ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యయంలో ఇది 54 శాతం!
ఈసీకి సమర్పించిన లెక్కల్లో వెల్లడి.. ఖజానాలో రూ.7,627 కోట్లు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ భారీగా ఎన్నికల వ్యయం చేసినట్టు ఈసీకి సమర్పించిన లెక్కలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనే ఆ పార్టీ రూ.287 కోట్లు ఖర్చు చేసింది. ఐదు రాష్ట్రాల్లో పార్టీ చేసిన మొత్తం రూ.529 కోట్ల వ్యయంలో ఇది 54 శాతానికి పైగా కావడం గమనార్హం.
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ప్రచారం, అభ్యర్థుల కోసం మొత్తం రూ.529 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సమర్పించిన వ్యయ నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇందులో ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే రూ.287 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. బెంగాల్‌లో 293 స్థానాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ 207 స్థానాల్లో విజయం సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ మొత్తం 293 స్థానాల్లో పోటీ చేసి రూ.42 కోట్లు ఖర్చు చేసినప్పటికీ రెండు స్థానాలకే పరిమితమైంది. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తన ఎన్నికల వ్యయ నివేదికను ఇంకా ఈసీకి సమర్పించలేదు.
ఇక కేరళలో కాంగ్రెస్ రూ.105 కోట్లు ఖర్చు చేసి 63 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ రూ.83 కోట్లు ఖర్చు చేసినప్పటికీ మూడు స్థానాలకే పరిమితమైంది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మొత్తం రూ.249 కోట్లు ఖర్చు చేసినట్టు నివేదించింది. బీజేపీ అసోంలో రూ.96 కోట్లు, తమిళనాడులో రూ.52 కోట్లు, పుదుచ్చేరిలో రూ.12 కోట్లు ఖర్చు చేసింది. ఇదే సమయంలో బీజేపీ కేంద్ర కార్యాలయానికి ఎన్నికల కాలంలో రూ.1,473 కోట్లు వచ్చినట్టు పార్టీ ఆదాయ, వ్యయ నివేదిక పేర్కొంది. ఎన్నికల ప్రకటన సమయానికి రూ.6,722.60 కోట్లుగా ఉన్న కేంద్ర పార్టీ నిల్వలు ఎన్నికలు ముగిసే సమయానికి రూ.7,627 కోట్లకు చేరాయి. ఇటు కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం, ఐదు రాష్ట్ర యూనిట్ల కలిపిన నిల్వ రూ.169 కోట్ల నుంచి రూ.103 కోట్లకు తగ్గింది. ఎన్నికల ఫలితాలకే కాకుండా ఎన్నికల ప్రచారంలో అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల విస్తృతి కూడా రాజకీయ పోటీ స్వభావాన్ని ప్రభావితం చేసే అంశంగా ఈ గణాంకాలు చూపిస్తున్నాయి.
బెంగాల్ బరిలో బీజేపీ ఖర్చు రూ.287కోట్లు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)