ముత్యాలపల్లె అనే ఊరిలో వెంకటేశ్వర్లు అనే రైతు ఉన్నాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు. అతనికున్న రెండెకరాల పొలాన్ని పండించుకుంటూ రెండు పాడిగేదెలను సాకుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అంతంత మాత్రమైన ఆర్థికపరిస్థితి కలిగిన వెంకటేశ్వర్లు ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళుచేయడానికి ఉన్న రెండెకరాల పొలం అమ్మేయాల్సివచ్చింది. సొంత పొలం లేకపోవడంతో కౌలుకు చేయడం ఇష్టంలేక, రైతుగా బతికినచోటే కూలిపనులకు వెళ్ళలేక, రెండు గేదెల పాడితోనే జీవనం సాగించలేక భార్యాభర్తలిద్దరూ సిటీకి వెళ్ళారు.
సిటీలో ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నారు. సిటీకొచ్చి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళు సంపాదించింది ఏమీలేదు. బాగా బతికింది ఏమీలేదు, వాళ్ళకు ఒరిగింది ఏమీలేదు. వాళ్ళు సిటీకొచ్చిన ఈ నాలుగైదు సంవత్సరాలలో ఇంటద్దె పెరిగింది. నాలుగువేలది ఎనిమిది
వేలయ్యింది కానీ వాళ్ళ జీతం మాత్రం పన్నెండు నుండి పదిహేను వేలే అయింది. ఏ ఖర్చు చూసినా పెరిగిపోయింది. పాలు, పెరుగు, నూనె, గ్యాస్, పప్పులు, ఉప్పులు, బట్టలు, కూరగాయలు, పళ్ళు.. ఇలా ఏ వస్తువు చూసినా రేట్లు బాగా పెరిగిపోయాయి. దాంతో పట్టణంలో బతుకు కష్టంగా
మారింది. ఆర్థిక పరిస్థితులు ఒకవైపు, పని ఒత్తిడి మరోవైపు నలిపేస్తూఉండడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు.
భర్త పరిస్థితిని చూసి తట్టుకోలేక తను కూడా ఏదో ఒక పనికి వెళదామని నిర్ణయించుకుంది భార్య శ్రీలక్ష్మి. ఊర్లో ఉండగా తమ పొలంలోకి
అప్పుడప్పుడు వెళ్ళడం తప్ప ఏనాడు బయటికి వెళ్ళని భార్యను పనికోసం బయటికిపంపించడానికి మనసొప్పలేదు వెంకటేశ్వర్లుకి. ఇన్ని ఇబ్బందులతో, ఇన్ని ఆలోచనలతో సతమతమైపోతున్న భర్తను చూసి తట్టుకోలేక ఊర్లోని తన తోడబుట్టిన అన్నలకు ఫోన్ చేసి తాము పడుతున్న తమ సమస్యల గురించి వివరించింది. చెల్లెలి బాధను అర్థం చేసుకున్న అన్నలు వాళ్ళని ఊరికి వచ్చేయమన్నారు.
తమ పొలంలో కొంత కౌలుకు చేసుకుని బతకమన్నారు. అన్నలు చెప్పిన విషయాన్ని భర్తతో చెప్పింది.
“కౌలుకు మాత్రం ఊరికినే వస్తదా.. కౌలు డబ్బులు కట్టాలి, వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలి, చాకిరీ చేయాలి” అన్నాడు వెంకటేశ్వర్లు. “ఇలా భయపడుతూ కూర్చుంటే సమస్య తీరుతుందా? మా అన్నలే కాబట్టి కౌలు డబ్బులకి ఒత్తిడి చేయరు, డబ్బులు మన చేతిలో ఆడినప్పుడే ఇవ్వొచ్చు. ఇక్కడ ఈ అద్దె కొంపల్లో తిప్పలు పడే కంటే ఊర్లో సొంత ఇంట్లో ఉండి కలో గంజో తాగొచ్చు ఊరెళ్ళి పోదామయ్యా” అన్నది శ్రీలక్ష్మి. భార్య మాటలు కొంత ధైర్యాన్ని ఇవ్వడంతో సరే అన్నాడు వెంకటేశ్వర్లు. తిరిగి తమ ఊర్లోని సొంత గూటికి చేరారు.
