్లో ఎక్కువ భాగం నివాసముంటున్నారనీ, అందుకే పాలకులు, అధికారులు నిర్లక్ష‍్యం వహిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు.





కామెంట్‌లు (0)