ఆధార్ ముఖ గుర్తింపు విధానం విజయవంతం
కోల్‌కతాలో ఆధార్ సంవాద్ పురస్కారం
అందుకున్న బోర్డు చైర్మెన్ వి.వి.శ్రీనివాసరావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. పోలీసు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు (ఫేస్ అథెంటికేషన్) ద్వారా సమర్థంగా తనిఖీలు చేపట్టినందుకు గానూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ‘ఆధార్ సంవాద్-2026’ జాతీయ అవార్డుతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీని సత్కరించింది. కోల్‌కతాలో మంగళవారం నాడు నిర్వహించిన ఆధార్ జాతీయ భాగస్వాముల ఐదో సదస్సులో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత, వాణిజ్య-పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ చేతుల మీదుగా టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మెన్ వి.వి.శ్రీనివాసరావు పురస్కారాన్ని స్వీకరించారు.
అక్రమాలకు తావులేకుండా నూతన సాంకేతికత పోలీసు ఉద్యోగ నియామకాల్లో ఇతరుల పేర్లతో హాజరయ్యే నకిలీ వ్యక్తులను (ఇంపర్సనేషన్) పూర్తిగా అరికట్టేందుకు, అత్యున్నత భద్రతా ప్రమాణాలను నెలకొల్పేందుకు నియామక మండలి నడుం బిగించింది. యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ మార్గదర్శకత్వంలో తొలిసారిగా దరఖాస్తుదారుల కోసం అంతర్జాల రహిత (ఆఫ్‌లైన్) ఆధార్ ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈ అత్యాధునిక విధానాన్ని విజయవంతంగా అమలు చేసిన తొలి నియామక సంస్థగా తెలంగాణ పోలీసు బోర్డు రికార్డు సృష్టించింది. గత ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 16 వరకు తొలి విడత దరఖాస్తులు స్వీకరించిన సమయంలో.. అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఆధార్ యాప్ ను ఉపయోగించి ముఖ గుర్తింపును పూర్తి చేశారు. మొత్తం దరఖాస్తుదారుల్లో ఏకంగా 98.7 శాతం మంది (4,23,348 మంది) ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. మిగిలిన 1.3 శాతం మందికి (5,652 మంది) యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయ సమన్వయంతో అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఆధార్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుక ున్న తీరును యూఐడీఏఐ ప్రశంసించింది. 17వ ఆధార్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఈ ఘనతను కొనియాడుతూ పురస్కారాన్ని అందజేసింది.
ఈ బృహత్తర ప్రక్రియలో శ్రమించిన బోర్డు పాలనాధికారి ఎడ్ల రామకృష్ణ స్వామి, పర్యవేక్షకులు పిండిగ సునీల్ కుమార్, సాంకేతిక సహాయకులు మల్లెకేడి శ్రీనాథ్‌తో పాటు సాంకేతిక భాగస్వాములు బి. సుధాకర్, జి. శ్రీధర్ రావు, వి.వి. సాయి సుబ్రహ్మణ్యం, సిహెచ్. సురేష్, ఎన్. సాయి కిరణ్ రెడ్డి సేవలను బోర్డు కొనియాడింది. విశేష సహకారం అందించిన యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ ఉప సంచాలకులు పి. సంగీత, సంచాలకులు కె.ఎం. భారతి, ఉప సంచాలకులు నైని రంగనాథ్ రెడ్డి, సాఫ్ట్‌వేర్ నిపుణులు డి. వసంత్ కళ్యాణ్‌లకు శ్రీనివాసరావు హృదపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు జాతీయ పురస్కారం
39 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)