రాజీనామా నుంచి తొలగింపు వరకు.. చట్టం ఏం చెప్తోంది?
కేసు.. అప్రూవర్.. తదుపరి అడుగులపై ఉత్కంఠ
జ్ఞానేశ్ కుమార్ భవితవ్యంపై నాలుగు కీలక ప్రశ్నలు
న్యూఢిల్లీ : దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టే ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ఆయన పదవికి సంబంధించిన పరిణామాలపై రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? ఆయనను పదవి నుంచి తొలగించగలరా? ఆయనపై కేసు పెట్టవచ్చా? అప్రూవర్‌గా మారితే పరిస్థితి ఏమిటి? అనే నాలుగు అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. దీంతో ఎన్నికల సంఘం స్వతంత్రత, దాని నిర్ణయాలపై ప్రజల విశ్వాసం వంటి అంశాలు మరోసారి ముందుకు వచ్చాయి.
రాజీనామా చేస్తే?
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేస్తే.. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, గతంలో అనుసరించిన విధానం ప్రకారం తదుపరి ఎన్నికల కమిషనర్‌గా ఉన్న డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధును సీఈసీగా నియమించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఖాళీ అయ్యే ఎన్నికల కమిషనర్ స్థానాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. జ్ఞానేశ్ కుమార్ పదవీకాలం 2029 జనవరి 26తో ముగియాల్సి ఉంది. అంటే ఆయన రాజీనామా చేస్తే నిర్ణీత పదవీకాలం పూర్తికాకముందే పదవి నుంచి తప్పుకున్నట్టవుతుంది. సీఈసీగా నియమితులయ్యే వ్యక్తి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా దానికి సమానమైన హోదాలో పనిచేసిన లేదా పనిచేస్తున్న అధికారి అయి ఉండాలని ప్రస్తుత చట్టం నిర్దేశిస్తోంది.
గతంలోనూ ఎన్నికల కమిషనర్ల ఆకస్మిక నిష్క్రమణలు చర్చకు దారితీశాయి.
ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తన సహచరులతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో రాజీనామా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది రోజుల ముందు అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేయడం కూడా అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కేసు పెట్టవచ్చా?
2023లో తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్లకు సంబంధించిన చట్టంలోని సెక్షన్ 16 సీఈసీ, ఎన్నికల కమిషనర్లపై కొన్ని సివిల్, క్రిమినల్ చర్యల నుంచి రక్షణ కల్పిస్తోంది. అయితే ఈ రక్షణ నిబంధనపై సుప్రీంకోర్టులో సవాలు కొనసాగుతోంది. 2026 జనవరి 13న ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నిబంధనపై అప్పట్లో స్టే ఇవ్వలేదు. కాగా, విధి నిర్వహణ పరిధిని దాటి లేదా దురుద్దేశంతో వ్యవహరించిన సందర్భాల్లో చట్టపరమైన చర్యలకు అవకాశం ఉండవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అప్రూవర్‌గా మారితే?
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల జ్ఞానేశ్ కుమార్ ‘అప్రూవర్‌గా మారాలి’ అని సూచించారు. అయితే అప్రూవర్‌గా మారడం అంటే ఒక నేరానికి సంబంధించిన విషయాల్లో తనకు తెలిసిన సమాచారాన్ని దర్యాప్తు సంస్థ లేదా కోర్టుకు వెల్లడించి, కేసులో సాక్షిగా మారే ప్రక్రియ.
అందువల్ల ఆయన అప్రూవర్‌గా మారితే, ఏదైనా నేరం జరిగినట్టు ఆయన అంగీకరించినట్టుగా భావించే పరిస్థితి ఏర్పడుతుంది. బీఎన్‌ఎస్‌ఎస్‌లోని 343 నుంచి 345 సెక్షన్లు అప్రూవర్ వాంగ్మూలం, దాని వినియోగానికి సంబంధించిన నిబంధనలను కలిగి ఉన్నాయి. భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఈ)లోనూ సహచర నిందితుడి సాక్ష్యానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. అప్రూవర్ వాంగ్మూలాన్ని కోర్టు జాగ్రత్తగా పరిశీలిస్తుంది. అవసరమైతే ఇతర స్వతంత్ర ఆధారాలతో దాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. 2026 మే 29న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనూ అప్రూవర్ వాంగ్మూలాన్ని ధ్రువీకరించే అంశంపై పలు సూత్రాలను స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు
సీఈసీ పదవి, ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రస్తుతం జరుగుతున్న చర్చకు జ్ఞానేశ్ కుమార్ వ్యవహారం బలాన్ని చేకూర్చింది. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు, దాని అధికారులపై వచ్చే ఆరోపణలు, వారి చట్టపరమైన రక్షణ వంటి అంశాలు ఇప్పుడు న్యాయ, రాజకీయ చర్చల్లో ప్రధానంగా మారాయి. అయితే జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు, వాటి చట్టపరమైన పరిణామాలు చివరకు కోర్టులు, పార్లమెంట్, సంబంధిత రాజ్యాంగ సంస్థల పరిశీలనకు లోబడి ఉంటాయి. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత, జవాబుదారీతనం కీలకంగా ఉండాలని రాజ్యంగ నిపుణులు సూచిస్తున్నారు.
పదవి నుంచి తొలగించగలరా?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సీఈసీని సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానానికి సమానమైన ప్రక్రియ ద్వారా తొలగించవచ్చు. ఇందుకోసం పార్లమెంటులోని రెండు సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. జడ్జెస్ ఇన్‌క్వైరీ చట్టం ప్రకారం లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు తొలగింపు తీర్మానానికి సంబంధించిన నోటీసుపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ ఎన్నికల సంఘం చరిత్రలో అసాధారణ పరిణామంగా నిలిచే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరాన్ని రాజ్యాంగ నిర్మాతలు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.






కామెంట్‌లు (0)