సీఈసీ యువ ఓటర్ల కార్యక్రమాలు వాయిదా
మీరట్, వారణాసి ఈవెంట్స్‌కు బ్రేక్
సర్‌పై ఈసీలో విభేదాల నేపథ్యంలో
తాజా నిర్ణయంపై చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ పాల్గొనాల్సిన యూపీలోని రెండు యువ ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. మీరట్‌లో సెప్టెంబర్ 25న, వారణాసిలో సెప్టెంబర్ 28న జరగాల్సిన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ఈఎల్‌సీ) కార్యక్రమాలను తదుపరి తేదీకి వాయిదా వేసినట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమాలు నిరవధికంగా వాయిదా పడినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సర్ ప్రక్రియపై ఈసీలోనే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు ఇటీవల వెలువడిన నివేదికల నేపథ్యంలో సీఈసీ కార్యక్రమాల వాయిదా ప్రాధాన్యత సంతరించుకుంది. సుఖ్‌బీర్‌సింగ్ సంధు, వివేక్ జోషి గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఎన్నికల జాబితాల నిర్వహణ, ఓటర్ల చేర్పులు-తొలగింపులు, పునరుద్ధరణ, ఫారం-6 మార్పులు తదితర అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. అయితే కార్యక్రమాల వాయిదాకు ప్రస్తుత వివాదంతో ఎలాంటి సంబంధమూ లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వేదికల లభ్యత, ఉన్నతాధికారుల షెడ్యూల్, ఇతర పరిపాలనా, సహజ పరిస్థితుల కారణంగా కార్యక్రమాల తేదీల్లో మార్పులు చేయడం సాధారణ ప్రక్రియేనని ఈసీ అధికారి తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. గతంలో హిమాచల్‌ప్రదేశ్, లడఖ్, ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు వాయిదా పడిన సందర్భాలను ఈసీ ప్రస్తావించింది.
యువ ఓటర్లతో మమేకం కావాల్సిన వేళ..
మీరట్, వారణాసి కార్యక్రమాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువ ఓటర్లు, బూత్ స్థాయి అధికారులు పాల్గొనాల్సి ఉంది. ఎన్నికల నమోదు, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల సంఘం పాత్ర, ప్రజాస్వామ్య విలువలపై యువతకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. మీరట్ కార్యక్రమంలో దాదాపు 1,500 మంది, బూత్ స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశంలో సుమారు 500 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇలాంటి కీలక అవగాహనా కార్యక్రమాలు వాయిదా పడటం, అదే సమయంలో ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయాలపై విభేదాల వార్తలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సర్, ఓటర్ల జాబితాల నిర్వహణపై ప్రశ్నలు కొనసాగుతున్న సమయంలో సీఈసీ కార్యక్రమాల వాయిదా మరింత చర్చకు దారితీసింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టేందుకు పారదర్శకత, స్పష్టమైన వివరణలు అవసరమన్న వాదనలు ఈ నేపథ్యంలో ముందుకొస్తున్నాయి.






కామెంట్‌లు (0)