ఒకే టికెట్‌తో బస్సు, మెట్రోల్లో రయ్‌రయ్..
ఆర్టీసీ, మెట్రో బంపరాఫర్!
టీజీఎస్ ఆర్టీసీ-హెచ్‌ఎంఆర్‌ఎల్ సంయుక్త నిర్ణయం
రోజూ, నెలవారీ తిరిగే వారి కోసం కామన్ పాస్‌లు..
యాప్ ద్వారా రూ.600కే వీక్లీ పాస్..
నేడు డిప్యూటీ సీఎంచే ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర రాజధానిలో రోజూ లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యుల ప్రయాణ కష్టాలకు తెరపడనుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ), హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) సంయుక్తంగా సరికొత్త విప్లవానికి నాంది పలికాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలోని ప్రయాణికుల కోసం ‘ఉమ్మడి ప్రయాణ పాస్’(కామన్ పాస్)తో పాటు, కాగిత రహిత టికెటింగ్ కోసం ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో మెట్రో స్టేషన్ దిగి మళ్లీ సిటీ బస్సు ఎక్కేందుకు వేర్వేరు టికెట్లు తీసుకునే అవసరం ఉండదు.
గ్రేటర్ పరిధిలో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో 25 లక్షల మంది, మెట్రో రైళ్లలో సుమారు 4.50 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో అత్యధికులు బస్సు, మెట్రో రెండింటినీ ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ ఉమ్మడి పాస్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) పరిధిలోని అన్ని రకాల సిటీ బస్సులు (పుష్పక్ మినహా), మెట్రో రైళ్లలో ఈ ఒక్క కార్డుతో ప్రయాణం చేయవచ్చు.
కామన్ పాస్ చార్జీల వివరాలు
ఈ సరికొత్త కామన్ పాస్‌లను నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ కౌంటర్లలోనూ విక్రయించనున్నట్టు అధికారులు తెలిపారు. కార్డు తీసుకునేటప్పుడు రూ.100 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కార్డు తిరిగి ఇచ్చేస్తే ఆ రూ.100 వాపసు చేస్తారు. రోజువారీ పాస్ (డైలీ పాస్).. మొత్తం రూ.400 (మెట్రో చార్జీ రూ.300 + ఆర్టీసీ చార్జీ రూ.100), నెలవారీ పాస్ (మంత్లీ పాస్).. మొత్తం రూ.8,500(మెట్రో చార్జీ రూ.7,000 + ఆర్టీసీ చార్జీ రూ.1,500) చెల్లించాల్సి ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్లోనే ‘మీ టికెట్’
సాధారణ బస్సు ప్రయాణికులను చిల్లర సమస్యల నుంచి గట్టెక్కించేందుకు, పేపర్ రహిత డిజిటల్ సేవలను అందించేందుకు ఆర్టీసీ మీ టిక్కెట్ యాప్‌ను తెచ్చింది. ప్రయాణికులు తమ ఫోన్లోనే బస్సు ఎక్కే ప్రాంతం, గమ్యస్థానాన్ని ఎంచుకుని యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయొచ్చు. నిత్యం సిటీలో తిరిగే వారి కోసం బస్‌పాస్ కౌంటర్లతో పనిలేకుండా యాప్‌లోనే రూ.600కే వారం రోజుల పాస్‌ను కొనుగోలు చేయొచ్చు. వారం రోజుల పాటు అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సుల్లో పరిమితి లేకుండా ప్రయాణించొచ్చు.
నేడు ‘మెట్రో - ఆర్టీసీ కామన్ పాస్’ ఆవిష్కరణ
తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్‌ఎల్) సంయుక్తంగా సిద్ధం చేసిన ‘మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్’ నేడు(అక్టోబర్ 2న) అధి కారికంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ ఉమ్మడి పాస్‌ను ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ తో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూర్, అద్దంకి దయాకర్ హాజరు కానున్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.







కామెంట్‌లు (0)