పంటల సీజన్ కావడంతో ఇద్దరు బావమరుదులు చెరొక ఎకరం కౌలుకి ఇవ్వడంతో వ్యవసాయపనులు మొదలుపెట్టాడు వెంకటేశ్వర్లు. భర్తకు చేదోడు వాదోడుగా సహకరించింది శ్రీలక్ష్మి. ఆ ఏడు పంటల పరిస్థితి అంతంతమాత్రంగానే సాగింది. నకిలీ విత్తనాలు చాలావరకు మొలకెత్తలేదు. కల్తీ ఎరువులు, మందులు అస్సలు పనిచేయక పంట దిగుబడి తగ్గింది. అకాల వర్షం చేతికొచ్చిన పంటను కొంత నాశనం చేసింది. చివరికి మిగిలిన ఆ కొద్ది పంటకు అకస్మాత్తుగా ఊడిపడ్డ చుట్టంలా అప్పుడే రేటు తగ్గి వెంకటేశ్వర్లును కుదేలుచేసింది. పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా బొటాబొటీలుగా వచ్చాయి. ఇక కౌలుడబ్బులు ఎలాకట్టాలిరా భగవంతుడా అనుకుంటూ దిగారుపడిపోయాడు వెంకటేశ్వర్లు. చెల్లెలు మీద ఉన్న ప్రేమతో బావమరుదులు పొలం కౌలుకు చేసుకోమని ఇచ్చారు. ఇప్పుడు పంట పండలేదని కౌలు డబ్బులు ఎగవేయలేడు, అలాగని కట్టే స్థోమత లేదు. ఈ మానసిక ఒత్తిడితో నలిగిపోయిన వెంకటేశ్వర్లు చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి తెగించాడు. ఒకరోజు ధైర్యం చేసి పురుగులమందుతో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అది గుర్తించిన శ్రీలక్ష్మి దానిని అడ్డుకుంది.
“ఏంటయ్యా ఈ పిచ్చి పని” అని నిలదీసింది. పొలం కౌలుకు చేసి అప్పుల పాలై కౌలు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో బావమరుదులకి మొహం చూపించలేక, ఊర్లో వాళ్ళు అనే హేళన మాటలు తట్టుకోలేక తను ఈ పని చేయబోయినట్లు చెప్పాడు. దానికి శ్రీలక్ష్మి “టీవీలో వచ్చే వార్తల్లో పంటలు సరిగ్గా పండలేదని, గిట్టుబాటుధర రాలేదని, అప్పుల పాలయ్యామని కొందరు రైతులు అధైర్యంతో ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళను నువ్వు ఎన్ని తిట్లు తిట్టావు? ఈ సంవత్సరం పండకపోతే వచ్చే సంవత్సరం పండుతుంది, ఈ సంవత్సరం అప్పులైతే వచ్చే సంవత్సరం
తీర్చుకోవచ్చు అంతేకానీ వాటికి భయపడి ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది? మీ వెనక ఉన్న మీ కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచించక్కర్లేదా అని ఎన్ని తిట్టేవాడివి అలాంటిది నువ్వే అధైర్యంగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడంలో అర్థముందా?” అని అడిగింది.
“ఏం చేయమంటావు, భయంతో గుండెలవిసిపోతున్నాయి.
తనదాకావస్తేకానీ తెలిసిరాదని పెద్దలు ఊరికే అన్నారా?”. “అలా అధైర్య పడిపోతే ఎలాగయ్యా?”, “మరింకేంచేయాలి?” అన్నాడు అయోమయంగా. “భయం మన మెదడుని బండబారిపోయేలా చేస్తుంది. భయాన్ని విడిచి ధైర్యంగా ముందుకు వెళితే దేన్నైనా సాధించే శక్తి వస్తుంది” అని ధైర్యాని నూరిపోసే ప్రయత్నం చేసింది. “ఏం ధైర్యమో ఏమో ఊర్లో రైతుగాను బతకలేకపోతున్నాను వేరేచోట ఉద్యోగస్తుడిగాను బతకలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాళ్ళు ఎవరైనా బతకాలంటే తినాలి.. తినాలంటే కావాలి.. కావాలంటే పండించాలి. అన్నం తిన్నా, కూర తిన్నా, దోశ తిన్నా, ఇడ్లీ తిన్నా, చపాతీ తిన్నా, చట్నీ తిన్నా, పిజ్జా తిన్నా, బర్గర్ తిన్నా.. ఏది తిన్నా.. ఏది తినాలన్నా రైతు పండించే పంట నుండి రావాల్సిందే. అంటే మనిషి బతకాలంటే రైతే ముఖ్యమైన ఆధారం. కానీ అలాంటి ముఖ్యమైన రైతుకు మాత్రం ఆధారం లేకుండా పోయింది. వాడి బతుక్కు గ్యారెంటీ లేకుండాపోయింది” అని ఆవేదన చెందాడు వెంకటేశ్వర్లు.
వూరుకోయ్యా కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని ఓదార్చింది శ్రీలక్ష్మి. జరిగిన విషయమంతా ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళకు చెప్పింది శ్రీలక్ష్మి. వాళ్ళంతా ఆందోళనగా వచ్చారు. పెద్దల్లుడు గిరి తెలివైనవాడు, మంచి మాటకారి. “ఏంటి మావయ్య మాలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన
మీలాంటి పెద్దవాళ్ళే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా? ఏ సమస్యకయినా చావు పరిష్కారం కాదని తెలుసుగా..” అన్నాడు.
“తెలుసయ్యా కానీ పరిష్కారం లేని సమస్య వెంటాడుతుంటే భయపడిపోయా”. “ఈ సృష్టిలో ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంది మావయ్యా. లేకుంటే సమస్య పరిష్కారం అనే పదాలకు అర్ధమేలేదు. కాకుంటే పరిష్కార మార్గం దిశగా మనం ఆలోచించగలగాలి. ప్రశాంతంగా మనసుపెట్టి ఆలోచిస్తే ప్రతీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే మీ సమస్యకూ చక్కని పరిష్కారం ఉంది”
“అవునా? ఏంటది?”
