మీకు మేమున్నాం అంటూ అనాథలు, వృద్ధులు, వికలాంగులకు భరోసానిస్తోంది ‘వీ ఫర్ ఆర్ఫన్స్’ సంస్థ. తమ కులవృత్తితోనే వినూత్నంగా సేవ చేస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది రాకేష్ బృందం. ఉచితంగా హెయిర్ కటింగ్ చేస్తూ వేలమంది అనాథలు, వృద్ధుల జీవితాల్లో చిరునవ్వులు నింపడమే కాకుండా, మ్యాజిక్ షోలు, రక్తదాన శిబిరాలు ఆశ్రమాల్లోని వారికి అవసరమైన వస్తువులు, బహుమతులు అందజేస్తూ గత కొన్నేళ్లుగా వారు చేస్తున్న కృషి అనేకమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డివిజన్ మోహన్‌నగర్‌కు చెందిన సీహెచ్ రాకేష్ తన ఇంటివద్దే ఓ సెలూన్ నిర్వహిస్తున్నారు. తన సెలూన్ ఎదుట అద్దెకు ఉండే 70 ఏళ్ల వృద్ధుడు, తనకు వచ్చే రేషన్ బియ్యంలో తగినన్ని ఉంచుకుని, మిగిలిన బియ్యాన్ని ప్రతి నెలా ఒక అనాథ ఆశ్రమానికి ఇచ్చేవాడు. ‘‘ఆహారం వృథా కాకుండా మరొకరి కడుపు నింపడమే సంతోషం’’ అని ఆ పెద్దాయన చెప్పిన మాటలు, రాకేష్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ ప్రేరణతోనే అనాథలకు ఉచితంగా హెయిర్ కటింగ్ చేయడం మొదలుపెట్టాడు.
సుదీర్ఘ ప్రయాణం
మొదట ఇబ్రహీంపట్నంలోని ‘స్ఫూర్తి అంధుల ఆశ్రమం’లో ఉచిత హెయిర్ కటింగ్ చేయడంతో ప్రారంభించాడు. ఆ సేవలు, సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందాయి. మొదటి సంవత్సరంలో ‘వీ ఫర్ ఆర్ఫన్స్ ఫౌండేషన్’తో కలిసి సేవ చేసేందుకు ఐదుగురు ముందుకు రాగా ప్రస్తుతం 30 మంది సభ్యులు సేవలు అందిస్తున్నారు. ఈ టీమ్ 2018 నుంచి ఇప్పటి వరకు 20కి పైగా ఆశ్రమాల్లో 6000 మందికి పైగా ఉచితంగా హెయిర్ కటింగ్ చేయడంతో పాటు వారికి స్నాక్స్ పంపిణీ చేసింది. ప్రతి ఏడాది సుమారు 500 నుంచి 1000 మంది పిల్లలు, వృద్ధులు ఈ ఫౌండేషన్ ద్వారా ఉచిత సేవలు పొందుతున్నారు.
సెలవు రోజున సమాజ సేవ
సాధారణంగా నాయీ బ్రాహ్మణులకు మంగళవారం సెలవు ఉంటుంది. ఆ రోజువిశ్రాంతి తీసుకోకుండా, వారు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్ ద్వారా ఐదురోజుల ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని సభ్యులంతా కలిసి వివిధ ఆశ్రమాలకు బయలుదేరుతారు. ప్రతి వారం వివిధ ఆశ్రమాలకు వెళ్లేందుకు చార్జీలు, ఇతర సేవలకు అయ్యే సుమారు రూ.3000 నుంచి రూ.6000 వరకు నిధులను తామే సొంతంగా సమకూర్చుకుంటూ సేవలు అందిస్తున్నారు.
మ్యాజిక్ షోలు, రక్తదాన శిబిరాలు
కేవలం హెయిర్ కటింగ్ సేవలతోనే ఆగిపోకుండా పిల్లల్లో మానసిక ఉల్లాసం నింపేందుకు మ్యాజిక్ షోలు, ఆటపాటలు నిర్వహిస్తున్నారు. వారికి బహుమతులు కూడా ప్రదానం చేస్తున్నారు. అలాగే విద్యావేత్తలు, విద్యార్థుల భాగస్వామ్యంతో తలసీమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు, ఆశ్రమాల్లో దీపావళి వేడుకలు జరుపుతూ అనాథలకు కొండంత అండగా నిలుస్తున్నారు.
పలు జిల్లాలకు విస్తరించిన సేవలు
ఇప్పటివరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని సుమారు 20కి పైగా ప్రముఖ ఆశ్రమాల్లో వీరు సేవలందిస్తున్నారు. అవి:
1. డెక్కన్ ఆర్ఫన్ హోమ్ (హయత్‌నగర్)
2. మహిమ మినిస్ర్టీస్ (లింగంపల్లి, బీహెచ్‌ఈఎల్)
3. ఆక్సిలం నవజీవన్ (బోయిగూడ)
4. స్ఫూర్తి హోం (మేడిపల్లి)
5. డాన్ బాస్కో (రామంతాపూర్)
6. సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ (నాదర్గుల్)
7. కంఫర్ట్ మినిస్ట్రీస్ ప్లీజ్ హౌస్ ఆఫ్ బాయ్స్ (గబ్బిలాల్‌పేట్)
8. వేదిక స్నేహగర్ (విజయనగర్ కాలనీ ఆసిఫ్‌నగర్)
9. బాల్యం చైల్డ్‌కేర్ (ఉస్మాన్‌గంజ్)
10. డ్రీమ్ ఫౌండేషన్ బాయ్స్ హోం(గుర్రంగూడ)
11. మన ఫౌండేషన్ చిల్డ్రన్ హోం (బడంగ్‌పేట్)
12. సర్వే నీడి (హస్మత్‌పేట)
13. అగాపేజ్ ఎయిడ్స్ బాధితుల ఆశ్రమం(ఉప్పల్),
14. రేయిన్‌బో హోమ్స్ (మేడ్చల్)
15. అమ్మానాన్న అనాథ ఆశ్రమం(చౌటుప్పలు) తదితర సంస్థల్లో సేవలందిస్తున్నారు.
ఈ నెంబర్‌ను సంప్రదించండి
వీ ఫర్ ఆర్ఫన్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయాలనుకునే వారు, ఫౌండేషన్ సేవలను ఉపాయోగించుకోవాలనుకునే అనాథ, వృద్ధ, వికలాంగుల ఆశ్రమాల నిర్వాహకులు ఈ ఫోన్ నెంబర్ 9059473164ను సంప్రదించండి.
నా ప్రధాన లక్ష్యం
భవిష్యత్‌లో తెలంగాణలోని అన్ని జిల్లాలకు, ఇతర రాష్ర్టాలకు మా సేవలను విస్తరించడమే నా ప్రధాన లక్ష్యం. సేవ చేయడానికి కోటీశ్వరులే కావాల్సిన అవసరం లేదు. మనం రోజూ చేసే పనినే వారానికి ఒక్క రోజైనా ఉచితంగా చేయాలనే నిర్ణయానికి వచ్చా. తనకు సహకరించేందుకు నాయీ బ్రాహ్మణ వృత్తిదారులతో పాటూ విద్యార్థులు ముందుకు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు.
- సీహెచ్ రాకేష్, వీ ఫర్ ఆర్ఫన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
కటకం దియాన్ష్







కామెంట్‌లు (0)