సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
భారత్‌కు రప్పించండి: రాయబార కార్యాలయానికి గద్వాల విజయలక్ష్మి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధి కోసం రష్యా వెళ్లి, ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడి, ప్రస్తుతం యుద్ధభూమిలో చిక్కుకున్నట్టు చెబుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు తెలంగాణ వాసులను సురక్షితంగా భారత్‌కు రప్పించాలని వారి కుటుంబ సభ్యులు సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మికి వారి కుటుంబ సభ్యులు వినతిపత్రం అందజేశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం భుక్యా రవీందర్, సిర్షు అశోక్, మెగావత్ ప్రకాశ్, మహమ్మద్ అఫ్జల్ ఖాన్ ఉపాధి కోసం సుమారు ఏడు నెలల క్రితం రష్యా వెళ్లారని తెలిపారు. ఆయిల్ కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పడంతో రూ.లక్షలు వెచ్చించి అక్కడికి వెళ్లినట్టు వివరించారు. ఆయిల్ కంపెనీలో వేతనాలు నిలిచిపోవడంతో, ఇతర సాధారణ పనులు మాత్రమే ఉంటాయని చెప్పి కొందరు ఏజెంట్లు వారిని రష్యా సైన్యంలో చేరేలా చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం వారిని యుద్ధ ప్రాంతంలో విధులకు పంపినట్టు ప్రస్తుతం వారి ప్రాణ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు. కుటుంబ సభ్యుల విన్నపాన్ని విన్న గద్వాల విజయలక్ష్మి వారికి భరోసా కల్పించారు. నలుగురు తెలంగాణ వాసులకు అవసరమైన దౌత్య సహాయం అందించి, సురక్షితంగా విడుదల చేయించి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని జీఏడీ ఎన్‌ఆర్‌ఐ అధికారులకు సూచించారు. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. నలుగురి వివరాలతో భారత రాయబార కార్యాలయానికి కూడా లేఖ పంపించి, వారి భద్రత, స్వదేశానికి రప్పించే ప్రక్రియలో సహకరించాలని కోరారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ప్రభుత్వం తరఫున సాధ్యమైన సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి కె విద్యాసాగర్, ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీ వైస్ చైర్మెన్ మంద భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న నలుగురు తెలంగాణవాసులు
45 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)