Magazines

ఉన్నత విద్యలో ప్రాంతీయ అంతరాలు

1 గంట క్రితం

education
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 3 నిమిషాల చదవడం

యువ జనాభా ఎక్కువున్న 
రాష్ట్రాల్లోనే కాలేజీల కొరత

25 ఏండ్లలో 34,840 కాలేజీలు, 
980 విశ్వవిద్యాలయాలు..
అయినా అసమానతలు తొలగని వైనం
బీహార్‌, యూపీ, జార్ఖండ్‌లో ఈ సమస్య అధికం

యువతకు సరిపోని ఉన్నత విద్యా సదుపాయాలు
తాజా అధ్యయనం వెల్లడి


దేశంలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగినా.. యువ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అనుగుణంగా వాటి విస్తరణ జరగడం లేదు. తాజా అధ్యయనం ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా బీజేపీ పాలిత బీహార్‌, యూపీతో పాటు జార్ఖండ్‌ రాష్ట్రాల్లో యువత సంఖ్యకు సరిపడా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు లేవు. దీంతో ఉన్నత విద్యను పొందడంలో దేశంలో ప్రాంతీయ అంతరాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.


న్యూఢిల్లీ : భారత్‌లో ఉన్నత విద్యా రంగం ఎదుగుదల మేడిపండు చందంగా ఉంది. గత 25 ఏండ్లలో ఈ రంగం భారీగా విస్తరించింది. 2001 నుంచి దేశంలో 34,840 కాలేజీలు, 980 విశ్వవిద్యాలయాలు కొత్తగా ఏర్పడ్డాయి. లక్ష మంది యువత (18–23 ఏండ్ల వయస్సు వారికి)కు ఉన్న కాలేజీల సంఖ్య కూడా 9 నుంచి 37కి పెరిగింది. అయితే ఈ విస్తరణ దేశవ్యాప్తంగా సమానంగా జరగలేదని ‘ది జియోగ్రఫీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో విడుదలైన తాజా అధ్యయనం పేర్కొంది. యువ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఉన్నత విద్యా సదుపాయాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బీహార్‌, యూపీ, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో యువ జనాభా ఎక్కువగా ఉండటంతోపాటు విశ్వవిద్యాలయాలు, కాలేజీల సంఖ్య తక్కువగా ఉంది. దీనికి తోడు ఉన్నత విద్యలో చేరిక శాతం కూడా జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.


బీహార్‌లో పరిస్థితి తీవ్రం
బీహార్‌లోని బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పాలనలో కఠిన పరిస్థితులు ఉన్నాయి. 2023–24లో ఉన్నత విద్య స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) బీహార్‌లో కేవలం 17.66 శాతంగా ఉంది. జార్ఖండ్‌లో 19.43 శాతం, యూపీలో 25.97 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా జీఈఆర్‌ సుమారు 30 శాతంగా ఉంది. అంటే ఈ రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో చేరుతున్న యువత వాటా జాతీయ సగటుతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ 2022–23 ప్రకారం యూపీలో 8,310 కాలేజీలు, 91 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. బీహార్‌లో 1,175 కాలేజీలు, 37 విశ్వవిద్యాలయాలు ఉండగా.. జార్ఖండ్‌లో 425 కాలేజీలు, 34 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.


దేశ సగటు కంటే తక్కువ
అయితే కేవలం సంస్థల సంఖ్యను చూసి రాష్ట్రంలో ఉన్నత విద్యా సదుపాయాలు సరిపోతున్నాయని చెప్పలేమని అధ్యయనం స్పష్టం చేసింది. ఉదాహరణకు బీహార్‌తో పోలిస్తే యూపీలో కాలేజీలు ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అక్కడి జనాభా, యువత సంఖ్య కూడా అంతకంటే చాలా ఎక్కువగా ఉంది. నిటి ఆయోగ్‌ 2025 నివేదిక ప్రకారం 18–23 ఏండ్ల ప్రతి లక్ష మంది యువతకు యూపీలో సగటున 0.3 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయంలో దేశ సగటు 0.8గా ఉంది. దీంతో రాష్ట్రాల జనాభా, యువత సంఖ్యకు అనుగుణంగా విద్యా సంస్థల విస్తరణ ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది.


జిల్లాల్లోనూ తీవ్ర అసమానత
ఉన్నత విద్యా సంస్థల సంఖ్యలో అసమానతలు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశంలోని 20 జిల్లాల్లోనే మొత్తం విశ్వవిద్యాలయాల్లో 28 శాతం ఉన్నాయని నివేదిక పేర్కొంది. కాలేజీలు కూడా కొన్ని ప్రధాన విద్యా కేంద్రాల చుట్టూ భారీగా కేంద్రీకృతమయ్యాయి. బెంగళూరు అర్బన్‌లో 1,225 కాలేజీలు, జైపూర్‌లో 809 కాలేజీలు ఉన్నాయి. మరోవైపు సికార్‌లో రెండు విశ్వవిద్యాలయాలు, 374 కాలేజీలు, ఆజమ్‌గఢ్‌లో ఒక విశ్వవిద్యాలయం, 338 కాలేజీలు, బెలగావిలో మూడు విశ్వవిద్యాలయాలు, 317 కాలేజీలు ఉన్నాయి. దేశంలోని 173 జిల్లాల్లో 100కు పైగా కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇక తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ ఉన్నత విద్యా సంస్థల సంఖ్య తక్కువగా ఉందని అధ్యయనం వివరించింది. పశ్చిమ, దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లోనే ఎక్కువ సంస్థలు కేంద్రీకృతమయ్యాయని పేర్కొంది.


ఎక్కడ యువత ఉంటే.. అక్కడే సంస్థలు
భవిష్యత్తులో యువ జనాభా పెరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడే కొత్త కాలేజీలు, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది. కేవలం ఒక్కో విద్యా సంస్థను ఏర్పాటు చేయడం కాకుండా.. విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, రవాణా సదుపాయాలు, స్థానిక మౌలిక వసతులతో కూడిన పూర్తి స్థాయి విద్యా కేంద్రాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. ఇక ముందు సవాలు సంస్థల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని.. రాబోయే తరాల విద్యార్థులు ఎక్కడ ఉంటారో ముందుగానే గుర్తించి, వారికి అందుబాటులో ఉండే ప్రాంతాల్లో విద్యా సదుపాయాలను కల్పించడమే కీలకమని స్పష్టం చేసింది. అభివృద్ధి అంటే సంస్థల సంఖ్య పెరగడం మాత్రమే కాదు.. అవసరమైన చోట విద్య అందుబాటులోకి రావడం కూడా అని విద్యావేత్తలు, మేధావులు చెప్తున్నారు. యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనే ఉన్నత విద్యా సదుపాయాల కొరత కొనసాగితే.. ప్రాంతీయ విద్యా అసమానతలు మరింత విస్తరించే ప్రమాదం ఉందన్నది ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోందని అంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్