Magazines

అనంత నటనకు దాదాసాహెబ్

59 నిమిషాల క్రితం

అనంత్ నాగ్‌
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 6 నిమిషాల చదవడం

భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ క‌న్న‌డ‌ సీనియర్ నటుడు అనంత్ నాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన విశేష సేవలు, అద్భుతమైన సినీ ప్రస్థానాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించింది. దశాబ్దాల తన సహజ నటనతో, విభిన్న పాత్రలతో ప్రత్యేకత చాటుకున్న నటుడు అనంత్‌నాగ్. ముందు తరాలకు స్ఫూర్తినిస్తూ ఆయన సుదీర్ఘ నట ప్రయాణం సాగుతోంది.


1970వ దశకంలో నాటకరంగం ద్వారా కళా ప్రయాణాన్ని ప్రారంభించిన అనంత్‌నాగ్‌ ఆ తర్వాత ఆర్ట్‌, కమర్షియల్‌ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయం లిఖించారు. వైవిధ్యమైన పాత్రలతో కన్నడ చిత్ర పరిశ్రమలో తిరుగులేని గుర్తింపు పొంది, భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగారు. ఆర్ట్‌ చిత్రాల దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ రూపొందించిన ‘అంకుర్‌’ చిత్రంలో నటించిన అనంత్‌నాగ్‌ ఆ తర్వాత ఆయన రూపొందించిన ‘నిశాంత్‌’, ‘భూమిక’, ‘కొండుర’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో అనంత్‌ నాగ్‌ కన్నడ చిత్రాలతో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో 300కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. అందులో 250 కన్నడ సినిమాలే కావడం విశేషం. ఒకే భాషకు పరిమితం కాకుండా తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, మలయాళ, ఆంగ్ల భాషా చిత్రాల్లో నటించారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌కు 1995లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ లభించింది. మళ్లీ 31 ఏళ్ల తర్వాత ఆ విశిష్ఠ పురస్కారం పొందిన రెండో కన్నడ నటుడు అనంత్‌నాగ్‌.

నాటకాలపై ఆసక్తితో...
అనంత్ నాగ్ 1948లో సెప్టెంబర్ 4న కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో కొంకణి మాట్లాడే సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అనంత్ నాగ్ పూర్తి పేరు అనంత్ నాగర్కట్టె. తండ్రి సదానంద్, తల్లి ఆనంది. అనంత్‌నాగ్‌ చిన్నతనమంతా కర్ణాటకలో స్వామి రామదాస్‌ నెలకొల్పిన ఆనంద్‌ ఆశ్రమంలోనే గడిచింది. ఆయన చదువు విషయంలో ఎప్పుడూ టాప్‌ ఫైవ్‌ ర్యాంకర్స్‌లో ఒకరిగా ఉండేవారు. తొమ్మిదో తరగతి వరకూ పుట్టిన ఊళ్లోనే చదువుకున్న అనంత్‌నాగ్‌ను పై చదువుల కోసం ముంబై పంపించారు ఆయన తండ్రి సదానంద్. తన పదకొండో ఏటా ముంబైలోకి అడుగు పెట్టిన అనంత్‌నాగ్‌కు ఆ మహానగరం ఎన్నో కొత్త విషయాలు నేర్పించింది. బొంబాయిలో చదువుకునే రోజుల్లో నాటకాలపై ఆసక్తి పెంచుకుని, దాదాపు ఎనిమిదేండ్ల పాటు థియేటర్ రంగంలో శిక్షణ పొందారు.

బ్యాంక్‌ ఉద్యోగిగా...
అనంత్ నాగ్ బొంబాయిలో కన్నడ, కొంకణీ, మరాఠీ నాటకాలు ఎక్కువగా చూసేవారు. నాటకాల మీద ఆ ఆసక్తే ఆయన్ని నటుడిగా మార్చింది. కాలేజీ రోజుల్లోనే దాదాపు 50 కి పైగా నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించిన తర్వాత నాగ్ చిత్రసీమలోకి ప్రవేశించారు. ఎన్నో నాటకాల్లో వైవిధ్య పాత్రలు పోషించిన అనుభవం ఆయనకు సినిమా నటుడిగా ఎంతో ఉపయోగపడింది. ఆనాటి రంగ స్థల ప్రముఖులు గౌరంగ్‌, సత్యదేవ్‌ దూబే, అమోల్‌ పాలేకర్‌ వంటి వారితో ఏర్పడిన పరిచయాలు భవిష్యత్‌కు మంచి పునాది వేశాయి. దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసి తనకు ‘అంకుర్‌’ సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది దూబేనని అనంత్‌నాగ్‌ చెబుతుంటారు. సినిమా రంగంలోకి రాకముందు బాంద్రాలోని కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన అనంత్‌నాగ్‌ ఆ తర్వాత ముంబై యూనియన్‌ బ్యాంక్‌లో మూడేళ్లు ఉద్యోగం చేశారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌ కోటాలో ఆయనకు బ్యాంక్‌ ఉద్యోగం లభించడం విశేషం. ఆ తర్వాత బ్యాంక్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగళూరు వచ్చేసి నటన మీద పూర్తి దృష్టి పెట్టారు.


