దానిలో భాగమే ‘సర్’ పేరుతో ఓట్ల తొలగింపు
ది వైర్ తెలుగు సదస్సులో పూర్వ సంపాదకులు సిద్దార్ట్ వరదరాజన్
విద్యాసంస్థల నుంచే ఆర్‌ఎస్‌ఎస్ అజెండా అమలు - అయిషీ ఘోష్
డిజిటల్ ఇండియా పేరుతో ప్రజలపై నిఘా - కొడాలి శ్రీనివాస్
చట్ట సంస్కరణలు అనివార్యం - జెన్‌జీ పవనం
సీఈసీ రాజీనామా డిమాండ్‌తో అక్టోబర్ 2న ముంబయిలో నిరసన - సీజేపీ రాష్ట్ర కన్వీనర్ విజయ
నవతెలంగాణ-హైదరాబాద్
బ్యూరో
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) ద్వారా ప్రజల్ని మోసం చేస్తున్నదని ‘ది వైర్ ’ పూర్వ సంపాదకులు సిద్దార్ట్ వరదరాజన్ అన్నారు. దానిలో భాగమే వికసిత్ భారత్ నినాదం అని చెప్పారు. ఈ టెక్నికల్ అంశాల ప్రాతిపదికనే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రజల ఓటుహక్కును ‘సర్’ పేరుతో లాగేసుకుంటున్నారని విమర్శించారు. ‘ది వైర్ తెలుగు’ ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో ‘నవభారతానికి సరికొత్త అజెండా’ పేరుతో సదస్సు నిర్వహించారు. దీనిలో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. వికసిత్ భారత్ అనే భూటకపు నినాదంతో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారంటూ పలు ఉదాహరణలు వివరించారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు తమ గళాన్ని వినిపించాలని కోరారు. మోడీ చెప్తున్న వికసిత్ భారత్, నయా భారత్ నినాదాలపై 70 ఏండ్ల క్రితమే చర్చ జరిగిందని వివరించారు. సమాచార హక్కు, ఉపాధి హామీ వంటి అంశాలపై 20 ఏండ్ల క్రితమే చర్చించి చట్టాలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు వాటిని నిర్వీర్యం చేస్తూ, ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజల్ని మరోసారి మోసం చేస్తున్నారని చెప్పారు. పనిలో పనిగా అవే నినాదాలతో అన్ని రంగాల్లోనూ హిందూత్వ అజెండాను అమలు చేస్తున్నారనీ, దానికోసం అనేక పద్ధతులు అమలు చేస్తూ, దానికి అనుకూలమైన విధానాలతో చట్టాలు చేస్తున్నారని పలు అంశాలను ప్రస్తావించారు. నయాభారత్ నినాదం అమల్లో ‘సర్’ అతి ముఖ్య మైనదనీ, దీన్ని అమలు చేసే బాధ్యతను మోడీ, అమిత్ షా నియమించిన వారే చేపట్టారన్నారు.
బీహార్‌లో మొదలైన ‘సర్’ ద్వారా మొదట్లో అధికార పార్టీకి అనుకూలంగా లేని పేదలు, ముస్లింల ఓట్లు తొలగించారనీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ద్వారా అమల్లోకి తెస్తున్నారని వివరించారు. ఎన్నికల కమిషన్‌లోని అంతర్గత ఆధిపత్య కుట్రల్ని ఓ ఆంగ్ల దినపత్రిక బట్టబయలు చేసిందన్నారు. దేశంలో స్వేచ్చ, నిస్పక్షపాత ఎన్నికలపై అన్ని వర్గాలు, రంగా లకు చెందిన ప్రజల మధ్య చర్చ జరగాలని చెప్పారు.
అది ఆర్‌ఎస్‌ఎస్ అజెండానే
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన విద్యావిధానం ద్వారా హిందుత్వ భావజాలాన్ని విద్యార్థుల్లోకి చొప్పించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని జెఎన్‌యు విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షురాలు అయిషీ ఘోష్ అన్నారు. పాఠ్యపుస్తకాల్లో మార్పులు దానిలో భాగమేనని పలు ఉదాహరణలు ప్రస్తావించారు. చివరకు ఎవరైనా మంచి పుస్తకాలు చదవడాన్ని కూడా నేరంగా భావించి, అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు.
ప్రజలపై నిఘా
జన్‌ధన్, ఆధార్, మొబైల్‌తో సహ అన్నింటిని సాంకేతికపరంగా ఒకదానితో మరొకటి అనుసంధానం చేసి, తద్వారా ప్రభుత్వం ప్రజలపై నిఘాకు పాల్పడుతున్నదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు కొడాలి శ్రీనివాస్ అన్నారు.
కేంద్రం ప్రకటించిన డిజిటల్ ఇండియా ప్రధాన ఉద్దేశ్యం అదేనని వివరించారు. ఈ నిఘా సక్సెస్ అయినట్టు భావించే ఇప్పుడు ఒకే దేశం, ఒకేపార్టీ అనే నినాదాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. టవర్ డాటా రికార్డు, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డాటా రికార్డు ద్వారా ప్రజలపై నిరంతర నిఘా కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
చట్ట సంస్కరణలు అనివార్యం
ప్రజల మధ్య విద్య, ఉపాధి, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు చట్ట సంస్కరణలు అనివార్యమని జెన్‌జీ పవనం అన్నారు. పాలకుల పట్ల ప్రజలు ఎల్లప్పుడు ప్రతిపక్షంగానే వ్యవహరించాలన్నారు. ఇష్టంలేని, నష్టం చేసే ప్రభుత్వ విధానాలపై నిరసనలు వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఎప్పుడూ ఉండాలన్నారు. ఆ దిశగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి పౌర సమాజమే ముందుకు రావాలని ఆకాంక్షించారు.
అక్టోబర్ 2న నిరసనలు
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఙానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న ముంబాయిలో శాంతియుత నిరసన కార్యక్ర మాన్నిపెద్ద ఎత్తున చేపడుతున్నామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రాష్ట్ర కన్వీనర్ విజయ్ తెలిపారు. ఆ తర్వాత 10 రోజుల్లో హైదరాబాద్‌లో కూడా నిరసన చేపట్టాలని నిర్ణయించామన్నారు. యువతరం దీనిలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ యువత పట్ల పాలకులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంభించారనీ, దశాబ్దాలుగా పాఠ్యపుస్తకాల్లో చెప్తున్నదానికి భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడి పని చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం రు.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నదనీ, ఆ సొమ్ముతో జిల్లాల్లో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రులు నిర్మించవచ్చని సూచిం చారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా ‘ది వైర్ తెలుగు’ సంపాదకులు కొండూరి వీరయ్య వ్యవహరించారు. సభ ప్రారంభానికి ముందు వైర్ సంపాదకవర్గ సభ్యులు ఐవీ రమణారావు సమావేశ ఉద్దేశ్యాన్ని వివరించారు. తెలంగాణ పబ్లికేషన్స్ నిర్వహకులు కోయ చంద్రమోహన్ కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు. సదస్సు లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మాజీ, ప్రస్తుత పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలి స్టులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, యువకులు, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)