ప్రియమైన వేణు గీతికకు నాన్నా ఎలా ఉన్నావు, ఈ వినాయక చవితికి నువ్వు లేవు, చాలా గుర్తుకు వచ్చావు. నేను ఇప్పుడిప్పుడే కోలు కుంటున్నాను. చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళాను, విశ్రాంతి అవసరమని, బలానికి ఇంజెక్షన్లు రాసి ఇచ్చారు. వారానికి ఒకటి తీసుకోవాలని చెప్పారు. మొన్న ఆదివారం ఒక ఇంజక్షన్ తీసుకున్నాను. నాన్నా! ఈ ఉత్తరంలో అతి ముఖ్య విషయం చెప్పదల్చుకున్నాను. ఎందుకంటే ఇది పిల్లల మనసు మీద ఎంతో ప్రభావం చూపే విషయం. ఇది ఇంట్లోనే మొదలవుతుంది. చాలా మంది పిల్లల ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు. బంధువులు, స్నేహితులు, తెలిసినవారు, తోడ పుట్టిన వారు అయ్యుండవొచ్చు. ఏవో కోపాలు, మనస్పర్థలు ఉండి ఉండవచ్చు. దాంతో పిల్లలకు వారి గురించి చెడుగా చెప్తూ ఉంటారు. అలా చెప్పటం తప్పు. ఎందుకంటే పసి మనసుల్లో కోపం, ద్వేషం, అసూయ లాంటివి మొదలవుతాయి. పిల్లలకు ఊహ తెలిసేంత వరకు ఇలాంటివి చెప్పకూడదు. అలాగే వారిపై అభిప్రాయాన్ని ఏర్పర్చుకోవడం అనే విషయాన్ని పిల్లలకు వదిలేయాలి. దానివల్ల పిల్లల్లో కోపం, ద్వేషం, అసూయ లాంటివి ఏర్పడకుండా ఉండటమే కాక, వారు కనిపించినప్పుడు గౌరవంగా పలకరిస్తారు. ఎవరు ఎలాంటి వారైనా పిల్లలకు ఇతరులను గౌరవించడం నేర్పించాలి. నేను ఎప్పుడూ నీకు ఎవరి గురించీ చెడుగా చెప్పలేదు. ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నాను, నిందలు పడ్డాను. నాలో నేను దిగమింగుకున్నాను తప్ప ఎవరి గురించీ నీకు చెప్పలేదు. దానివల్ల నీవు ఎదుటివారిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకోగలిగావు. ఇంతకు ముందు చెప్పాను, పిల్లల మనసు తెల్ల కాగితం లాంటిది. ఆ తెల్ల కాగితంపై మంచే రాయాలి, మంచే చెప్పాలి. ఇప్పుడు నువ్వు పెద్దదానివ య్యావు. కాబట్టి, మనసుకు బాధ కలిగితే నీకు చెప్పి ఊరట పొందుతాను. సరే నాన్నా ఉంటాను. ఇందాక టీవీలో ఒక స్టోరీ చూసాను. అది చూశాక దాని గురించి కూడా నీకు చెప్పాలనిపించింది. తర్వాత ఉత్తరాల్లో తప్పక చెప్తాను.
ప్రేమతో అమ్మ పాలపర్తి సంధ్యారాణి






కామెంట్‌లు (0)