చిత్రసీమలోకి...
1973 లో ‘సంకల్ప’ అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమయిన అనంత్ నాగ్ 300కు పైగా సినిమాల్లో నటించారు. 1974లో శ్యామ్‌ బెనెగల్‌ రూపొందించిన సమాంతర సినిమాలతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ‘అంకుర్‌’, ‘నిశాంత్‌’, ‘మంథన్‌’, ‘భూమిక’, ‘కొండుర’, ‘కలియుగ్‌’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు సహజ నటనకు, అంతర్ముఖమైన అభినయానికి ఉదాహరణలుగా నిలిచాయి. కన్నడలో ‘హంసగీతే’, ‘మిన్చిన ఓట’, ‘బారా’, ‘చందనద గొంబె’, ‘నా నిన్న బిడలారే’, ‘బయలు దారి’, ‘హోస నీరు’, ‘అవస్థె’, ‘గణేశన మదువె’, ‘గౌరి గణేశ’ వంటి చిత్రాలు ఆయన నటనా ప్రస్థానంలో కీలకంగా నిలిచాయి. గంభీరమైన పాత్రలతో పాటు హాస్య పాత్రల్లోనూ మెప్పించారు. ఆయన తమ్ముడు శంకర్‌ నాగ్‌ దర్శకత్వం వహించిన ‘మాల్గుడి డేస్‌’ ఆయనను టెలివిజన్‌ ద్వారా మరో తరానికి చేరువ చేసింది. అనంత్ నాగ్‌ సహజత్వానికి ప్రాధాన్యమిచ్చే సమాంతర చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కమర్షియల్‌ సినిమాల్లో కథానాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్యనటుడిగా, వయసుకు తగ్గ పాత్రల్లోనూ కనిపించారు.

తెలుగులోనూ హీరోగా
అనంత్‌నాగ్ తెలుగులో తొలిసారిగా 1977లో ‘ప్రేమ లేఖలు’ సినిమాలో నటించారు. ‘అన్నపూర్ణ పిక్చర్స్‌ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ఈ సినిమాలో జయసుధ బాయ్‌ఫ్రెండ్‌గా నెగెటివ్‌ పాత్రను ఆయన పోషించారు. సినిమాలో ఒక విధంగా హీరో ఆయనే అన్నట్లుగా సాగుతుంది. హీరోయిన్ జయసుధతో ఆయనకు మంచి డ్యూయెట్లు ఉన్నాయి. ‘ఇది తీయని వెన్నెల రేయి..’ అన్న పాట ఈ రోజుకీ ఎవర్ గ్రీన్ హిట్. ఇక ఈ సినిమాకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. అప్పట్లో డీసెంట్ క్లాస్ మూవీగా ప్రేక్షకులను అలరించింది. 1978లో శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలోనే వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రంగా ‘అనుగ్రహం’ ఉంటుంది. ఈ సినిమాలో అనంత్‌నాగ్ పరశురాముడు పాత్రలో సీరియస్ గానే కాదు సంక్లిష్టమైన పాత్రలో కనిపించి అలరిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా వాణిశ్రీ నటించారు. తనకు మాత్రమే దైవిక శక్తులు, అనుగ్రహం లభించాయని నమ్మి కట్టుకున్న ఇల్లాలుని పక్కన పెట్టి పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తూ మానసిక సంఘర్షణకు గురయ్యే ఒక యువకుడి పాత్రలో అనంత్‌నాగ్ ఒదిగిపోయారు.

అత్యంత ప్రతిభావంతుడిగా
తెలుగులో ఆయన నటించిన చిత్రాల్లో 2004లో వచ్చిన ‘శంఖారావం’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ సినిమాలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పోలిన పాత్రను అనంత్‌ నాగ్‌, ప్రతిపక్ష నాయకుడు రాజశేఖరరెడ్డిని పోలిన పాత్రను శరత్‌బాబు పోషించారు. సినిమాలో వారి పాత్రల పేర్లు వేరుగా ఉన్నా వారికి ఇచ్చిన గెటప్స్‌, మేనరిజమ్స్‌ ఆ రాజకీయ నాయకులను గుర్తు చేస్తుంటాయి. ఆ తర్వాత ‘బాలు’, ఐదేండ్ల కిందట వ‌చ్చిన నితిన్ ‘భీష్మ’ చిత్రాల్లో కూడా అనంత్‌నాగ్‌ నటించారు. తెలుగులో మంచి విలన్ కం హీరోగా రాణించే టైంలో అనంత్ నాగ్ తన పూర్తి సినీ ప్రస్థానాన్ని కన్నడ సినీ సీమకే కేటాయించారు. మొత్తానికి అనంత్ నాగ్ అత్యంత ప్రతిభావంతుడిగా యంగర్ డేస్ లోనే రుజువు చేసుకున్నారు. కన్నడ నాట 1995లో తొలిసారి రాజ్ కుమార్ దాదా ఫాల్కే అవార్డుని అందుకోగా.., మూడు దశాబ్దాల తరువాత ఈ గౌరవం కన్నడ సీమకు చెందిన అనంతనాగ్‌కు దక్కింది.

