78 శాతానికి తగ్గిన నీటి నిల్వలు
దేశంలో పదేండ్లలోనే ఇది అత్యల్పం
దక్షిణాది రాష్ట్రాల్లో మరింత దారుణ పరిస్థితి
గతేడాది 87.25 శాతం.. ఈసారి 50 శాతానికే పరిమితం
దేశవ్యాప్తంగా సాధారణం కంటే 12 శాతం తక్కువ వర్షపాతం
వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో పెరుగుతున్న నీటి ముప్పు
నైరుతి రుతుపవనాల సీజన్ ముగింపు దశకు చేరుకున్నా దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయికి చేరుకోలేదు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కల ప్రకారం 178 కీలక జలాశయాల్లో మొత్తం నిల్వ సామర్థ్యంలో కేవలం 70 శాతం నీరే ఉంది. ఇది గత పదేండ్ల సగటు 76.62 శాతం కంటే గణనీయంగా తక్కువ. గతేడాది ఇదే సమయంలో 79 శాతం నిల్వ ఉండగా.. ఈసారి పరిస్థితి మరింత దిగజారింది.
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్‌తో ముగియనున్న నేపథ్యంలో దేశంలో నీటి నిల్వల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. 178 ప్రధాన జలాశయాల్లో సెప్టెంబర్ 24 నాటికి 70 శాతం మాత్రమే నీరు ఉంది. పదేండ్ల సగటుతో పోలిస్తే ఇది తక్కువ స్థాయి. తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాల్లో నిల్వలు తగ్గిపోవడం రానున్న నెలల్లో నీటి నిర్వహణపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఇక దక్షిణాదిలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. తెలంగాణ, ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడులోని జలాశయాల్లో కలిపి మొత్తం సామర్థ్యంలో కేవలం 50 శాతం నీరే ఉంది. గతేడాది ఇదే సమయంలో ఈ నిల్వ 87.25 శాతంగా ఉండటం గమనార్హం. ఈ ప్రాంతానికి ఈ ఏడాది సాధారణం కంటే 23 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాల్లో ఇలా.. ఇక తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని 31 జలాశయాల్లో 73 శాతం
నీటి నిల్వ ఉంది. అసోం, బీహార్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో సీజనల్ వర్షపాతం లోటు 25 శాతంగా ఉంది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు మినహా పరిస్థితి బలహీనంగానే ఉంది. ఉత్తర భారతంలోనూ నీటి నిల్వలు భారీగా తగ్గాయి. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్‌లోని 11 జలాశయాల్లో గతేడాది 92.3 శాతం ఉన్న నిల్వ ఈసారి 62 శాతానికి పడిపోయింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవాలోని 58 జలాశయాల్లో 84.61 శాతం నీరు ఉండగా.. గతేడాది ఇది 95.79 శాతంగా ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, యూపీ, ఉత్తరాఖండ్‌లోని 28 జలాశయాల్లో 85.55 శాతం నిల్వ ఉంది. గతేడాది ఇది 91.89 శాతంతో పోలిస్తే తగ్గిపోవడం గమనార్హం.
సాధారణం కంటే 12 శాతం తక్కువ వర్షపాతం
ఈ ఏడాది వర్షపాతం లోటు కూడా నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. సెప్టెంబర్ 28 నాటికి దేశవ్యాప్తంగా సాధారణం కంటే 12 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌లో 35.4 శాతం, ఆగస్టులో 16.3 శాతం లోటు నమోదయ్యాయి. జులైలో మాత్రం సాధారణం కంటే దాదాపు ఒక శాతం అధిక వర్షం పడింది. సెప్టెంబర్ 1 నుంచి 28 వరకు కూడా ఐదు శాతం లోటు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
తాగు, సాగు నీటికి కటకటేనా?
దేశ వార్షిక వర్షపాతంలో 70 శాతానికి పైగా అందించే నైరుతి రుతుపవనాలపై భారత్ నీటి అవసరాల కోసం అధికంగా ఆధారపడుతోంది. వర్షాలు తగ్గినప్పుడు తాగునీరు, వ్యవసాయం, జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడకుండా ముందస్తు ప్రణాళిక అవసరం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నిల్వలు భారీగా తగ్గిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం, జలాశ యాల నిర్వహణ, కరవు ప్రాంతాలకు నీటి ప్రణాళిక వంటి అంశాలు కీలకంగా మారాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతంపై ప్రభావం పడి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఆగస్టు చివరి నుంచి వర్షాభావం, దీర్ఘకాలిక పొడి వాతావరణానికి ఎల్‌నినో బలపడటం కూడా ఒక కారణంగా వివరిస్తున్నారు. రుతుపవనాలు ముగిసే దశలో ఉన్నందున ఈ సీజన్‌లో జలాశ యాల నిల్వల్లో పెద్దగా మెరుగుదల వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. దీంతో రానున్న వేసవి వరకు తాగునీరు, సాగునీటి అవసరాలను ఎలా నిర్వహించాలన్నది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారనుంది.






కామెంట్‌లు (0)