Magazines

ఉద్యోగులు క్రీడ‌లు, క‌ళ‌ల‌పై ఆస‌క్తి పెంచుకోవాలి

46 నిమిషాల క్రితం

Employees should cultivate an interest in sports and the arts.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఉద్యోగులు విధులను సమర్థంగా నిర్వర్తించడంతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డా. బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సచివాలయ సాంస్కృతిక ఉత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పెషల్‌ సీఎస్‌ మహేష్‌ దత్‌ హెక్కా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు నిత్యం ఎంతో బిజీగా, పని ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తుంటారని తెలిపారు. ఉద్యోగి పని సామర్థ్యంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు. క్రీడ‌లు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం మనసుకు శారీర‌క‌, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని మంత్రి అన్నారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఉద్యోగులు కేవలం ఫైళ్లు, విధులు, బాధ్యతలకే పరిమితం కాకుండా తమలోని సృజనాత్మకతను కూడా వెలికితీయాలని సూచించారు. గెలుపు, ఓటమి కంటే కార్యక్రమాల్లో పాల్గొనడం, తమ ప్రతిభను ప్రదర్శించడం, సహోద్యోగులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యమని చెప్పారు. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు త‌ర‌చుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని జూపల్లి సూచించారు. ఉద్యోగులు బాగా పనిచేస్తే దాని ప్రభావం ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందే సేవలపై ఉంటుందని అన్నారు. విధులతో పాటు ఆటలు, క్రీడలు, పాటలపై ఆసక్తి పెంచుకోవడం వల్ల ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులు చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలకు సాంస్కృతిక శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రాధాకృష్ణ, తెలంగాణ సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గిరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జే. ప్రేమ్, ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్, సాంస్కృతిక కార్యదర్శి యామిని కనకతార తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్