“కాయ కష్టం చేసి వ్యవసాయం చేయడం కాకుండా కాలానుగుణంగా వ్యవసాయం చేయడం”. “అంటే” వెంకటేశ్వర్లులో మళ్ళీ అయోమయం.
“ఇప్పడు నీలాంటి వ్యవసాయదారులు ఒక విషయం గురించి ఆలోచించాలి. ప్రస్తుతం ఎలాంటి వ్యవసాయం చేయాలి అని.
అసలు ప్రస్తుత సమాజంలో జనాల పోకడ ఏమిటి? వాళ్ళ అలవాట్లు ఏమిటి? వాళ్ళ అవసరాలు ఏమిటి? అని. ఇప్పుడు ఎక్కడ చూసినా షుగర్లు, బీపీలు, ఊబకాయాలు జనాల్ని పీడిస్తున్న అనారోగ్యాలు. వీటి నుండి బయటపడడానికి వాళ్ళకున్న ప్రధానమైన మార్గం మిల్లెట్స్ అంటే తృణ ధాన్యాలను తినడం. ఇప్పుడు నగరాలలో వీటికున్న డిమాండ్ మరేటికీ లేదు. అందులోనూ ఆర్గానిక్ తృణధాన్యాలకయితే మరింత డిమాండ్ ఉంది”.
“తృణధాన్యాలు అంటే?” అడిగాడు వెంకటేశ్వర్లు “గతంలో మీరు విరివిగా పండించినవే.. వాణిజ్య పంటల మోజులో మీరు వదిలేసినవి. రాగులు, సజ్జలు, తైదలు, కొర్రలు, ఆండు కొర్రలు, జొన్నలు, సామలు, అరికెలు, ఊదలు.. ఇలాంటివి.
“అవి పండిస్తే ఏమొస్తయ్యి బాబూ”
“తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం.. ఇవి పండించడానికి ఎక్కువ నీరు అవసరంలేదు. తక్కువ నీటితో, కఠినమైన వాతావరణంలో కూడా సులభంగా ఇవి పండుతాయి. ఎరువులు, పురుగు మందుల గోలే ఉండదు. దాంతో పెట్టుబడి చాలా తగ్గిపోతుంది. దళారులు తక్కువ రేటుకి కొంటారన్న భయమూలేదు, ప్రభుత్వం నుండి గిట్టుబాటుధర రాదేమోనన్న ఆందోళనాలేదు. అసలు వాళ్ళ
అవసరమేలేదు”.
“వాళ్ళు లేకుండా పంటని ఎట్లా అమ్ముతాం?” మళ్ళీ అనుమానం.
“మనమే అమ్ముతాం. అంటే మీరిప్పుడు రైతు మాత్రమేకాదు వ్యాపారస్తుడు కూడా. ఈ తృణధాన్యాలతో షాపులు నడిపేవాళ్ళు, హోటళ్ళు నడిపేవాళ్ళు రైతుల దగ్గరికే వెళ్ళి ఎగబడికొంటున్నారు. అంతేకాదు ఎక్కడైనా ఆర్గానిక్ పంటలు దొరుకుతున్నాయంటే జనాలు కూడా స్వయంగా రైతుల దగ్గరికివెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు ఎక్కడికీ వెళ్ళాల్సినపనిలేదు, ఎవరినీ అడగాల్సినపనిలేదు. హాయిగా మీ ఇంటిదగ్గరే మంచి రేటుకి అమ్ముకోవచ్చు. కాకపోతే మనదగ్గర ఇవి దొరుకుతాయని కొంచెం ప్రచారం చేసుకుంటేచాలు”.
“అవన్నీ మాకేం తెలుసయ్యా” సగం ధైర్యం నిండిన మనసుతో అడిగాడు వెంకటేశ్వర్లు.
“అవన్నీ నేను చూసుకుంటాను మీరేం కంగారూపడకండి. మీరు చేయాల్సిందల్లా సంపూర్ణమైన విశ్వాసంతో మంచిగా ఈ పంటలు పండించడమే”.
“అందులో నాకు తిరుగులేదయ్యా” సంపూర్ణ విశ్వాసంతో అన్నాడు వెంకటేశ్వర్లు.
భర్త మొహంలో కనపడిన వెలుగునుచూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ కూతురి చేతులు పట్టుకుని కృతజ్ఞతగా అల్లుడు గిరి వంక చూసింది శ్రీలక్ష్మి. అందరి మొహాల్లోనూ ఆనందం తాండవించింది. వెంకటేశ్వర్లు మొహంలో మాత్రం ఇక నుండి నేనే రాజును – నేనే మంత్రిని అన్న ఉత్సాహంతో ఆనందపు చిరు మొలకలు మొలిచాయి.
- శ్రీనివాసరావు పోలుదాసు, 9440029014
చిరు మొలక
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 5 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)