Magazines

ఏఐ రేసు

58 నిమిషాల క్రితం

AI ​​Race
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 3 నిమిషాల చదవడం

ఆధిపత్యం కోసం అమెరికా దూకుడు
భద్రతకే చైనా అధిక ప్రాధాన్యం
మానవ నియంత్రణలో 
ఉండేలా ప్రయత్నాలు
ట్రంప్‌ చర్యలపై వెల్లువెత్తుతున్న ఆందోళన


కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని మార్చే దశలోకి చేరింది. కానీ దాని అభివృద్ధి వేగం కంటే దానిపై మానవ నియంత్రణే ముఖ్యమన్న ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తోంది. అమెరికా–చైనా మధ్య ఏఐ ఆధిపత్య పోటీ ఉధృతమవుతున్న వేళ.. చైనా ఏఐను మానవ నియంత్రణలో ఉంచడం, భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం గురించి బహిరంగంగా మాట్లాడుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏఐలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే అమెరికా అనుసరిస్తున్న విధానం యావత్‌ ప్రపంచానికి ఏ మాత్రమూ శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


న్యూఢిల్లీ : ప్రపంచంలో నేడు ఏఐ పోటీని కేవలం సాంకేతిక పోటీగా చూడలేం. ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థ, సైబర్‌ రంగం, భవిష్యత్తు యుద్ధాలపై ప్రభావం చూపగల పోటీగా ఇది మారింది. అమెరికా, చైనా రెండూ ఏఐలో ముందంజ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఈ పోటీలో ఒక కీలక ప్రశ్న ముందుకొస్తోంది. ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందాలన్నదా? లేక అది ఎంత సురక్షితంగా ఉండాలన్నదా? అన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవలి అమెరికా–చైనా చర్చల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఏఐ అభివృద్ధి మానవ నియంత్రణలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఏఐను మానవ సంక్షేమానికి ఉపయోగించాల్సిన బాధ్యత రెండు దేశాలకూ ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో మాత్రం ట్రంప్‌ ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేసే కఠిన నియంత్రణలపై ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి.


నియంత్రణకు చైనా ప్రయత్నం
చైనా ఏఐ అభివృద్ధిని ఆపాలని చెప్పడం లేదు. అదే సమయంలో ప్రమాదాలను గుర్తించి వాటిని నియంత్రించే విధానాలను రూపొందిస్తోంది. చైనా సైబర్‌ నియంత్రణ సంస్థ.. ఏఐ ఏజెంట్లు అనుమతి లేని వనరులను పొందడం, తమ సామర్థ్యాలను దాచడం, పరీక్షలను మోసం చేయడం, భద్రతా పరిమితులను దాటడం వంటి ప్రమాదాలను గుర్తించింది. ఈ ఏడాది చైనా విడుదల చేసిన భద్రతా మార్గదర్శకాల్లో ఏఐ ఏజెంట్ల ప్రవర్తనను గుర్తించడం, అవసరమైతే వాటిని ఆపడం, తిరిగి నియంత్రణలోకి తీసుకురావడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇచ్చింది. వినియోగదారులకు ఏఐ స్వయంగా తీసుకునే నిర్ణయాల గురించి తెలియజేయాలనీ, తుది నిర్ణయాధికారం మనుషుల వద్దే ఉండాలని కూడా సూచించింది. ఇది చైనా విధానంలో ఒక ముఖ్యమైన అంశాన్ని చూపిస్తోంది. ఏఐలో పోటీ ఉండొచ్చు.. కానీ నియంత్రణ కోల్పోయే స్థాయికి సాంకేతికతను తీసుకెళ్లకూడదన్న ఒక మంచి ఆలోచన కూడా విధాన చర్చల్లో ఉంది.


అమెరికా విధానంపై ప్రశ్నలు
అమెరికా మాత్రం ఏఐ ఆధిపత్యాన్ని ఒక పోటీగా చూస్తోంది. ఈ పోటీలో చైనా ముందుకు వెళ్లకుండా అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం బలంగా కనిపిస్తోంది. ట్రంప్‌ ఏఐ దూకుడును కట్టడి చేసే చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా ఈ విధానంలో భాగంగా కనిపిస్తోంది. అయితే అమెరికాలోనే పలువురు చట్టసభ సభ్యులు, సాంకేతిక నిపుణులు ట్రంప్‌ ప్రభుత్వాన్ని ఏఐ భద్రతపై మరింత కఠినమైన నియంత్రణలకు ముందుకు రావాలని కోరుతున్నారు. సెప్టెంబర్‌ 24న అమెరికా సెనేట్‌లోని కొంతమంది సభ్యులు అమెరికా–చైనా మధ్య ఏఐ భద్రతా ప్రమాణాలపై అధికారిక ఒప్పందం కుదుర్చుకోవాలని కూడా కోరారు.


ఆధిపత్యం కంటే భద్రతే ముఖ్యం
ఏఐ ఎంత ఉపయోగకరమో అంతగా ప్రమాదకరం. కాబట్టి ఇది మానవ నియంత్రణను దాటి వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రపంచ దేశాల మధ్య అణ్వస్త్రాల పోటీ అనుభవం ఒక విషయాన్ని నేర్పింది. సాంకేతిక ఆధిపత్యం కోసం దేశాలు పోటీపడినప్పుడు ప్రమాదాలు కూడా పెరుగుతాయి. ఏఐ విషయంలో ప్రమాదం మరింత సంక్లిష్టం. ఎందుకంటే అణుబాంబుల లాగా ఏఐ సామర్థ్యాన్ని లెక్కించడం, నిల్వలను పర్యవేక్షించడం అంత సులభం కాదు. అందుకే అమెరికా–చైనా పోటీని కేవలం ‘ఎవరు ముందున్నారు?’ అనే ప్రశ్నతో చూడటం సరిపోదనీ, ‘ఎవరు సురక్షితమైన ఏఐ వ్యవస్థను నిర్మిస్తున్నారు?’, ‘మానవ నియంత్రణ ఎంతవరకు ఉంటుంది?’, ‘ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారు?’ అనే ప్రశ్నలకూ సమాధానాలు అవసరమని అంతర్జాతీ నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ ప్రపంచంలో నిజమైన విజయం ఆధిపత్యాన్ని సాధించడంలో కాకుండా.. సాంకేతిక పురోగతిని మానవ భద్రతతో సమతుల్యం చేయడంలోనే ఉందని అంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్