కార్మికులకు 36 శాతం లాభాల వాటా చెల్లించాలి
2,500పైచిలుకు మందికి వారసత్వ ఉద్యోగాలివ్వాలి
250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీ లేని
రుణం ఇవ్వాలి : సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణి సంస్థలో వాటాల ఉపసంహరణ, ప్రయివేటీకరణ ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం ఆయన లేఖ రాశారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుండటం, కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని కాలరాస్తుండటం తీవ్ర ఆక్షేపణీయమని విమర్శించారు. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సింగరేణి సంస్థలో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే సమాచారం వచ్చిందని తెలిపారు. సింగరేణి సంస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో వాటాలను విక్రయించాలనే ఆలోచన ఎందుకని ప్రశ్నించారు. సింగరేణి సంస్థ వాటాలను విక్రయించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలనీ, ఆ సంస్థను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన దసరా బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి నికర లాభం రూ.4,701 కోట్లని వివరించారు. అందులో 33 శాతం అంటే రూ.1,551 కోట్లు కానీ కార్మికులకు చెల్లించింది కేవలం రూ.796 కోట్లు మాత్రమేనని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చినా బోనస్ రూపంలో కార్మికులకు చెల్లించింది కేవలం రూ.819 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు.
2023 నుంచి 2025 వరకు సింగరేణి లాభాల బోనస్‌కు సంబంధించిన కార్మికుల బకాయిలు మొత్తం రూ.2,342 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ బకాయిలను వెంటనే కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు ట్రాన్స్‌కో, జెన్‌కో నుంచి రావాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీంతో జీతాల చెల్లింపుల కోసం కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి వస్తే సింగరేణి భవిష్యత్తు ఏంటనే ప్రశ్న తలెత్తుతోందని పేర్కొన్నారు. సింగరేణికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిస్మిస్ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. సింగరేణిలో కారుణ్య నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన సొంతింటి పథకం హామీని అమలు చేయాలని కోరారు. కార్మికుల హక్కులను కాపాడాలనీ, వారికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం, సింగరేణి భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
డిమాండ్లు
వాస్తవ లాభాలపై సింగరేణి కార్మికులకు 36 శాతానికి పైగా లాభాల వాటా చెల్లించాలి .
మెడికల్ బోర్డు కోసం వేచిషుస్తున్న 2,500 పైచిలుకు కార్మికులకు మూడు నెలల మెడికల్ బోర్డుల చొప్పున పెట్టి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి.
ఎన్నికల వాగ్ధానాల ప్రకారం పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్‌ను కార్మికులకు తిరిగి చెల్లించాలి .
సొంతింటి పథకం అమలు చేస్తూ కార్మికులకు 250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం ఇవ్వాలి .
మారు పేర్ల సమస్య పరిష్కరిస్తూ డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి .
సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ రూ.60 వేల కోట్లు వెంటనే చెల్లించాలి .





కామెంట్‌లు (0)