‌ హిందీలో..
అనంత్‌నాగ్ ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో 1974 లో వచ్చిన ‘అంకుర్’సినిమాతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన ‘నిశాంత్’, ‘మంథన్’, ‘భూమిక’, ‘కొండూర’, ‘కలియుగ్’ వంటి చిత్రాల్లో సమాంతర సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు.


విజయవంతమైన చిత్రాలు
అనంత్‌నాగ్ కన్నడలో “బేయలు దారి, మించిన ఓట, బెలదింగళ బాలె, మోంగారు మళె, గోధి బన్న సాధారణ మైకట్టు” చిత్రాలతో పాటు పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ “K.G.F: చాప్టర్ 1” లో కథకుడిగా (ఆనంద్ ఇంగలగి) అద్భుతమైన పాత్ర పోషించారు.

బుల్లితెర పైన
అనంత్‌నాగ్ మెయిన్ స్ట్రీమ్ చిత్రాలతో పాటు బుల్లితెరపైన కూడా కనిపించారు. ఆయన తన తమ్ముడు శంకర్ నాగ్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ టీవీ సిరీస్ ‘‘మాల్గుడి డేస్’’ లో ప్రధాన పాత్రలు పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అనంత్ నాగ్, శంకర్ నాగ్ కన్నడ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన లెజెండరీ సోదరులు. వీరిద్దరూ కలిసి ‘మించిన ఓట’, ‘యాక్సిడెంట్’, ‘జన్మ జన్మద అనుబంధ’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. దురదృష్టవశాత్తూ, 1990లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో శంకర్ నాగ్ తన 35వ ఏటనే కన్నుమూశారు.


భార్య కూడా నటీమణే

అనంత్‌నాగ్‌ సతీమణి గాయత్రి కూడా నటీమణే. చిరంజీవి నటించిన ‘మొగుడు కావాలి’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించారు. కన్నడంలో కొన్ని సినిమాల్లో నటించిన గాయత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనంత్‌నాగ్‌. ఈ దంపతులకు ఒక్కతే కుమార్తె అదితి.

రాజకీయ జీవితం

సినిమాలతో పాటు అనంత్ నాగ్ రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. 1980లో జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. కర్ణాటక శాసన మండలి సభ్యుడిగా, ఆ తర్వాత మల్లేశ్వరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జె.హెచ్. పటేల్ ప్రభుత్వంలో బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. 2004లో చామరాజపేట నుండి పోటీ చేసి ఓడిపోయిన అనంతరం, రాజకీయాలకు దూరంగా ఉంటూ పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించారు.

కేరాఫ్ కేజీఎఫ్‌గా
అనంత్ నాగ్ సినీ జీవితంలో 300కి పైగా సినిమాలు నటించారు. లేటెస్ట్ గా చూస్తే కేజీఎఫ్ అనంతనాగ్ నటనకు అద్దం పట్టింది. కేజీఎఫ్ చిత్రంలో అనంతనాగ్ పోషించిన ఆనంద్ ఇంగలగి అనే జర్నలిస్ట్ పాత్ర సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. అందులో ఆయన తన గంభీరమైన గొంతుతో, హావభావాలతో కథను ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులను సినిమాలోకి నేరుగా తీసుకువెళ్తుంది. రాకీ భాయ్ పాత్రను ఎలివేట్ చేయడానికి ఆయన చెప్పే డైలాగులు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ కూడా తెప్పించాయి. ఒక రకంగా చెప్పాలంటే కేజీఎఫ్ మొదటి భాగానికి ఆయనే కథా నాయకుడుగా ప్రాణం పోశారు. ‘కేజీఎఫ్‌’ చిత్రం మొదటి భాగం స్టోరీని అనంత్‌నాగ్‌ రన్‌ చేసిన విధానం చూసి ఆయనకు అభిమానులుగా మారిన వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

అవార్డులు
అనంత్‌ ‌నాగ్ కళా రంగానికి చేసిన సేవకుగాను భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన “దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు” ను 2024 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం ఆయనకు ప్రకటించింది. అంతకుముందు కేంద్రం ప్రభుత్వం 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక “పద్మ భూషణ్” పురస్కారాన్ని జనవరి 25న ప్రకటించింది. కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును నాలుగుసార్లు అందుకున్నారు. 6 ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులతో పాటు “కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు”, కర్ణాటక రాష్ట్ర జీవిత సాఫల్య పురస్కారం వంటి గౌరవాలు కూడా ఆయనకు లభించాయి.

డా. పొన్నం రవిచంద్ర, 9440077499

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్