యూడీఎఫ్ నుంచి ఏడు సీట్లు కైవసం
నాలుగు నెలల్లోనే
మారిన రాజకీయ ముఖచిత్రం
ఒక్క సీటు దక్కని బీజేపీ
తిరువనంతపురం : కేరళంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎ ల్డీఎఫ్) ఘన విజయాన్ని నమోదు చేసింది. యూడీఎఫ్ నుంచి ఏడు సీట్లను రాబట్టుకుంది. వీటిలో జిల్లా పంచాయితీ డివిజన్, రెండు బ్లాక్ డివిజన్‌లు, ఒక మున్సిపల్ వార్డు వున్నాయి. వీటిల్లో ఇద్దరు యూడీఎఫ్ ఎంఎల్‌ఎల సిట్టింగ్ సీట్లు కూడా వున్నాయి. 15 నుంచి 18కి ఎల్డీఎఫ్ తన సీట్ల జాబితాను పెంచుకోగా, యూడీఎఫ్ సీట్లు 22 నుంచి 19కి పడిపోయాయి. కాగా ట్వంటీ 20 పార్టీ మాత్రం వున్న ఒక్క సీటును నిలబెట్టుకోగలిగింది. బీజేపీ ఎక్కడా ఒక్క సీటును సంపాదించుకోలేకపోయింది. కేవలం రాజకీయ పోరాటాలుగా భావించబడే జిల్లా, బ్లాక్ పంచాయితీల్లో ఎల్డీఎఫ్ సాధించిన పై చేయి చూస్తుంటే రాజకీయ ముఖ చిత్రం మారుతున్నట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించిన నాలుగు మాసాల వ్యవధిలోనే యూడీఎఫ్‌కి ఈ ఎదురు దెబ్బ తగిలింది. మూడు జిల్లా పంచాయితీ డివిజన్‌లకు గానూ రెండింటిలో ఎల్‌డీఎఫ్ విజయం సాధించింది. ఏడు బ్లాక్ పంచాయితీ డివిజన్‌లకు గానూ ఐదింటిని గెలుచుకుంది. అలాగే మూడు మున్సిపల్ వార్డుల్లో రెండు మున్సిపల్ వార్డులను కైవసం చేసుకుంది. మరోవైపు యూడీఎఫ్ రెండు కార్పొరేషన్ వార్డులను నిలబెట్టుకున్నప్పటికీ గెలుపు మార్జిన్లు బాగా క్షీణించాయి. మొత్తంగా పంచాయితీ వార్డుల జాబితాలో ఎల్డీ ఎఫ్ 9 వార్డులను గెలుచుకోగా, యూడీఎఫ్ 13వార్డులను గెలుచుకుంది.
కొట్టాయం జిల్లా పంచాయితీలోని ట్రికోడినాథం డివిజన్‌ను యూడీఎఫ్ నుంచి ఎల్డీ ఎఫ్ కైవసం చేసుకోగా, పాలక్కాడ్ జిల్లా పంచాయితీలోని పల్లసేన డివిజన్‌ను నిలబెట్టుకోగలిగింది. యూడీఎఫ్ ఎంఎల్‌ఎ వినూ జాబ్ సిట్టింగ్ సీట్ అయిన ట్రికోడినాధంలో ఎల్డీ ఎఫ్‌కు చెందిన మంజు సుజిత్ ప్రధాన విజయం సాధించారు. తిరువనంతపురం జిల్లా పంచాయితీలోని కల్లారా డివిజన్‌లో యూడీఎఫ్ మార్జిన్‌ను దాదాపుగా సగానికి సగం ఎల్‌డిఎఫ్ తగ్గించగలిగింది. అదీకాకుండా, చిరాయింకీజు బ్లాక్ (తిరువనంతపురం)లో అంజుతెంగు డివిజన్‌ను, అలాగే అలతూర్ బ్లాక్ (పాలక్కాడ్)లో అతిపొట్ట డివిజన్‌ను యూడీఎఫ్ నుంచి ఎల్డీ ఎఫ్ స్వాధీనం చేసుకుంది. మూడు మున్సిపల్ వార్డుల్లో రెండింటిని ఎల్డీ ఎఫ్ గెలుచుకుంది. పాలక్కాడ్ జిల్లాలోని చిత్తూర్-తాతమంగలం మున్సిపాలిటీలో పరుతిక్కవు వార్డును యూడీఎఫ్ నుంచి కైవసం చేసుకోగా, కన్నూర్ జిల్లాలోని మట్టనూర్ మున్సిపాలిటీలో ఉరువచల్ వార్డును ఎల్డీ ఎఫ్ నిలబెట్టుకుంది. పరుతిక్కవు వార్డును గతంలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సుమేష్ అచుతన్ గెలుచుకున్నారు. ఈసారి ఎల్డీ ఎఫ్ అభ్యర్ధి వి.తులసీధరన్ లాటరీ పద్ధతి ద్వారా ఈ సీటును గెలుచుకున్నారు. ఇదిలావుండగా, త్రిస్సూర్ జిల్లాలోని చాలకుడి మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీసు వార్డును యూడీఎఫ్ నిలబెట్టుకుంది. యూడీఎఫ్ రెండు కార్పొరేషన్ వార్డులను నిలబెట్టుకున్నప్పటికీ, దాని మార్జిన్లు సగాని కన్నా ఎక్కువగానే క్షీణించాయి. త్రిపునిధుర ఎంఎల్‌ఏ దీపక్ జాయ్ ఖాళీ చేసిన స్థానమైన కోచి కార్పొరేషన్‌లోని అయ్యప్పన్‌కవు వార్డు లో గెలుపు మార్జిన్ 1183 ఓట్ల నుంచి 543 ఓట్లకు పడిపోయింది. కొజికోడ్ కార్పొరేషన్‌లోని కుత్తిచిర వార్డులో గతంలో ముస్లిం లీగ్ ఎంఎల్‌ఎ ఫాతిమా తహ్లియా 2273 ఓట్లతో గెలుపొందగా, ఇప్పుడు యూడీఎఫ్ మార్జిన్ కేవలం 436కి పడిపోయింది. సీట్ల వివరాలు (బ్రాకెట్లలో వున్నవి గతంలో వున్న సీట్లు) ఎల్డీ ఎఫ్ : 18 (15) యూడీఎఫ్ : 19 (22) ట్వంటీ 20 : 1 (1)






కామెంట్‌లు (0)